Sunitha Anand- pratyusha sadhu: మాటలతో ఆటాడేస్తారు!

దేశమంతా ఐపీఎల్‌ ఫీవర్‌ నడుస్తోంది. ఈసారి ప్రేక్షకులను ఆకర్షించిన వారిలో ఆటగాళ్లే కాదు.. ఇద్దరు మహిళలూ ఉన్నారు. అచ్చ తెలుగు వ్యాఖ్యానం, యాంకరింగ్‌లతో అందరి చూపూ తమవైపు తిప్పుకొన్నారు సునీత ఆనంద్‌, ప్రత్యూష సాధు.

Updated : 21 May 2023 09:35 IST

దేశమంతా ఐపీఎల్‌ ఫీవర్‌ నడుస్తోంది. ఈసారి ప్రేక్షకులను ఆకర్షించిన వారిలో ఆటగాళ్లే కాదు.. ఇద్దరు మహిళలూ ఉన్నారు. అచ్చ తెలుగు వ్యాఖ్యానం, యాంకరింగ్‌లతో అందరి చూపూ తమవైపు తిప్పుకొన్నారు సునీత ఆనంద్‌, ప్రత్యూష సాధు. వసుంధరతో తమ కామెంటరీ పంచుకున్నారు..


చీరలో కామెంటరీ..

నాన్న నూకల ఆనంద్‌బాబుకి క్రికెట్‌ అంటే పిచ్చి. సునీల్‌ గావస్కర్‌ పేరు కలిసేలా నాకు ‘సునీత’ అని పెట్టారు. ఆయన్ని చూసే క్రికెటర్‌ అవ్వాలనుకున్నా. హైదరాబాదీ అమ్మాయిని. కోచింగ్‌లో చేరదామనుకుంటున్నప్పుడు మా స్కూల్లోనే కొందరు ప్రాక్టీసు చేయడం చూశా. కోచ్‌ మరెవరోకాదు మిథాలీరాజ్‌ వాళ్ల నాన్నే. క్రికెట్‌పై ఆసక్తి నాన్నెంత సంతోషించారో. కానీ కొన్నిరోజులకే యాక్సిడెంట్‌లో చనిపోయారు. అప్పుడే ఇంటర్‌ స్కూల్‌ టోర్నమెంట్‌. ఆడతానంటే ‘అమ్మాయిలకీ ఆటలేంట’న్నారు తాత, బంధువులు. బతిమాలినా ఒప్పుకోలేదు. గదిలో ఒంటరిగా ఏడుస్తున్న అమ్మ దగ్గరికెళ్లి.. సందేహిస్తూనే విషయం చెప్పా. ‘వందశాతం ఇస్తానంటే వెళ్లు. నేను అండగా ఉంటా. లేదంటే దాని జోలికెళ్లొద్దు’ అంది. అదే నా జీవితంలో మలుపు. బయటికొచ్చి ధైర్యంగా నేను ఆడతున్నానని కచ్చితంగా చెప్పా. అప్పటికి నాకు 11ఏళ్లే. అప్పటిదాకా వద్దన్న మా తాతగారు గెలిచి మెడల్‌తో వస్తే ఫొటోలు తీసుకొని అందరికీ గర్వంగా చెప్పుకొన్నారు. తర్వాత షరామామూలే. అమ్మ కుట్టుపని చేసి మమ్మల్ని పోషించేది. మావయ్యలు, పెద్దనాన్న సాయముండేది. నేను పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, స్పోర్ట్స్‌ స్కాలర్‌షిప్‌తో పీజీ పూర్తిచేశా. వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ని. భారత్‌ తరఫున వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌, ఆసియా కప్‌, ఆస్ట్రేలియా సిరీస్‌లకీ ఆడా. రైల్వేస్‌కి దరఖాస్తు చేస్తే ట్రయల్స్‌కీ పిలుపు రాలేదు. దీంతో ఫిట్‌నెస్‌, యోగా కోర్సులు చేసి అపోలో సహా ఎన్నో సంస్థల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా చేశా. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సీనియర్‌ టీమ్‌కి స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ని. రెండేళ్లక్రితం క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నా. ‘ఇండియా- న్యూజీలాండ్‌ సిరీస్‌కి తెలుగు కామెంటేటర్‌ కోసం చూస్తున్నారు. ఆసక్తి ఉందా’ని  వెంకటపతి రాజు అడిగారు. అది చేశాక డబ్ల్యూపీఎల్‌కి కామెంటేటర్‌, ఐపీఎల్‌కి ప్రెజెంటేటర్‌ అవకాశాలొచ్చాయి. తెలుగుకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆ సంప్రదాయాన్ని వ్యక్తీకరించేలా చీరలో కామెంటరీ చెబితే బాగుంటుందనుకుని నిర్వాహకులను ఒప్పించి మరీ చేశా. క్రికెట్‌ పరిజ్ఞానం, అనుభవం ఉంది కాబట్టి, ఆటగాళ్లు, ప్రేక్షకుల ఆలోచనలు తెలుస్తాయి. దీంతో సునాయాసంగా చేసుకుంటూ వెళ్లా. తొలిసారే విజయవంతంగా చేసినందుకు ప్రశంసలూ అందుకున్నా. డబ్ల్యూపీఎల్‌ మధ్యలోనే  పెళ్లైంది. మావారు విశ్వకర్ణ, కన్నడ సినీ నటులు. అమ్మ అన్నపూర్ణ దేవి కుట్టుపనితో మమ్మల్ని పోషించడం కష్టమని టీచర్‌ ట్రైనింగ్‌ తీసుకొని ఉపాధ్యాయురాలైంది. అక్క పారా ఎక్సెల్‌లో, తమ్ముడు యూఎస్‌ సంస్థలో, నేనిలా స్థిరపడ్డామంటే ఆమె వల్లే. మమ్మల్ని చూసి తను గర్వపడుతోంది. తనలానే నాకు దన్నుగా నిలుస్తోన్న అత్తమామలు దొరకడం ఆనందంగా ఉంది.


