Israel-Gaza War: వీళ్ల ధైర్యానికి సలామ్!

కనిపిస్తే కాల్చివేయడం, పిల్లల్ని పురిట్లోనే చంపేయడం, మహిళలపై అత్యాచారాలు.. వెరసి ప్రస్తుతం జరుగుతోన్న ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధంలో హమాస్‌ ఉగ్రవాదుల చర్యలు అమానవీయతకు అద్దం పడుతున్నాయి. ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి.

Updated : 14 Oct 2023 18:34 IST

(Photos: Instagram)

కనిపిస్తే కాల్చివేయడం, పిల్లల్ని పురిట్లోనే చంపేయడం, మహిళలపై అత్యాచారాలు.. వెరసి ప్రస్తుతం జరుగుతోన్న ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధంలో హమాస్‌ ఉగ్రవాదుల చర్యలు అమానవీయతకు అద్దం పడుతున్నాయి. ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. ఇలాంటి భీకర యుద్ధంలో తమ దేశాన్ని, ప్రజల్ని కాపాడుకునేందుకు రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నారు అక్కడి సైనికులు. వారిలో పురుషులే కాదు.. మహిళలూ ఎంతోమంది! ప్రస్తుత యుద్ధంలో దాదాపు 40 శాతం మంది మహిళలు సైనికులుగా, జర్నలిస్టులుగా, వైద్య రంగంలో సేవలందిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ ఇటీవలే ఓ ప్రకటన విడుదల చేసింది. వీరిలో ప్రస్తుతం రక్షణ దళాల్లో పనిచేస్తోన్న వారే కాదు.. విదేశాల్లో స్థిరపడ్డ మాజీ మహిళా సైనికులు కూడా తిరిగి సైన్యంలో చేరుతూ.. దేశం కోసం పోరాడడం విశేషం. అలా ప్రస్తుత యుద్ధంలో తమ ధైర్యసాహసాల్ని ప్రదర్శిస్తోన్న కొందరు వీరనారుల గురించి తెలుసుకుందాం..!


లండన్‌ నుంచి తిరిగొచ్చి!

ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధ పరిస్థితుల్ని చూస్తుంటే.. అసలు అక్కడ ప్రజలు ఎలా ఉండగలుగుతున్నారో అనిపిస్తుంది. అయితే ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి ఎలా బయటపడదామా అని అక్కడి ప్రజలు ఆలోచిస్తుంటే.. మోరియా మెన్సర్ అనే అమ్మాయి మాత్రం ఏకంగా యుద్ధంలో పాల్గొనడానికే ఇజ్రాయెల్‌ చేరుకుంది. గతంలో ఇజ్రాయెల్‌ రక్షణ రంగంలో సైనికురాలిగా పనిచేసిన ఆమె.. ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. యుద్ధంలో తన స్నేహితురాలు చనిపోయిందని సమాచారం అందుకున్న ఆమె.. హుటాహుటిన స్వదేశం బయల్దేరి వచ్చింది.. శత్రువుతో పోరాడేందుకు మళ్లీ సైన్యంలో చేరానంటోంది మెన్సర్.

‘నేను పుట్టకముందే మా కుటుంబం ఇంగ్లండ్‌లో స్థిరపడింది. నేను అక్కడే పుట్టా. నా పదేళ్ల వయసులో ఇజ్రాయెల్‌ వచ్చా.. చిన్నతనం నుంచి సైన్యంలో చేరాలన్న కోరికతో నేను ఇక్కడే ఉండిపోయా. అప్పుడప్పుడూ లండన్‌ వెళ్లి అమ్మానాన్నల్ని కలిసొచ్చేదాన్ని. ఇజ్రాయెల్‌ సైన్యంలో సైనికురాలిగా, కమాండర్‌గా కొన్నేళ్ల పాటు పనిచేశా. పదవి ముగియడంతో ఈ మధ్యే మళ్లీ లండన్‌ వెళ్లా. ఇంతలోనే ఇక్కడ యుద్ధం మొదలవడం, నా ప్రాణ స్నేహితురాలు ప్రాణాలు కోల్పోవడం విన్నాక లండన్‌లో ఒక్క క్షణం కూడా ఆగలేకపోయా..’ అంటూ ఇజ్రాయెల్‌లో వాలిపోయిన ఆమె.. ప్రస్తుతం సైనికురాలిగా యుద్ధ క్షేత్రంలో విధులు నిర్వర్తిస్తోంది. మరోవైపు యుద్ధంలో సర్వం కోల్పోయిన వారికి సహకారం అందించేందుకు తన కుటుంబంతో కలిసి నిధులు కూడా సమీకరిస్తోందీ డేరింగ్‌ సోల్జర్.


