ఇద్దరమ్మాయిలు.. కలలు కన్నారు.. సాధించారు!

వృత్తిధర్మం, దేశ సేవ.. ఈ రెండూ కలగలిసిన రక్షణ రంగంలో పనిచేసే అవకాశం అతి కొద్ది మందికే దక్కుతుంది. ఇటీవలే అలాంటి అరుదైన అవకాశం అందుకున్నారు ఇద్దరమ్మాయిలు. ఇండియన్‌ ఆర్మీలో తొలి మహిళా లెఫ్టినెంట్‌ డాక్టర్‌గా ఒకరు ఘనత సాధిస్తే.. భారత వాయు సేనలో పంజాబ్‌ నుంచి తొలి ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు మరొకరు.

Published : 04 May 2024 12:16 IST

(Photos: Twitter)

వృత్తిధర్మం, దేశ సేవ.. ఈ రెండూ కలగలిసిన రక్షణ రంగంలో పనిచేసే అవకాశం అతి కొద్ది మందికే దక్కుతుంది. ఇటీవలే అలాంటి అరుదైన అవకాశం అందుకున్నారు ఇద్దరమ్మాయిలు. ఇండియన్‌ ఆర్మీలో తొలి మహిళా లెఫ్టినెంట్‌ డాక్టర్‌గా ఒకరు ఘనత సాధిస్తే.. భారత వాయు సేనలో పంజాబ్‌ నుంచి తొలి ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు మరొకరు. జీవితంలో పలు సవాళ్లను ఎదుర్కొని.. దేశ సేవే పరమావధిగా ఈ రంగంలోకి వచ్చామంటోన్న ఈ ఇద్దరమ్మాయిల స్ఫూర్తిదాయక ప్రయాణమిది!

నానమ్మ కోరిక అది!

పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే.. ఏ డాక్టరో, ఇంజినీరో, లాయరో అని చెబుతారు చాలామంది. కానీ ‘ఆర్మీ డాక్టర్‌నవుతా’నంటూ సమాధానమిచ్చింది జోయా మీర్జా. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో పుట్టి పెరిగిన ఆమె.. తన నానమ్మ ప్రోత్సాహంతో దేశ సేవ చేయాలని సంకల్పించుకుంది. అయితే ఇదంత సులభం కాలేదని, అడుగడుగునా వరుస వైఫల్యాలే ఎదురయ్యాయని చెబుతోంది జోయా.

‘భవిష్యత్తులో ఆర్మీ డాక్టరైతే దేశానికి సేవ చేయచ్చని, ఈ వృత్తి ఇటు గౌరవాన్ని, అటు సంతృప్తిని అందిస్తుందని నానమ్మ ఎప్పుడూ నాతో చెబుతుండేది. ఆమె మాటలే నా కెరీర్‌కు బీజం వేశాయి. అయితే ఆర్థిక సమస్యలు నా చదువుకు పలుమార్లు అడ్డుపడ్డాయి. అయినా చక్కటి ప్రతిభ కనబరుస్తూ వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లా. ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే నీట్‌ పరీక్ష రాశాను.. కానీ సీటు రాకపోయేసరికి దిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చేశాను. ఆపై మరోసారి నీట్‌ పరీక్ష రాయగా ఒక్క ర్యాంకుతో సీటు చేజారింది. అయినా పట్టు వదల్లేదు. నానమ్మ ప్రోత్సాహంతో ఓ కోచింగ్‌ సెంటర్‌లో చేరి శిక్షణ తీసుకున్నా. 2019లో మూడోసారి రాసిన నీట్‌ పరీక్షలో పుణేలోని ‘ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీ’లో ఎంబీబీఎస్‌ సీటు సంపాదించా. సాధారణంగా ఈ మెడికల్‌ కాలేజీలో మార్కుల కటాఫ్‌ స్కోర్‌ అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువగా ఉంటుంది. ఆ ఏడాది 620 కటాఫ్‌ పెడితే నాకు 622 మార్కులొచ్చాయి. ఇలా నా కోరిక నెరవేరడంతో ఆనందం కట్టలు తెంచుకుంది. నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తి చేసుకోవడంతో పాటు ఆర్మీ డాక్టర్‌గా పోస్టింగ్‌ అందుకోవాలంటే కౌన్సెలింగ్ సమయంలో పలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. వాటిలోనూ సక్సెసై.. ఇటీవలే ఇండియన్‌ ఆర్మీలో తొలి మహిళా లెఫ్టినెంట్‌ డాక్టర్‌గా బాధ్యతలందుకున్నా..’ అంటోందీ బ్రేవ్‌ ఉమన్‌. జోయా తండ్రి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర క్రికెట్‌ సంఘం పిచ్ క్యూరేటర్‌ కాగా, తల్లి టీచర్.


డాక్టర్‌ టు ఫ్లైయింగ్‌ ఆఫీసర్!

తల్లిదండ్రులు, తాతముత్తాతల స్ఫూర్తితో ఆయా రంగాల్ని ఎంచుకొనే వారు చాలామందే ఉంటారు. కానీ కుటుంబ నేపథ్యంతో సంబంధం లేకుండా తనకు నచ్చిన రక్షణ రంగాన్ని కెరీర్‌గా మలచుకుంది 23 ఏళ్ల అర్మీష్‌ అసిజా. తన కుటుంబం నుంచి ఈ రంగంలోకి వచ్చిన మొదటి వ్యక్తిని తానేనంటూ గర్వంగా చెబుతోందామె. ఇటీవలే జరిగిన భారత వాయుసేన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో భాగంగా.. ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలందుకుంది అర్మీష్. తద్వారా పంజాబ్‌ నుంచి భారత వాయుసేనలో ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలందుకున్న తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిందామె.

‘మా కుటుంబం నుంచి రక్షణ రంగంలోకి వచ్చిన తొలి వ్యక్తిని నేనే. ఈ విజయం నాకే కాదు.. మా ఫ్యామిలీ మొత్తానికీ గర్వకారణంగా నిలిచింది. ఈ క్రమంలోనే ఇటీవలే జరిగిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో మా అమ్మానాన్నలు, బంధువులు పాల్గొన్నారు. చిన్న వయసు నుంచి రక్షణ రంగంలోకి రావాలని, ఈ వృత్తిలో హోదాతో పాటు గౌరవం-సంతృప్తి రెండూ దక్కుతాయని బలంగా అనుకునేదాన్ని. ఈ క్రమంలోనే పుణేలోని ‘ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీ’లో ఎంబీబీఎస్‌ పూర్తిచేశా. తుది పరీక్షల్లో 150 మందిలో 5వ  ర్యాంకు సాధించా. ఈ ప్రతిభే భారత వాయు సేనలో ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగావకాశాన్ని అందించింది..’ అంటోంది అర్మీష్‌. ఆమె తండ్రి మహ్‌దీప్ అసిజా పర్యావరణ ఇంజినీర్‌ కాగా, తల్లి సోనికా అసిజా హిసర్‌లోని ఓ కాలేజీలో కెమిస్ట్రీ విభాగానికి హెడ్‌. అర్మీష్‌కు బాస్కెట్‌బాల్‌, రోలర్‌ స్కేటింగ్‌.. వంటి క్రీడల్లోనూ ప్రవేశముంది. ఈ ఆటలే తనకు మానసికోల్లాసాన్ని, ఫిట్‌నెస్‌ను అందిస్తున్నాయని చెబుతోందీ డేరింగ్ ఆఫీసర్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్