Bal Puraskar : వయసుకు మించి రాణిస్తున్నారు!

శాస్త్రీయ నృత్యంతో కళను ఖండాంతరాలు దాటిస్తున్న వారు ఒకరైతే..సృజనాత్మక ఆలోచనలతో సమాజాభివృద్ధికి పాటు పడుతోన్న వారు మరొకరు..శారీరక లోపాన్నీ అధిగమించి.. సమాజ సేవలో భాగమయ్యారు ఇంకొకరు..ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈకాలం పిల్లలు ఏ రంగంలోనైనా తమ వయసుకు మించిన ప్రతిభాపాటవాల్ని ప్రదర్శిస్తున్నారు.

Updated : 27 Jan 2024 17:01 IST

(Photos: Instagram)

శాస్త్రీయ నృత్యంతో కళను ఖండాంతరాలు దాటిస్తున్న వారు ఒకరైతే..

సృజనాత్మక ఆలోచనలతో సమాజాభివృద్ధికి పాటు పడుతోన్న వారు మరొకరు..

శారీరక లోపాన్నీ అధిగమించి.. సమాజ సేవలో భాగమయ్యారు ఇంకొకరు..

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈకాలం పిల్లలు ఏ రంగంలోనైనా తమ వయసుకు మించిన ప్రతిభాపాటవాల్ని ప్రదర్శిస్తున్నారు. తద్వారా తాము పేరుప్రఖ్యాతులు గడిస్తూనే.. ఎంతోమంది చిన్నారులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి బాలల్ని గుర్తించి ‘ప్రధానమంత్రి బాల పురస్కారం’ అందించింది కేంద్ర ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న కొంతమంది అమ్మాయిల గురించి తెలుసుకుందాం..

ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. దేశవ్యాప్తంగా ధైర్యసాహసాలు, ప్రతిభాపాటవాల్ని ప్రదర్శించిన చిన్నారుల్ని గుర్తించి ‘ప్రధానమంత్రి బాల పురస్కారం’ పేరిట అవార్డులు అందిస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. కళలు, సృజనాత్మకత, సాహసం, శాస్త్రసాంకేతికత, క్రీడలు, సమాజ సేవ, పర్యావరణం.. వంటి ఏడు కేటగిరీల నుంచి.. 5-18 ఏళ్ల వయసున్న చిన్నారుల్ని ఎంపిక చేసి ఈ పురస్కారాలు అందిస్తుంటుంది. అలా ఈ ఏడాది 19 మంది బాలబాలికలు ఈ అవార్డు అందుకున్నారు. వారిలో 10 మంది అమ్మాయిలు కాగా, 9 మంది బాలురున్నారు. వీళ్లంతా మెడల్‌, సర్టిఫికెట్‌తో పాటు సర్టిఫికెట్‌ బుక్‌ అందుకున్నారు.


నృత్యంతో అదరగొడుతూ..!

శాస్త్రీయ నృత్య కళలపై ఆసక్తి చూపే చిన్నారులు ఈ రోజుల్లో తక్కువ మంది కనిపిస్తున్నారు. వారిలో హన్మకొండకు చెందిన పెండ్యాల లక్ష్మీ ప్రియ ఒకరు. చిన్న వయసు నుంచే కూచిపూడి నృత్యంపై ఆసక్తి పెంచుకొని.. ఇందులో రాణిస్తోందామె. మూడో తరగతి నుంచే ఈ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించిన లక్ష్మీ ప్రియ.. అనతికాలంలోనే ఇందులో పూర్తిస్థాయి మెలకువలు నేర్చుకుంది. ప్రస్తుతం హన్మకొండలోని మిషనరీ స్కూల్లో పదో తరగతి చదువుతోన్న ఈ అమ్మాయి.. ఓవైపు చదువుపై దృష్టి పెడుతూనే.. మరోవైపు కూచిపూడి నృత్యంలో రాణిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 200లకు పైగా ప్రదర్శనలిచ్చిన ఈ యువ డ్యాన్సర్‌.. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి ‘ప్రధానమంత్రి బాల పురస్కారం’ అందుకుంది.
‘మా గురువు బి. సుధీర్‌ రావు గారి వద్ద ఏడు సంవత్సరాలుగా కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నాను. ఈ రంగంలోకి రావడానికి ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్లు దీపికా రెడ్డి, మంజు భార్గవిలే నాకు స్ఫూర్తి. నా డ్యాన్స్‌ ప్రయాణంలో అమ్మానాన్నల ప్రోత్సాహం ఎంతో ఉంది.. తాజాగా ప్రధాన మంత్రి బాల పురస్కారం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది.. ఈ అవార్డు నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది..’ అంటోంది లక్ష్మీప్రియ. తన నృత్య ప్రతిభకు గుర్తింపుగా గతేడాది ‘కళా ఉత్సవ్‌ నేషనల్‌ అవార్డు’ కూడా అందుకుందీ కూచిపూడి నృత్యకారిణి.


