ఐపీఎస్‌ కావాలనుకున్నా.. ఇలా సేవ చేస్తున్నా

పనిలో లింగ వివక్ష... ఆడపిల్లలపై దాష్టీకాలు... ముక్కుపచ్చలారని పసి పిల్లలపై అఘాయిత్యాలు... చూసి కదిలిపోయారామె. వీటికి అడ్డుకట్ట వేయాలంటే మహిళల్లో చైతన్యం తేవాలనుకున్నారు.

Updated : 11 Jan 2023 07:27 IST

పనిలో లింగ వివక్ష... ఆడపిల్లలపై దాష్టీకాలు... ముక్కుపచ్చలారని పసి పిల్లలపై అఘాయిత్యాలు... చూసి కదిలిపోయారామె. వీటికి అడ్డుకట్ట వేయాలంటే మహిళల్లో చైతన్యం తేవాలనుకున్నారు. అందుకే యాభై గ్రామాలను దత్తత తీసుకుని సేవా, చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. తను వ్యాపారంలో రాణించడమే కాదు, మరెంతో మందిని స్వయం ఉపాధి బాట పట్టిస్తున్నారు.. సునీత కొర్రపాటి. తన సామాజిక కార్యక్రమాల్ని వసుంధరతో పంచుకున్నారిలా...

మన చుట్టూ గమనిస్తే చాలు మహిళల్ని అశక్తులుగా మార్చి ఆడుతున్న ఆటలెన్నో కనిపిస్తాయి. వాటన్నింటికీ మనం తక్షణం పరిష్కారం చూపించలేకపోవచ్చు. కానీ ఓర్పుతో ప్రయత్నిస్తే వారిలో మార్పు తేవచ్చని నమ్మా. అందుకే స్త్రీల హక్కులూ, వారికి అండగా నిలబడే చట్టాల గురించి చైతన్యం తీసుకొస్తున్నా. తెలంగాణ మహిళా కమిషన్‌, ఐసీడీఎస్‌ల సహకారంతో నర్సాపూర్‌ ప్రాంతంలోని 50 గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పదో తరగతి వరకూ మెదక్‌ వెస్లీ పాఠశాలలో చదివా. హైదరాబాద్‌లో పీజీ (సైకాలజీ) చేశా. చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. చదువయ్యాక నా కాళ్లపై నేను నిలబడుతూ... కొంత మందికి ఉపాధీ ఇవ్వాలనుకున్నా. ‘ఆర్క్‌’ సంస్థను ఏర్పాటు చేసి ప్రింటింగ్‌ స్టేషనరీ, స్కూళ్లకు యూనిఫామ్‌ల సరఫరా మొదలు పెట్టా. వ్యాపారం బాగానే ఉన్నా... ఏదో అసంతృప్తి. ముఖ్యంగా యువత డిగ్రీలు చేస్తున్నా... సరైన ఉద్యోగం దొరక్క బాధపడుతుండటం నన్ను ఆలోచనల్లో పడేసింది. అలాంటివారికి నైపుణ్యాలను అందించి ఉపాధి దొరికేలా చేయాలనుకున్నా. కుటుంబ సభ్యుల సాయంతో 2008లో ‘ఏఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ’ని ప్రారంభించా.

వారి సలహాతో...

ఓ పక్క వ్యాపారం, మరో పక్క సేవా సంస్థ ద్వారా ఉపాధి శిక్షణ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిచేది. కొంత మంది మహిళలూ, చిన్నారుల సమస్యలు కొన్ని నా దృష్టికి తీసుకొచ్చి, ఆ విషయంలో కూడా ఏమైనా చేయమని సలహా ఇచ్చారు. అవి చూసి నేను కదిలిపోయా. అప్పటి నుంచి వెళ్లిన ప్రతిచోటా పిల్లల భవిష్యత్తు, స్త్రీల హక్కుల గురించి మాట్లాడటం మొదలు పెట్టాం. అందులో భాగంగానే వీరికి చేయూత నివ్వాలన్న ఆలోచనతో విస్తృత అధ్యయనంతో ఓ నివేదిక తయారు చేశా. దాన్ని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ఆమోదించారు. అమలుకు సాయం కూడా చేస్తామన్నారు. అలా ప్రభుత్వ సంస్థల సహకారంతో నిరక్షరాస్యతతో పాటు బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే నర్సాపూర్‌ చుట్టుపక్కల ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. అయితే, సమస్య నేనకున్నంత చిన్నది కాదు, ఒక్కరోజులో మార్పూ రాదు అన్నవి త్వరగానే అర్థమయ్యాయి. అలాగని మధ్యలో వదిలేయలేను కదా! పొదుపు నుంచి భద్రత వరకూ... అన్ని విషయాలనూ వారితో చర్చించడం మొదలుపెట్టాం. షీ టీంలూ వాటి పనితీరు, మహిళల హక్కులూ, వారికి రక్షణ కల్పించే చట్టాల గురించి చైతన్యాన్ని కల్పిస్తూ ప్రతి బుధవారం వెడ్నెస్‌డే వాక్‌ని నిర్వహిస్తున్నాం. వారంలో రెండు సార్లు స్కూళ్లకు వెళ్లి... గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ వంటివి చెబుతున్నాం. ఇప్పటికి 13, 14 వేల మంది పాఠశాల, కళాశాల విద్యార్థినులు, మహిళలకు చేరువయ్యాం. త్వరలోనే ఓ రేడియో ఛానెల్‌నీ తీసుకు రానున్నాం.

సొంత ఖర్చుతోనే...

మాటలు మాత్రమే చెబితే మనసుకి ఎక్కవు. అందుకే చేతల్లోనూ వారి జీవితాలకి భరోసా కల్పించాలనుకున్నా. ఆర్థిక సాధికారతతోనే స్త్రీలకు నిర్ణయాధికారం దక్కుతుందన్నది నా నమ్మకం. అందుకే మహిళలకోసం ఉపాధి శిక్షణా కార్యక్రమాలు రూపొందించా. మగ్గం వర్క్‌, కంప్యూటర్‌ తరగతులు, కుట్టు శిక్షణ,  బ్యుటీషియన్‌ కోర్సు, పెయింటింగ్‌ తదితరాలను ఉచితంగా నేర్పిస్తున్నాం. 700 మందికి శిక్షణ ఇచ్చాం. 120 మంది మహిళలు టైలరింగ్‌ నేర్చుకున్నారు. 55 మందికి కుట్టు మెషిన్లు అందించాం. వారు నిలదొక్కుకోవడం కోసం యూనిఫామ్‌ వర్క్‌ ఆర్డర్లనూ ఇప్పించాం. విద్యార్థినులకు వేల శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశాం. కొన్ని బాల్య వివాహాల్ని ఆపగలిగాం. వీటన్నింటికీ మా సంస్థ సభ్యులమే తలా కొంత వేసుకుని ఖర్చు చేస్తున్నాం. నా భర్త రాకేశ్‌ రైల్వే ఉద్యోగి. ఆయన ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నా. ఐపీఎస్‌ అయ్యి సమాజానికి సేవ చేయాలన్నది నా చిన్ననాటి కల. అది నెరవేరకున్నా సామాజిక కార్యకర్తగా ఇలా సేవ చేస్తూ సంతృప్తిని పొందుతున్నా.

- కణతాల భిక్షపతిచారి, నర్సాపూర్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్