మొదటిరోజే లైవ్‌..

దివింది ఆంగ్లమాధ్యమమైనా తెలుగులో చక్కగా మాట్లాడుతున్నానంటే అమ్మానాన్నల చలవే. పుస్తకాలు, పద్యాలు చదివించేవారు. అసలు రాజమహేంద్రవరమైనా పెరిగిందంతా హైదరాబాద్‌. నాన్న జగన్నాథ శర్మ దక్షిణమధ్య రైల్వే ఉద్యోగి, అమ్మ నాగమణి. ఎంబీఏ చదివా. ఫేస్‌బుక్‌లో చూసి ఓ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు’కి సంప్రదించారు. నాకెలాగూ ఆసక్తే కాబట్టి సరేనన్నా. దర్శకుడు క్రిష్‌ నన్ను చూసి ఆడిషన్‌ లేకుండానే టేక్‌కి రెడీ అవ్వమన్నారు. అరగంటలో తొలిషాట్‌.. ప్రకాష్‌రాజ్‌, బాలకృష్ణలతో! అయినా ఒకే టేక్‌లో పూర్తిచేశా. తర్వాత ‘కాంచనమాల’ సీరియల్‌, ఇంకొన్ని సినిమాల్లోనూ నటించా. పాటలకి కోరస్‌ పాడా. స్పోర్ట్స్‌ ప్రెజెంటేటర్‌ కోసం వెదుకుతున్నారని ఫ్రెండ్‌ చెబితే సరదాగా ప్రయత్నించా. క్రికెట్‌పై లోతైన పరిజ్ఞానం లేదు. ఎంపికయ్యానంటే నమ్మలేకపోయా. మరుసటిరోజే ముంబయి వచ్చేయమన్నారు. ఆట గురించి లోతుగా తెలుసుకునే సమయమే దొరకలేదు. మొదటిరోజే లైవ్‌. అయినా భయపడలేదు. డబ్ల్యూపీఎల్‌కి రెండున్నర గంటల లైవ్‌ విజయవంతంగా చేశా. అదిచూసి అందరూ అనుభవజ్ఞురాలిలా చేశావని మెచ్చుకుంటోంటే ఆనందమేసింది. అప్పటివరకూ ఎవరికీ చెప్పే అవకాశమే రాలేదు. లైవ్‌లో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నాన్న, అత్తమామలకి నాపై నమ్మకమెక్కువ. వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. మావారు వరుణ్‌ సాధు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. తనకి క్రికెట్‌ అంటే ఇష్టం. సందేహాలేమున్నా తననీ, తోటి సభ్యులనీ అడిగి తెలుసుకున్నా. డబ్ల్యూపీఎల్‌ తర్వాత ఐపీఎల్‌ అంతా ఒక్కదాన్నే చేశా. మూడు నెలలు ఇంటికి దూరంగా ఉన్నా. హైదరాబాద్‌, ముంబయి.. ప్రయాణాలతో అలసట, నిద్రా కరవయ్యేది. కానీ స్టూడియో కొచ్చాక తెలియని ఉత్సాహమొచ్చేది. ఈరోజు కొత్తగా ఏంచేద్దామని చర్చిస్తుంటా. కొత్త ఆటగాళ్ల నేపథ్యాలు తెలుసుకొని ప్రస్తావించేదాన్ని. వీళ్ల ప్రస్థానం చూశాక గౌరవమే కాదు.. వాళ్ల కష్టం ముందు నాదెంత అని స్ఫూర్తినీ తెచ్చుకున్నా. టెక్నికల్‌ పదాలు వాడకుండా స్పష్టమైన తెలుగులో అలవోకగా మాట్లాడుతున్నారంటూ సోషల్‌ మీడియాలోనూ మెచ్చుకుంటూ మెసేజ్‌లొస్తోంటే ఆనందంగా ఉంది. నటిగా మంచి పాత్రలు చేయాలి. స్పోర్ట్స్‌ ప్రెజెంటేటర్‌గానూ రాణించాలన్నది కోరిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్