మన దేశం.. అమ్మాయిల కోసం!

తండ్రి చనిపోతే, తల్లి కూలీకి వెళ్లి ఆమెను పెంచింది. ఎన్నో కష్టాలకోర్చి ఆ అమ్మాయి పెద్ద చదువులు చదవడమే కాదు... పర్వతారోహకురాలిగానూ రికార్డులు సాధించింది.

Published : 05 Jan 2023 01:00 IST

తండ్రి చనిపోతే, తల్లి కూలీకి వెళ్లి ఆమెను పెంచింది. ఎన్నో కష్టాలకోర్చి ఆ అమ్మాయి పెద్ద చదువులు చదవడమే కాదు... పర్వతారోహకురాలిగానూ రికార్డులు సాధించింది. మన దేశంలో మహిళలకు రక్షణ లేదన్న మాటలను నిజం కాదని నిరూపించాలనుకుంది. అందుకోసం సైకిల్‌పై సంపూర్ణ భారత్‌ యాత్ర చేస్తోన్న 24ఏళ్ల ఆషా మాల్వియా స్ఫూర్తి కథనమిది.

షా వాళ్లది మధ్యప్రదేశ్‌లో ఒక కుగ్రామం. నిరుపేద కుటుంబం. తన మూడో ఏటే తండ్రిని కోల్పోయింది. తల్లి కూలి పనులు చేస్తూ తనని పెంచింది. ‘అమ్మ అంతటి కష్టంలో కూడా నన్ను చదివించింది. ఆడ పిల్లను ఎందుకు చదివిస్తున్నావని బంధువులందరూ విమర్శించినా అమ్మ మాత్రం అవేవీ పట్టించుకోకు, బాగా చదువుకోవాలి, ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఎప్పుడూ చెప్పేది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే విమర్శలను లెక్కచేయకూడదని, అనుకున్నది సాధించి నిరూపించాలని చెప్పేది. తన స్ఫూర్తితోనే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో పీజీ చేశా. చిన్నప్పటి నుంచి క్రీడలు, పర్వతారోహణపై నాకు ఎనలేని ఆసక్తి. ఆర్థికంగా, కుటుంబపరంగా ఇబ్బందులెన్నో ఎదుర్కొన్నా. అవన్నీ దాటి నా ఆశయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొన్నా’ అని వివరించింది ఆషా. 

శిఖరాలను చేరి..

క్రీడల్లో చురుగ్గా పాల్గొనే ఆషాకు పర్వతారోహణలో శిక్షణ అందుకునే అవకాశం దక్కింది. ‘ఈ విషయంలో ఎంతోమంది నాకు సహకరించారు. వారి చేయూత నా కలను నెరవేర్చింది. యుక్తవయసులోనే నేపాల్‌- భూటాన్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దులోని 19,545 అడుగుల ఎత్తు టెంజింగ్‌ఖాన్‌, 20,500 అడుగులెత్తు బీసీ రాయ్‌ పర్వతశిఖరాలను అధిరోహించి జాతీయపతాకాన్ని ఎగురవేయగలిగా. ఈ సాహసాలకు రికార్డ్స్‌లో స్థానాన్ని దక్కించుకోగలిగా. ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో విదేశీయులతోనూ మాట్లాడుతూ ఉండేదాన్ని. మన దేశంలో మహిళలకు రక్షణ తక్కువనే భావన చాలా దేశాల్లో ఉన్నట్టు గమనించా. ఇది దురభిప్రాయం అని నిరూపించాలని, మహిళా రక్షణపై అందరికీ అవగాహన కలిగించాలని అనిపించింది. దేశవ్యాప్తంగా సైకిల్‌ యాత్ర చేపట్టి ఈ అంశంలో చైతన్యాన్ని తేవాలనుకున్నా. నా యాత్రకు సహకరించాలని మా రాష్ట్ర పర్యటక శాఖకు దరఖాస్తు చేశా. వారు అనుమతితోపాటు జీపీఎస్‌ వంటి సౌకర్యాలతో సైకిల్‌ను ఉచితంగా అందించారు. గత నవంబరు ఒకటో తేదీన మధ్యప్రదేశ్‌ నుంచి ప్రారంభించి గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 6,700 కిలోమీటర్లు ప్రయాణించా. ఈ ఏడాది ఆగస్టు చివరికల్లా దేశమంతా పర్యటించి చివరగా దిల్లీలో రాష్ట్రపతిని కలుసుకోనున్నా. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, గవర్నరు ఆరిఫ్‌ ఖాన్‌లను కలుసుకోగలిగా. మహిళారక్షణ సాధికారత వంటి అంశాలపై నేను ప్రయాణించే ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాల విద్యార్థుల్లో అవగాహన కలిగించడానికి కృషి చేస్తున్నా. ఈ యాత్రలోని అనుభవాలను వారితో పంచుకొంటున్నా’ అని వివరిస్తున్న ఆషా ఆశయం అభినందనీయం కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్