19 ఏళ్ల వయసులోనూ డైపర్.. కళ్లు చెమర్చే కథ.. అయినా అంతులేని స్ఫూర్తి!

ఏదైనా భరించలేని కష్టమొస్తే.. ‘ఈ జీవితమెందుకు వృథా’ అంటూ అసహనానికి గురవుతాం. అలాంటిది.. అవయవ లోపంతో జీవితాంతం పాట్లు పడాల్సిందేనని తెలిస్తే వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం.. అయితే నాగ్‌పూర్‌కు చెందిన అబోలీ జరిత్‌ది.....

Updated : 08 Dec 2022 14:55 IST

(Photos: Instagram)

ఏదైనా భరించలేని కష్టమొస్తే.. ‘ఈ జీవితమెందుకు వృథా’ అంటూ అసహనానికి గురవుతాం. అలాంటిది.. అవయవ లోపంతో జీవితాంతం పాట్లు పడాల్సిందేనని తెలిస్తే వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం.. అయితే నాగ్‌పూర్‌కు చెందిన అబోలీ జరిత్‌ది అంతకుమించిన కష్టమని చెప్పాలి. చిన్నతనంలోనే అరుదైన ఎముకల సమస్య బారిన పడిన ఆమెలో వయసుకు తగ్గ శారీరక ఎదుగుదల లేదు. దీనికి తోడు మూత్రపిండాల సమస్యతో మనలా సాధారణంగా మూత్రానికి వెళ్లలేని దుస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో బతకడమే అరుదన్నారు డాక్టర్లు. ఇలా బతికి ఏం ప్రయోజనం అన్నారు అందరూ. కానీ తాను మాత్రం తన జీవితానికి ఓ సార్థకత ఉండాలనుకుంది. చక్రాల కుర్చీకే పరిమితమైనా తనలోని నైపుణ్యాల్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రదర్శిస్తూ సోషల్‌ సెలబ్రిటీగా మారిపోయింది. విధికి ఎదురీదుతూ అబోలీ చేస్తోన్న ఈ జీవన పోరాటం ప్రతి ఒక్కరి చేతా చప్పట్లు కొట్టిస్తోంది.

అబోలీ జరిత్‌.. 19 ఏళ్ల ఈ నాగ్‌పూర్‌ అమ్మాయి ఎత్తు కేవలం 3’4’’. ఇందుకు కారణం.. తాను చిన్న వయసులో రీనల్ రికెట్స్‌ ఆస్టియోమాలేషియా అనే అరుదైన వ్యాధి బారిన పడడమే! అంటే.. శరీరంలోని ఎముకలు బలహీనపడి.. సరైన ఎదుగుదల లేకపోవడం. దీనికి తోడు మూత్రపిండాల వైఫల్యం ఆమెకు మరో శాపం. ఈ రెండు సమస్యలతో వయసుకు తగ్గట్లుగా పొడవు పెరగలేకపోయింది అబోలీ.

బతకడమే ఓ అద్భుతమన్నారు!

నిజానికి ఇలాంటి అరుదైన సమస్య ఉన్న వాళ్లు బతకడమే చాలా అరుదు. అలాంటిది తాను జీవించి ఉన్నానంటే తన అదృష్టమే అంటోంది అబోలీ. ‘ఎముకల సమస్య, మూత్రపిండాలు విఫలమవడమే కాదు.. నేను అందరిలా మూత్రానికి వెళ్లలేను. ఎందుకంటే నాకు మూత్రాశయం లేదు. నడుం దగ్గర ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అందులో నుంచే మూత్రం లీకవుతుంటుంది. నాకు తెలియకుండానే జరిగే ఈ ప్రక్రియ వల్ల నేను నిరంతరం డైపర్‌ ధరించాల్సిందే! ఇలాంటి అరుదైన వ్యాధులున్న వారు జీవించడం చాలా అరుదని డాక్టర్లు చెప్పారు. అయితే నేను జీవించి ఉన్నన్నాళ్లూ ఈ సమస్యలన్నీ నాతోనే ఉంటాయన్నారు. ఈ మాటలు విన్నప్పుడు నాలో నేనే కుంగిపోయా. దీనికి తోడు ఇరుగుపొరుగు వాళ్లు, బంధువులు సూటిపోటి మాటలతో మానసికంగా హింసించే వారు. అయినా గుండె దిటవు చేసుకున్నా..’ అంటోందీ టీనేజర్‌.

