STEM: అందుకే వీళ్లిద్దరికీ 33 లక్షల స్కాలర్‌షిప్!

ఒకరేమో సైబర్‌ భద్రతే తన భవిష్యత్‌ లక్ష్యమంటూ ముందుకు సాగితే..మరొకరు ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాల్లో ఆరితేరుతూ తన ప్రతిభాపాటవాల్ని చాటుకుంటున్నారు..ఇలా శాస్త్ర సాంకేతిక రంగాల్నే (STEM) తమ కెరీర్‌గా ఎంచుకొని.. ఆ దిశగా ముందుకు సాగుతున్నారు ఇద్దరు భారతీయ-అమెరికన్‌ అమ్మాయిలు రియా జెత్వానీ, మోనికా పాల్‌. తమ ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక ‘ఎడిసన్ స్కాలర్‌షిప్‌’నూ అందుకున్నారు. తద్వారా వచ్చే నాలుగేళ్లలో ఈ రంగాల్లో ఉన్నత....

Updated : 25 Mar 2023 16:46 IST

(Photos: Instagram)

ఒకరేమో సైబర్‌ భద్రతే తన భవిష్యత్‌ లక్ష్యమంటూ ముందుకు సాగితే..

మరొకరు ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాల్లో ఆరితేరుతూ తన ప్రతిభాపాటవాల్ని చాటుకుంటున్నారు..

ఇలా శాస్త్ర సాంకేతిక రంగాల్నే (STEM) తమ కెరీర్‌గా ఎంచుకొని.. ఆ దిశగా ముందుకు సాగుతున్నారు ఇద్దరు భారతీయ-అమెరికన్‌ అమ్మాయిలు రియా జెత్వానీ, మోనికా పాల్‌. తమ ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక ‘ఎడిసన్ స్కాలర్‌షిప్‌’నూ అందుకున్నారు. తద్వారా వచ్చే నాలుగేళ్లలో ఈ రంగాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు సుమారు రూ. 33 లక్షల ఉపకార వేతనాన్ని అందుకున్నారు ఈ టెక్ స్టూడెంట్స్‌. రాబోయే తరంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు ఇది ఆరంభం మాత్రమే అంటోన్న ఈ ఇద్దరమ్మాయిల గురించి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..


చదువు కొనసాగిస్తూనే..!

ఈ కాలంలో సైబర్‌ భద్రత పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే తమ సంస్థకు సంబంధించిన సమాచారాన్ని సురక్షితంగా, గోప్యంగా ఉంచుకోవడానికి ఆయా సంస్థలు వివిధ రకాల మార్గాల్ని అనుసరిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో హ్యాకింగ్‌ భయం లేకుండా సైబర్‌ భద్రత విషయంలో పూర్తి సురక్షిత చర్యలు తీసుకునేందుకు తన వంతు కృషి చేస్తానంటోంది రియా జెత్వానీ. ప్రస్తుతం క్యాలిఫోర్నియాలో నివసిస్తోన్న రియా.. ‘యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియా ఇర్విన్‌’లో ‘కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌’ విభాగంలో డిగ్రీ పూర్తిచేసింది. సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన పలు సంస్థల్లో ఇంటర్న్‌గా, రీసెర్చ్‌ ఫెలోగా పనిచేసింది. అంతేకాదు.. కంప్యూటర్‌ సమాచార భద్రత విషయంలో స్థానిక పత్రికలకు వ్యాసాలు కూడా రాసింది రియా. ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్లో చదువుకునేటప్పుడు ‘హ్యాకథాన్‌ లెర్నథాన్’ అనే ప్రాజెక్ట్‌కి కో-ఫౌండర్‌గా వ్యవహరించిన ఆమె.. ఈ వేదికగా క్రిప్టోగ్రఫీకి సంబంధించిన ప్రాథమిక అంశాలపై ప్రత్యేకమైన వర్క్‌షాప్‌ నిర్వహించింది. ఇందులో భాగంగానే పాస్‌వర్డ్‌ ప్రాముఖ్యత, సమాచార భద్రతలో దాని పాత్ర.. వంటి అంశాలపై అందరిలో అవగాహన కల్పించిందామె.

టెక్‌కు రక్షణ కవచంలా..!

సైబర్‌ సమాచార భద్రతలో భాగంగా.. IOATnet అనే మరో ప్రాజెక్ట్‌కు ప్రాతినిథ్యం వహించిన రియా.. తన ప్రతిభాపాటవాలతో ‘డిజిటల్‌ పీస్‌ కాంపిటీషన్‌’లో భాగంగా ఐదుగురు ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. ఇక గతేడాది ప్రతిష్టాత్మక ‘ఎడిసన్‌ స్కాలర్‌షిప్‌’నూ అందుకుందామె. తద్వారా రాబోయే నాలుగేళ్లలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో తన విద్యను కొనసాగించేందుకు సుమారు రూ. 33 లక్షల ఉపకార వేతనాన్ని సొంతం చేసుకుంది రియా.

‘శాస్త్ర సాంకేతిక రంగాల్లో కెరీర్‌ను కొనసాగించాలని స్కూలింగ్‌ దశలోనే నిర్ణయించుకున్నా. సైబర్‌ భద్రత విషయంలో నా నైపుణ్యాల్ని మరింతగా మెరుగుపరచుకొని.. సమాజానికి ప్రమాదకరంగా మారిన సైబర్‌ మోసాల్ని సమూలంగా అంతమొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా..’ అంటోన్న రియా త్వరలోనే అమెజాన్‌లో ‘సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌’ ఇంటర్న్‌షిప్‌లో భాగం కానుంది.


వాళ్లిద్దరి స్ఫూర్తితో..!

ప్రోగ్రామింగ్‌/కోడింగ్‌ నైపుణ్యాలలో పూర్తి పట్టు సాధించడమే తన లక్ష్యమంటోంది మరో ఇండో-అమెరికన్‌ టీన్ మోనికా పాల్‌. ‘యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియా’లో ‘డేటా సైన్స్‌’ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. ప్రస్తుతం ఇదే విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. అయితే తాను శాస్త్ర సాంకేతిక రంగాల్లో తన కెరీర్‌ను ఎంచుకోవడానికి ఇద్దరు మహిళలే స్ఫూర్తి అంటోంది మోనిక.

‘పాఠశాల దశ నుంచే కంప్యూటర్‌ సైన్స్‌ అంటే నాకు మక్కువ పెరిగింది. ఇందుకు మా అమ్మ, మా కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ కారణం. వాళ్లే నన్ను ఈ దిశగా ప్రోత్సహించారు. ఇక మా కజిన్‌ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలపై నా దృష్టి పడేలా చేశారు. భవిష్యత్తులో ఈ నైపుణ్యాలపై మరింత పట్టు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా..’ అంటూ తన లక్ష్యం గురించి చెప్పుకొచ్చిందీ యువ టెకీ. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఎడిసన్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన 30 మంది యువ ప్రతిభావంతుల్లో మోనిక కూడా ఒకరు. ఇప్పటివరకు ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌లో తన ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా ‘అకడమిక్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు - 2021’, ‘క్యాలిఫోర్నియా స్టేట్‌ సీల్‌ ఆఫ్‌ సివిక్‌ ఎంగేజ్‌మెంట్ - 2021’, ‘రెజిలియన్స్ అవార్డు - 2020’.. వంటి పురస్కారాలు అందుకుంది మోనిక. ఇలా టెక్‌ నైపుణ్యాలే కాదు.. భరతనాట్యం డ్యాన్సర్‌గా, ఈత శిక్షకురాలిగానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ యంగ్‌ టీన్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్