రమ్యంగా తిరగరాత

చేతిరాతతోనే ప్రత్యేకత సాధించింది. అలాగని ఆమెవి ముత్యాల్లాంటి అక్షరాలో, మెరుపుల్లాంటి వాక్యాలో కాదు. అక్షరాలను తిరగేసి రాయడంతో దిట్ట అనిపించుకుని, అనేక అవార్డులూ అందుకుంది మామిడి రమ్య.

Updated : 20 Mar 2023 03:42 IST

చేతిరాతతోనే ప్రత్యేకత సాధించింది. అలాగని ఆమెవి ముత్యాల్లాంటి అక్షరాలో, మెరుపుల్లాంటి వాక్యాలో కాదు. అక్షరాలను తిరగేసి రాయడంతో దిట్ట అనిపించుకుని, అనేక అవార్డులూ అందుకుంది మామిడి రమ్య. అతి కొద్ది కాలంలోనే అచిర కీర్తి ఎలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే...

మాది అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదవలస గ్రామం. అమ్మ మీనాక్షి. నాన్న మోహన్‌రావు కిరాణాకొట్టు నడుపుతారు. మేం నలుగురు ఆడపిల్లలమైనా నిర్లక్ష్యం చేయకుండా అందరినీ చదివించారు. స్కూల్లో సరదాగా స్నేహితులు, కుటుంబసభ్యుల పేర్లు తిరగ రాసి అద్దంలో చూపిస్తే అంతా మెచ్చుకునేవాళ్లు. కానీ అదే గుర్తింపు తెస్తుందని అప్పుడు తెలీదు. చదువైపోయే దాకా మిర్రర్‌ రైటింగ్‌ జోలికి వెళ్లలేదు. గతేడాది డిప్లొమా అయ్యాక ఏదైనా భిన్నంగా చేయాలనుకుని మా టీచర్‌ను కలిశాను. ఆయన మిర్రర్‌ రైటింగ్‌ను ప్రస్తావించడంతో గూగుల్లో వెతికాను. వివిధ భాషల్లో వేగంగా తిరగ రాసేవారికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని తెలిసింది. అది నాకు చేతనైన విద్యే. దాన్ని ఫ్రొఫెషనల్‌గా ఎలా మార్చుకోవాలో శోధించాను. అందాకా తెలుగు, ఆంగ్లాలు మాత్రమే రాసే నేను అంతర్జాలం సాయంతో హిందీ, గుజరాతీ, తమిళం, మలయాళం, నేపాలీ తదితర భాషలు నేర్చుకున్నాను. వాటన్నిటినీ, అంకెలనూ కూడా తిరగేసి రాయడంలో పట్టు సాధించాను.

అనేక భాషల్లో ప్రావీణ్యం..  నా ప్రతిభకు బాగానే గుర్తింపు వచ్చింది. వందేమాతర గీతాన్ని తెలుగులో 90 క్షణాల్లో తిరగేసి రాసినందుకు, ఆంగ్లంలో 250 అక్షరాలను 2నిమిషాల్లో మిర్రర్‌రైటింగ్‌లో రాసి గుర్తింపు తెచ్చుకున్నా. తర్వాత తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో వందేమాతర గీతాల మిర్రర్‌ రైటింగ్‌కు పురస్కారాలు వచ్చాయి. తెలుగులో రామయాణం, ఆంగ్లంలో అంబేడ్కర్‌ జీవితచరిత్ర, హిందీలో రంజాన్‌ పండుగ చరిత్ర, తమిళ, మలయాళ, నేపాలీ, గుజరాతీ తదితర భాషల్లో వందేమాతర గీతాన్ని రాసినందుకు ఇంటర్నేషనల్‌ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. గతేడాది డిసెంబరులో కలాం వరల్డ్‌ రికార్డు కూడా వచ్చింది. ఒకే ఏడాది 5 ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నందుకు నాకంటే ఎక్కువ అమ్మానాన్నలు సంతోషించారు. మరింత ప్రగతి సాధించేందుకు మరో 40 బాషలు నేర్చుకుంటున్నాను.

గిన్నిస్‌బుక్‌లో స్థానం సాధిస్తా.. ఏదైనా దక్కించుకోవాలంటే నిత్యశోధన, పట్టుదల ఉండాలని టీచర్లు చెప్పేవారు. అందుకే మిర్రర్‌ రైటింగ్‌లో కష్టపడి సాధన చేశాను. అమ్మానాన్నలకు మంచి పేరు తేవాలని పట్టుదలతో శ్రమించాను. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు ఆనందాన్నిస్తోంది. కానీ ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్నాను. విదేశాల నుంచి వచ్చే అవార్డులను విడిపించు కోవడానికి డెలివరీ చార్జీలకే వేలకొద్దీ ఖర్చవుతోంది. ఆర్థిక ప్రోత్సాహం లభిస్తే గిన్నిస్‌బుక్‌లో కూడా స్థానం సంపాదించగలననే నమ్మకం నాకుంది.

 సూరకత్తి లక్ష్మణ్‌ బాబు, గూడెంకొత్తవీధి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్