అమ్మానాన్న అండగా నిలిచారు!

తన శారీరక సమస్యతో సమాజం నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా తన తల్లిదండ్రులే తనకు అండగా నిలిచారంటోంది అబోలీ. ‘సమాజం నుంచి ఎన్ని విమర్శలొస్తున్నా.. ధైర్యంగా ఎదుర్కొంటున్నానంటే అందుకు మా కుటుంబమే కారణం! వాళ్లే నాకు అన్ని వేళలా అండగా నిలిచారు. చిన్న వయసు నుంచే నటి కావాలని కలలు కన్నా. నా శారీరక లోపం ఈ విషయంలో నన్ను మరింత దృఢంగా మార్చింది. నాలోని తపనల్ని గుర్తించేలా చేసింది. నన్ను నేను నిరూపించుకోవడానికే సోషల్‌ మీడియా ఖాతాని తెరిచా. ఈ వేదికగా ప్రస్తుతం నా ఫొటోలు, వీడియోలతో పాటు నేను చేసిన డ్యాన్స్‌, పాటల వీడియోలూ వీటిలో పోస్ట్‌ చేస్తున్నా. నా శారీరక సమస్య కారణంగా నేను వీల్‌ఛెయిర్‌కే పరిమితం కావచ్చు.. కానీ అది నా ప్రతిభకు అడ్డుపడలేకపోయింది..’ అంటోందీ ట్యాలెంటెడ్‌ టీన్‌.

విమర్శలొచ్చినా వెరవక..!

సోషల్‌ మీడియాలో తాను పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోలకు విభిన్న కామెంట్లు వస్తుంటాయి. విధిని ఎదిరించి నిలిచిన ఆమె ట్యాలెంట్‌ని చాలామంది ప్రశంసిస్తుంటే.. మరికొందరు చిన్న పిల్ల అంటూ ఆటపట్టిస్తుంటారు. అయినా ఇలాంటి విమర్శల్ని పట్టించుకోనంటోంది అబోలీ.

‘నేను స్వీయ స్ఫూర్తితో ఎదిగిన అమ్మాయిని. జీవితం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకొని ఇక్కడి దాకా రాగలిగాను. వీటిని అర్థం చేసుకోకుండా మాట్లాడే వారి మాటలు పట్టించుకోను..’ అంటోందీ ట్యాలెంటెడ్‌ గర్ల్‌. తన వీడియోలతో సోషల్‌ మీడియాలో ఏడు వేల మందికి పైగా ఫాలోవర్లను సొంతం చేసుకున్న అబోలీ.. సోషల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు.. ‘మిస్‌ వీల్‌ఛెయిర్‌ ఇండియా’ ఫైనలిస్ట్‌గానూ నిలిచింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ‘వీల్‌ఛెయిర్‌ మోడల్‌’గానూ తనను తాను నిరూపించుకుంటోంది. మరోవైపు ‘గ్లోబల్‌ ఇండియా అవార్డు’ కూడా అందుకుంది.

అబోలీకి బాలీవుడ్‌ సింగర్‌ నేహా కక్కర్‌ అంటే వల్లమాలిన అభిమానం. ఈ క్రమంలో 2019లో ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో పాల్గొన్నప్పటి ఫొటోలు, నేహతో మాట్లాడిన సందర్భాల్ని తరచూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటుంది అబోలీ. అంతేకాదు.. చాలావరకు తన ప్రతి పోస్టుకు #NehuLovesAboli అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేస్తుంటుందీ టీన్‌ సింగర్‌. శారీరక వైకల్యం శరీరానికే కానీ.. మనలోని తపనకు కాదని నిరూపిస్తోన్న అబోలీ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్