తనలాంటి పిల్లల కోసం..!

శారీరక, మానసిక లోపాలున్న చిన్నారులకు ఈ సమాజంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. సెరెబ్రల్‌ పాల్సీ కారణంగా ఇలాంటి అవరోధాలెన్నో ఎదుర్కొంది గుజరాత్‌కు చెందిన హేత్వి కాంతిభాయ్‌ ఖింసూర్య. 12 ఏళ్ల ఈ అమ్మాయి అక్కడి ఓ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. తనకున్న అరుదైన ఆరోగ్య సమస్య కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమైనా, మానసికంగా పలు లోపాలున్నా.. ఇవన్నీ అధిగమించి తనను తాను నిరూపించుకోవాలనుకుందామె. ఈ క్రమంలోనే తనకు ఆసక్తి ఉన్న పెయింటింగ్‌పై దృష్టి పెట్టింది. సందర్భాన్ని బట్టి తనలోని సృజనాత్మకతతో విభిన్న పెయింటింగ్స్‌కి రూపమిస్తోంది హేత్వి. అంతేకాదు.. తనలోని ఈ కళను తనలాంటి శారీరక, మానసిక లోపాలున్న చిన్నారులకూ నేర్పిస్తోందామె. ఈ క్రమంలోనే ‘స్పెషల్‌ ఛైల్డ్‌ ఎడ్యుకేషన్‌ యాక్టివిటీ హేత్వి ఖింసూర్య’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను నడుపుతోన్న ఆమె.. తనలోని లోపాల్ని అధిగమించి తన వంతుగా సమాజ సేవ చేస్తోంది. మరోవైపు గుజరాత్‌ వ్యాప్తంగా 30కి పైగా స్కూళ్లలో ఆర్ట్‌కు సంబంధించి ప్రత్యేకమైన వర్క్‌షాప్స్‌ నిర్వహించిన హేత్వి.. తనలో ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాలతో గతేడాది ‘గుజరాత్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించింది. ఇక ఈ ఏడాది ‘ప్రధాన మంత్రి బాల పురస్కారం’ కూడా అందుకుందీ యంగ్‌ ఆర్టిస్ట్‌.


రైతుల కోసం.. ఆమె ఆవిష్కరణ!

రైతులు కొన్ని నెలలు కష్టపడితే కానీ పంట చేతికి రాదు. ఈ క్రమంలో విత్తనాలు నాటడం దగ్గర్నుంచి పొలానికి నీళ్లు పెట్టడం, కలుపు తీయడం, ఆఖరికి పంట కోయడం దాకా.. ఎంతో శ్రమించాల్సి వస్తుంటుంది. రైతన్నకు ఈ శ్రమ లేకుండా చేయాలన్న ముఖ్యోద్దేశంతో ఓ సోలార్‌ ఆగ్రో వెహికిల్‌ని డిజైన్‌ చేసింది దిల్లీకి చెందిన సుహానీ చౌహాన్‌. అక్కడి పుష్ప్‌ విహార్‌ ప్రాంతంలోని ‘ఎమిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్లో’ పదకొండో తరగతి చదువుతోన్న ఆమె.. గతేడాది ‘SO-APT’ పేరుతో ఈ వాహనాన్ని రూపొందించింది. పేరుకు తగ్గట్లే సౌరశక్తితో పనిచేస్తుందీ వాహనం. ఒక్కసారి పూర్తిస్థాయిలో ఛార్జింగ్‌ చేస్తే.. 60 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తుంది. విత్తనాలు నాటడం, పంటకు నీళ్లు పెట్టడం, ఇరిగేషన్‌, కలుపు తీయడం, పంట కోయడం.. వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాదు.. ఇది 400 కిలోల దాకా పంట లోడ్‌ని మోయగలదు. ఇలా ఇన్ని ఫీచర్లతో పాటు పర్యావరణహితంగా, రైతు శ్రమను-ఖర్చును తగ్గించేలా ఉన్న ఈ వాహనాన్ని రూ. 3 లక్షల కంటే తక్కువ ధరకే అందిస్తానంటోంది సుహానీ. ఇలా తాను డిజైన్‌ చేసిన వాహనాన్ని గతేడాది ‘నేషనల్‌ టెక్నాలజీ వీక్‌’లో ప్రదర్శించిన సుహానీ.. తన ప్రతిభతో ఆ సమయంలో ఎంతోమంది ప్రశంసలు దక్కించుకుంది. ఇక తాజాగా ‘ప్రధానమంత్రి బాల పురస్కారం’ కూడా అందుకుందీ యంగ్‌ ఇన్నొవేటర్‌.