విధ్వంసాన్ని కళ్లకు కడుతూ..!

రాకెట్‌ దాడులు, బాంబు పేలుళ్లకు తోడు.. హమాస్‌ తీవ్రవాదుల కంట పడకుండా తమ ఇళ్లలోనే దాక్కుంటున్నారు అక్కడి ప్రజలు. ఒకవేళ బయటికొచ్చినా ఎటు నుంచి ఏ బాంబు, బుల్లెట్‌ దూసుకొస్తుందో తెలియదు. ఇలాంటి భయంకర పరిస్థితుల్లోనూ ధైర్యంగా బయటికొచ్చి.. అక్కడి విధ్వంసాన్ని, ప్రజల వెతల్ని ప్రపంచానికి చూపుతోంది పాలస్తీనాకు చెందిన యువ జర్నలిస్ట్‌ ప్లేస్టియా అలఖద్‌. దాడులతో అల్లకల్లోలమైన అక్కడి వీధుల్ని తన కెమెరాలో బంధిస్తూ, సర్వం కోల్పోయి-కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకొని ఒంటరైన బాధితుల్ని పరామర్శిస్తూ, దాడుల నుంచి బతికి బయటపడ్డ వారి అనుభవాలు తెలుసుకుంటూ.. వీటన్నింటినీ ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోందామె.
‘యుద్ధం వల్ల జరిగిన విధ్వంసం పూడ్చలేనిది. బాంబు పేలుళ్లతో ఇక్కడి వీధులన్నీ స్మశానాన్ని తలపిస్తున్నాయి. భయంతో కనీసం చనిపోయిన తన కుటుంబ సభ్యుల దగ్గరకు రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్‌ల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఇక ఇక్కడ కరెంట్‌, ఇంటర్నెట్‌ సదుపాయాలు లేకపోవడం.. ప్రజలకు మరింత సవాలుగా మారింది. దీంతో నేను కూడా చాలా వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయలేకపోతున్నా.. ప్రస్తుతం నా రెండు మొబైల్స్‌నూ ఆస్పత్రిలోనే పూర్తిగా ఛార్జింగ్‌ పెట్టుకున్నాకే డ్యూటీలోకి దిగుతున్నా.. ఒక ఫోన్‌తో ఫుటేజ్‌ను చిత్రీకరించడం.. మరో ఫోన్‌లో వీటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో పని కాస్త సులువవు తోంది..’ అంటోంది ప్లేస్టియా.

ఇక యూఎస్‌ నుంచి టెల్ అవీవ్‌కు వలస వచ్చిన 23 ఏళ్ల జర్నలిస్ట్ మికీ డుబెరీ కూడా ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధ పరిస్థితుల్ని ప్రపంచానికి నివేదిస్తోంది. ఈ క్రమంలో బాధితులతో మాట్లాడటం, ఆయా ప్రాంతాల్లో జరిగిన అకృత్యాల గురించి తెలియజేయడం.. వంటి కీలక బాధ్యతల్ని తన భుజాన వేసుకున్న ఆమె.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘టెర్రర్ వర్సెస్ ఇజ్రాయెల్.. హమాస్ వర్సెస్ పాలస్తీనియన్లు’గా ఈ యుద్ధాన్ని అభివర్ణించింది.


ఐకమత్యాన్ని చాటుతూ..!

