Asian Games: చెరకు తోటలో పరుగెత్తి.. డిప్రెషన్ నుంచి బయటపడి..!

క్రీడల్లో మెడల్‌ ఫేవరెట్‌గా/టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంటారు కొందరు క్రీడాకారులు. అంటే.. వాళ్లు పోటీ పడుతున్నారంటే ఏదో ఒక పతకం ఖాయం అనుకుంటాం. కానీ ఎలాంటి అంచనాల్లేకుండా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన కొందరమ్మాయిలు దేశానికి పతకాల పంట పండిస్తున్నారు.

Published : 05 Oct 2023 12:20 IST

(Photos: Instagram)

క్రీడల్లో మెడల్‌ ఫేవరెట్‌గా/టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంటారు కొందరు క్రీడాకారులు. అంటే.. వాళ్లు పోటీ పడుతున్నారంటే ఏదో ఒక పతకం ఖాయం అనుకుంటాం. కానీ ఎలాంటి అంచనాల్లేకుండా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన కొందరమ్మాయిలు దేశానికి పతకాల పంట పండిస్తున్నారు. అంతేనా.. ఆయా క్రీడల్లో తొలిసారి పతకాలు కొల్లగొడుతూ.. చరిత్రను తిరగరాస్తున్నారు. వారిలో చాలామంది ఆర్థిక కష్టాలు, వ్యక్తిగత సవాళ్లు దాటొచ్చిన వారే! అలాంటి కొందరు యువ అథ్లెట్స్‌ స్ఫూర్తి ప్రయాణం ఇది!

చెరకు తోటలో పరుగు!

‘ప్రభుత్వోద్యోగం సాధించాలి.. జీవితంలో స్థిరపడాలి..’ మీరట్‌కు చెందిన పారుల్‌ చౌధరి చిన్ననాటి కల ఇది. అసలు క్రీడల్లోకి రావాలని కానీ, వస్తానని కానీ కలలో కూడా అనుకోలేదామె. అయితే ఆమె తండ్రి కిషన్‌లాల్‌ ఓసారి తన కూతురు పారుల్‌ని ‘స్కూల్లో జరిగే పరుగు పోటీల్లో పాల్గొనచ్చుగా!’ అనడిగాడు. తండ్రి మాటను కాదనలేక.. ఆ పోటీల్లో పాల్గొన్న పారుల్.. ఒట్టి కాళ్లతోనే రేసులో పాల్గొని రెండు పతకాలు సాధించింది. అప్పుడే పరుగుపై ఆమెలో ఉన్న తృష్ణ బయటపడింది. అలా మొదలుపెట్టిన రన్నింగ్‌ జర్నీని నేటికీ నిర్విరామంగా కొనసాగిస్తోంది పారుల్‌. కుటుంబ ప్రోత్సాహంతో ఈ క్రీడలో శిక్షణ తీసుకున్న ఆమె.. తమ గ్రామంలోని గతుకు రోడ్లు, చెరకు తోటల్లోనూ పరిగెడుతూ.. రన్నింగ్‌లో తన నైపుణ్యాల్ని మరింతగా మెరుగుపరచుకుంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ పోటీల్లో పాల్గొంటూ పతకాలు ఒడిసిపడుతోన్న పారుల్‌.. ఈ ఏడాది బుడాపెస్ట్‌లో జరిగిన ‘ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌’లో అత్యుత్తమ ప్రదర్శన చేసి గత జాతీయ రికార్డును బద్దలుకొట్టింది. ఇక తాజాగా ఆసియా క్రీడల్లో భాగంగా.. 5000 మీటర్ల పరుగు పందెంలో పసిడి పతకం సాధించిందామె. అంతకుముందు ఇదే క్రీడల్లో 3000 మీటర్ల మహిళల స్టీపుల్‌ఛేజ్‌ ఈవెంట్‌లో రజతం కూడా కైవసం చేసుకుందీ మీరట్‌ రన్నర్.

‘చిన్నప్పుడు మా స్కూల్లో నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొంటావా అని నాన్న అడగ్గానే కాదనలేకపోయా. ఆ పోటీల్లో పరిచయమైన పరుగు నా కెరీర్‌గా మారుతుందని అస్సలు ఊహించలేదు. భవిష్యత్తులో ప్రభుత్వోద్యోగంలోనే స్థిరపడాలనుకున్నా. స్పోర్ట్స్‌ కోటాలో భాగంగా 2015లో రైల్వేలో ఉద్యోగం సంపాదించా. నా కల నెరవేరడంతో అప్పుడు ఆటను వదులుకోవాలనుకున్నా. కానీ క్రికెటర్‌ డయానా ఎడుల్జీ చెప్పిన స్ఫూర్తిదాయక మాటలతో నా ఆలోచనను మార్చుకున్నా.. నా తదుపరి లక్ష్యం ప్యారిస్‌ ఒలింపిక్స్‌!’ అంటోన్న పారుల్‌.. ఇప్పటివరకు తాను గెలిచిన పతకాలతో వాళ్లింట్లో ప్రత్యేకంగా ఓ గదే ఉందంటోంది. అన్నట్లు.. పారుల్‌ సోదరి ప్రీతి కూడా పరుగులో రాణిస్తోంది.