బాల్య వివాహాల్ని నిర్మూలిస్తూ..!

బాల్య వివాహాలు ఎంతో మంది అమ్మాయిలకు శాపంగా పరిణమిస్తున్నాయి. దేశంలోని పలు మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ తరహా వివాహాలు జరుగుతుండడం శోచనీయం! వీటిని అరికట్టేందుకు తన వంతుగా కృషి చేస్తోంది త్రిపురకు చెందిన జోత్స్న అక్తర్‌. అక్కడి ఓ మైనార్టీ కమ్యూనిటీకి చెందిన ఆమె.. అక్కడి పీఎం శ్రీ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. చిన్నతనంలో జోత్స్న తల్లిదండ్రులు కూడా ఆమెకు బలవంతంగా వివాహం చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో ధైర్యంగా వారికి అడ్డు చెప్పి.. ఈ ఊబిలోంచి స్వయంగా బయటపడింది. అప్పట్నుంచి బాల్యవివాహాల్ని అరికట్టేందుకు కంకణం కట్టుకుందామె. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు వెళ్తూ అక్కడి అమ్మాయిలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించడంతో పాటు.. బాల్య వివాహాల్ని అరికట్టేందుకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘బాలికా మంచ్‌’ అనే కార్యక్రమానికి అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది జోత్స్న. ఇలా సమాజంలో మార్పు కోసం తన వంతుగా కృషి చేస్తోన్న ఆమెకు.. ఈ ఏడాది ‘ప్రధాన మంత్రి బాల పురస్కారం’ దక్కింది.


క్రీడల్లో రాణిస్తున్నారు!

ఈ ఏడాది క్రీడల విభాగంలో నలుగురు అమ్మాయిలు ‘ప్రధానమంత్రి బాల పురస్కారం’ గెలుచుకున్నారు.

⚛ ఉత్తరప్రదేశ్‌కు చెందిన 12 ఏళ్ల ఆదిత్య యాదవ్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా రాణిస్తోంది. ఆమె వినలేదు, మాట్లాడలేదు. ఇలా పలు శారీరక లోపాలున్నా వీటన్నింటినీ అధిగమిస్తూ ఆటల్లో తనను తాను నిరూపించుకుంటోందీ యంగ్‌ ప్లేయర్‌. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పలు పతకాలూ అందుకుందామె.

⚛ కర్ణాటకకు చెందిన 9 ఏళ్ల చర్వి అండర్‌-8 ప్రపంచ ఛాంపియన్‌గా టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఎన్నో టైటిల్స్‌ గెలుచుకున్న ఈ యంగ్‌ ప్లేయర్‌.. భవిష్యత్తులో గ్రాండ్‌మాస్టర్‌ కావడమే తన లక్ష్యమంటోంది.

⚛ అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన జెస్సికా నేయీ బ్యాడ్మింటన్‌లో రాణిస్తూ పలు అవార్డులు అందుకుంది.

⚛ ఇక మణిపూర్‌కు చెందిన లింథోయ్‌ ఛనంబమ్‌ జూడో క్రీడలో రాణిస్తోంది. 2022లో ‘ప్రపంచ జూడో క్యాడెట్స్‌ ఛాంపియన్‌షిప్స్‌’లో బంగారు పతకం నెగ్గిన ఆమె.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్రకెక్కింది.

వీరితో పాటు హరియాణాకు చెందిన గరిమ (సమాజ సేవ), ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుష్క పథక్‌ (కళలు) కూడా ఈ ఏడాది ‘ప్రధానమంత్రి బాల పురస్కారం’ అందుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్