యుద్ధంతో విధ్వంసం తప్ప మరే ప్రయోజనం లేదంటోంది ఎల్లా వావేయా. తన అసలు పేరు కంటే ‘కెప్టెన్‌ ఎల్లా’గానే ప్రపంచానికి సుపరిచితురాలామె. ఇజ్రాయెల్‌ రక్షణ శాఖలో మేజర్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న తొలి ముస్లిం అరబ్‌ మహిళగా కీర్తి గడించారు ఎల్లా. యుద్ధం కంటే శాంతి, ఐకమత్యాలే ముఖ్యమనే సిద్ధాంతాన్ని నమ్మే ఈ ఆర్మీ మేజర్‌.. దేశాల్ని, ప్రజల్ని కలిపి ఉంచడంలో ఈ రెండే కీలకమంటూ సోషల్‌ మీడియాలో స్ఫూర్తిదాయక సందేశాలు పోస్ట్‌ చేస్తుంటారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధం మొదలైనప్పట్నుంచీ.. యుద్ధ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో వివరిస్తూనే.. ఇరుదేశాల మధ్య శాంతి, ఐకమత్యం నెలకొనేలా తన వంతు కృషి చేస్తున్నారు ఎల్లా.

‘మాది సంప్రదాయ భావాలున్న కుటుంబం. అయినా ఆ కట్టుబాట్ల మధ్య తెర వెనకే ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. చిన్నప్పట్నుంచే సమాజంలో ఒకరిగా, సమాజానికి నావంతుగా ఏదైనా చేయాలన్న సంకల్పాన్ని ఏర్పరచుకున్నా. 16 ఏళ్ల వయసులో అసలు నా గుర్తింపేంటా అన్న ఆలోచన వచ్చింది. ఆపై ఆర్మీలో చేరాలన్న పట్టుదల పెరిగింది. కానీ ఇందుకు మా కుటుంబం అంగీకరించలేదు.. అయినా నేను వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత ఆర్మీలో నా సేవలు, ఒక్కో ర్యాంకును అందుకోవడం చూసి వాళ్లే నన్ను నెమ్మదిగా అర్థం చేసుకున్నారు. నేను ఆఫీసర్ ర్యాంకు అందుకున్నప్పుడు ఆ కార్యక్రమానికి అమ్మ రావడంతో చాలా ఎమోషనల్‌ అయ్యా..’ అంటోన్న ఈ మహిళా ఆఫీసర్‌.. ఇజ్రాయెల్‌ ఆర్మీలో గత దశాబ్దానికి పైగా సేవలందిస్తున్నారు.


ఆ దాడి నుంచి బయటపడి..!

ఇటీవలే దక్షిణ ఇజ్రాయెల్‌లో పెద్ద ఎత్తున ‘సూపర్‌నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌’ నిర్వహించారు. ఈ కార్యక్రమం పైనా హమాస్‌ తీవ్రవాదులు దాడి చేయడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి నుంచి బయటపడ్డ వారూ కొందరున్నారు. వారిలో జోహర్‌-లిరాన్‌ జంట కూడా ఒకటి. ‘ఎలాగైతేనేం.. దాడి నుంచి బయటపడ్డాం కదా.. అది చాలు!’ అనుకోలేదు వారు. ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా శత్రువును మట్టుబెట్టాలనుకున్నారు. ఈ ఆలోచనతోనే ‘కంబాట్‌ ఇంజినీరింగ్‌ కార్ప్స్‌’ అనే రిజర్వ్‌ బెటాలియన్‌లో చేరారీ డేరింగ్‌ కపుల్‌. ప్రస్తుతం వీరిద్దరూ ఆర్మీ యూనిఫాం ధరించి విధుల్లో పాల్గొంటున్నారు. ఇలా వీరి ధైర్యసాహసాల్ని ప్రశంసిస్తూ.. ఇజ్రాయెల్‌ ఆర్మీ వీరి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వీరి పేరు మార్మోగుతోంది.

ఇక ఇజ్రాయెల్‌లో స్థిరపడిన ఓ గుజరాతీ కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరీమణులు కూడా ఈ యుద్ధంలో పాల్గొంటున్నారు. అక్కడి టెల్‌ అవివ్‌ పట్టణంలో స్థిరపడిన నిషా, రియాలు గత కొంత కాలంగా ఇజ్రాయెల్‌ రక్షణ దళాల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత యుద్ధంలో వారు పాలుపంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ అక్కచెల్లెళ్ల ధైర్యసాహసాల్ని చాలామంది ప్రశంసిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్