డిప్రెషన్‌ నుంచి బయటపడి..!

మనం ఏ రంగంలో ఉన్నా.. వరుస వైఫల్యాలు వేధిస్తుంటే ఒక రకమైన అసహనానికి లోనవుతుంటాం. ఒకానొక సమయంలో ఆ కెరీర్‌ని వదిలిపెడదామా అన్న ఆలోచనలూ వస్తుంటాయి. మీరట్‌కు చెందిన జావెలిన్‌ త్రో ప్లేయర్‌ అన్నూ రాణి కూడా ఒకానొక సమయంలో తన క్రీడా కెరీర్‌లో ఇలాంటి ఇబ్బందుల్నే ఎదుర్కొంది. ఇలాంటి ప్రతికూల ఆలోచనలతో ఒక దశలో డిప్రెషన్లోకి వెళ్లిపోయిన ఆమె.. ఆ తర్వాత రియలైజ్‌ అయి.. తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాలనుకుంది. ఈ పాజిటివిటీనే అన్నూను ఆసియా క్రీడల్లో తాజాగా స్వర్ణ పతకం సాధించేలా చేసింది. ఈ క్రీడల్లో తన నాలుగో ప్రయత్నంలో జావెలిన్‌ను 62.92 మీటర్ల దూరం విసిరిన ఆమె.. బంగారు పతకాన్ని తన మెడలో అలంకరించుకుంది. తద్వారా ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన తొలి భారతీయ మహిళా జావెలిన్‌ త్రోయర్‌గా చరిత్రకెక్కింది అన్నూ. ఆసియా క్రీడల్లో ఆమెకిది రెండో పతకం. 2014లో జరిగిన ఈ టోర్నీలో కాంస్యంతో మెరిసిందీ యువ అథ్లెట్.

‘నాకు చిన్నతనం నుంచే ఆటలంటే ప్రాణం. స్కూల్లో జావెలిన్‌ త్రో క్రీడను ఎంచుకున్నానన్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. తెలిస్తే ఆడనివ్వరన్న భయం. అందుకే వారికి తెలియకుండా ఊరి చివర ఉన్న పొలాల్లో సాధన చేసేదాన్ని. అయితే ఓసారి స్కూల్లో జరిగిన పోటీలో మొదటి బహుమతి వచ్చింది. ఈ విషయం ఎవరో నాన్నకు చెప్పారు. అంతే.. వెంటనే స్కూల్‌కొచ్చి నన్ను తిట్టారు. ‘అమ్మాయిలు ఊరి పొలిమేర దాటడానికి వీల్లేదు.. అలాంటిది మా అనుమతి లేకుండా నువ్వు ఈ ఆటను ఎలా ఎంచుకున్నావ్‌?’ అని మందలించారు. ఆ తర్వాత కోచ్‌ మా నాన్నను ఒప్పించడంతో.. ఇంట్లో పరిస్థితులు కాస్త సర్దుకున్నాయనే లోపే ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు సరిపడా డబ్బు లేక.. నాణ్యమైన స్పోర్ట్స్‌ కిట్‌ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఒంటరిగా ఏడ్చిన సందర్భాలూ ఎన్నో! టోక్యో ఒలింపిక్స్‌ సమయంలో మోకాలు, మడమ గాయాలతో ఉత్తమ ప్రదర్శన చేయలేకపోయా. ఆపైనా వరుస వైఫల్యాలతో ఆటను వదులుకోవాలనుకున్నా.. నా కోసం ప్రభుత్వం ఇంత ఖర్చు చేస్తున్నా నేను మంచి ప్రదర్శన చేయలేకపోతున్నానని డిప్రెషన్‌కూ లోనయ్యా. కానీ నీరజ్‌ చోప్రా ఆటతీరు నాలో స్ఫూర్తి రగిలించింది.. ఏదేమైనా.. గెలిచే దాకా పోరాడాలని నిర్ణయించుకున్నా..’ అంటోంది అన్నూ.

ధోనీ మాటలే స్ఫూర్తిగా.. అమ్మను మించిపోయి..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్