Manjula kumari: వేలమంది బరువు బాధ్యతలు నావే

అందాల రాణిగా మెరవడమే కాదు... అధిక బరువుతో ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్న వారికి ఉపశమనం కలిగిస్తూ వ్యాపారవేత్తగానూ ఎదిగారామె. అందాల పోటీల్లో వెలిగిపోవాలనుకొనేవారికి మార్గనిర్దేశం చేస్తూ మెంటార్‌గానూ వ్యవహరిస్తున్నారు డాక్టర్‌ వారణాసి వెంకట మంజుల కుమారి. మిస్‌ ఆంధ్ర నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన వైనాన్ని వసుంధరతో పంచుకున్నారు..

Updated : 28 Apr 2023 04:34 IST

అందాల రాణిగా మెరవడమే కాదు... అధిక బరువుతో ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్న వారికి ఉపశమనం కలిగిస్తూ వ్యాపారవేత్తగానూ ఎదిగారామె. అందాల పోటీల్లో వెలిగిపోవాలనుకొనేవారికి మార్గనిర్దేశం చేస్తూ మెంటార్‌గానూ వ్యవహరిస్తున్నారు డాక్టర్‌ వారణాసి వెంకట మంజుల కుమారి. మిస్‌ ఆంధ్ర నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన వైనాన్ని వసుంధరతో పంచుకున్నారు..

సంప్రదాయాలు, ఆచారాలంటే ప్రాణం పెట్టే కుటుంబమే అయినా నన్ను అర్థం చేసుకుని వెన్నుతట్టారు నాన్న. మాది నెల్లూరు జిల్లాలోని వారణాసి వారి కండ్రిగ. అమ్మ కమల. నాన్న కృష్టమూర్తి ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌. నాన్న ఉద్యోగరీత్యా చెన్నైలో ఉన్నప్పుడు తనతోపాటు అక్కడకు తీసుకెళ్లి నాకిష్టమైన ఎత్తుచెప్పులు కొనిచ్చేవారు. అవి వేసుకొని నడుస్తుంటే తెలిసిన ఓ అక్క ‘ఏంటి మోడల్‌లా ర్యాంప్‌వాక్‌ చేస్తున్నావ్‌?’ అంది. ఓహో మోడల్‌ అయితే ఇలా నడవొచ్చా అనుకున్నా. 14 ఏళ్లప్పుడు మిస్‌ టీన్స్‌లో పాల్గొని బెస్ట్‌ స్కిన్‌ అండ్‌ బ్యూటీ టైటిల్‌ సాధించి, సంబరపడిపోయా. నన్ను వైద్యురాలిగా చూడాలన్నది మా అమ్మ కల. అందుకే గుంటూరు సదరన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (సిమ్స్‌)లో ఫిజియోథెరపీ చదివి.. అక్కడే పీజీ చేశాను. 2003లో ‘మిస్‌ గుంటూరు’గా, 2004లో మిస్‌ ఆంధ్రగా గెలిచా. ఆ సమయంలో కె.విశ్వనాథ్‌ గారు తన సినిమాలో అవకాశం ఇచ్చినా నాన్నకి ఇష్టంలేక వదులుకున్నా. పీజీ తర్వాత పెళ్లి. మాకో బాబు. 12ఏళ్ల తర్వాత.. 2018లో ‘మిసెస్‌ అమరావతి’గా పోటీ చేసి విజేతనయ్యా. ముంబయిలో జరిగిన ‘మిసెస్‌ ఇండియా’ పోటీల్లో రన్నరప్‌గా నిలిచా. 2021లో ‘మిసెస్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియా’గానూ ఎంపికయ్యా. ఈ ఏడాది ఫిలిప్పీన్స్‌లో జరగబోయే మిసెస్‌ యూనివర్స్‌ పోటీలకు సిద్ధమవుతున్నా.

అప్పుడు కుంగిపోయా..

నన్ను ఎంతగానో ప్రేమించిన నాన్నకి కిడ్నీలు పాడయ్యాయని తెలిసి చాలా బాధపడ్డా. ఎవరూ ముందుకు రాకపోవడంతో.. అమ్మే తన కిడ్నీ ఇచ్చింది. నాన్న కోలుకున్న.. ఏడాదికి గుండెపోటుతో మరణించారు. అప్పట్నుంచీ.. ఆరోగ్య సమస్యలపై అవగాహన తీసుకురావడం ముఖ్యమనుకున్నా. అమ్మ ‘నేను బాబుని చూసుకుంటాను. నీకు ఆసక్తి ఉన్న రంగంలోకి వెళ్లు’ అని భరోసానిచ్చింది. అందుకే ఏ భయమూ లేకుండా ఎక్కడికైనా వెళ్లగలిగేదాన్ని. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మొనాటాలో డాక్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ థెరపీ చేశాను. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లో... మెడికల్‌ కాస్మెటాలజీని అధ్యయనం చేశాను. కాంబోడియాలోని ఐఐసీ యూనివర్సిటీలో హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేసి 2020లో ‘వర్ణాస్‌ హెల్త్‌ కేర్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌’ను నెల్లూరులో ప్రారంభించా. దీనికి దిల్లీ, గుంటూరుల్లోనూ బ్రాంచ్‌లున్నాయి. శస్త్రచికిత్స లేకుండా  బరువు తగ్గించడం మా లక్ష్యం. సుమారు 7500 మందికిపైగా అధిక బరువున్న వారికి ఉపశమనం కలిగించడం నాకు చాలా సంతృప్తినిస్తూ ఉంటుంది. మా సంస్థలో 30మంది ఉద్యోగులు ఉన్నారు. వార్షికాదాయం రూ.1.5 కోట్లు. నాన్‌ సర్జికల్‌ పద్ధతుల్లో బరువు తగ్గించే విధానాలపై మలేషియా, అమెరికాల్లో మేం అనుసరిస్తున్న విధానాలకు ప్రశంసలు అందాయి. త్వరలో షికాగోలోనూ పరిశోధనా పత్రాన్ని సమర్పించబోతున్నా. ఇప్పటి వరకూ  అధిక బరువుని ఆరోగ్యకర పద్ధతుల్లో తగ్గించే విధానాలపై 18 పేపర్‌ ప్రజంటేషన్లు ఇచ్చా. లాక్‌డౌన్‌ సమయంలో వ్యాయామం లేక అధికబరువుతో ఇబ్బంది పడుతున్న వారికి అవగాహన కలిగించేందుకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫ్లామ్‌ ఏర్పాటు చేసి 125 దేశాలకు చెందిన నిపుణులతో చర్చావేదిక నడిపాను. దీనికి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ యూకే నుంచి గుర్తింపు దక్కింది. ఉమెన్‌ ఐకాన్‌, గ్లోబల్‌ అవుట్‌రీచ్‌ హెల్త్‌కేర్‌ నుంచి డైనమిక్‌ సీఈవోగా అవార్డు అందుకున్నా. అందాలపోటీల్లో అందంతోపాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, ఆత్మ విశ్వాసం కూడా చూస్తారు. అవన్నీ నేర్పించేందుకు మెంటర్‌గా, జడ్జ్‌గా వారిని ముందుండి నడిపిస్తున్నా. కంఫర్ట్‌ జోన్‌లోనే కూర్చుంటే ఏమీ సాధించలేం. రిస్కు తీసుకుంటేనే గెలవగలం.

-మన్నెం రమాదేవి,హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్