క్యాన్సర్‌తో జీవితం విలువ తెలుసుకొని..!

ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తేనే తట్టుకోలేం.. అలాంటిది క్యాన్సర్‌ వంటి మహమ్మారి బారిన పడితే.. ఇక జీవితం ముగిసినట్లే అన్న భయం ఆవహిస్తుంది. ఇదిగో ఈ భయాన్నే జయించాలంటోంది గురుగ్రామ్‌కు చెందిన నియతీ మరియా. అది అనారోగ్యమైనా, జటిలమైన సమస్యైనా....

Published : 12 Feb 2023 12:51 IST

ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తేనే తట్టుకోలేం.. అలాంటిది క్యాన్సర్‌ వంటి మహమ్మారి బారిన పడితే.. ఇక జీవితం ముగిసినట్లే అన్న భయం ఆవహిస్తుంది. ఇదిగో ఈ భయాన్నే జయించాలంటోంది గురుగ్రామ్‌కు చెందిన నియతీ మరియా. అది అనారోగ్యమైనా, జటిలమైన సమస్యైనా.. మానసికంగా బలంగా ఉన్నప్పుడే దాన్నుంచి బయటపడగలమని స్వీయానుభవంతో చెబుతోందామె. రెండుసార్లు క్యాన్సర్‌ మహమ్మారిని జయించిన నియతి.. ఈ క్రమంలో శరీరాన్ని, మనసును దృఢంగా మార్చుకోవడానికి హిప్నో థెరపీ ఎంత ఉపయుక్తమో గ్రహించింది. అందుకే ఇదే థెరపీతో ప్రస్తుతం ఎంతోమందికి చికిత్స చేస్తూ.. వారిలో మానసిక స్థైర్యాన్ని నింపుతోన్న ఈ క్యాన్సర్‌ విజేత అంతరంగమిది!

హరియాణా రాష్ట్రంలోని రేవారీ నగరంలో పుట్టిన నియతికి ఆరు నెలలున్నప్పుడే తన కుటుంబం గురుగ్రామ్‌లో స్థిరపడింది. అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగులే! ముగ్గురూ ఆడపిల్లలే అయినా.. చిన్నతనం నుంచి వారికి ఆసక్తి ఉన్న అంశాల్లోనే ప్రోత్సహించారు. ఇక నియతి కూడా చిన్నవయసు నుంచి చదువులో చురుగ్గా ఉండేది. ఎంబీయే చదివే క్రమంలోనే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా ఓ విమానయాన సంస్థలో ఉద్యోగానికి ఎంపికైందామె. ఉన్నతోద్యోగం, మంచి జీతం.. ఇక జీవితమంతా హ్యాపీగా గడిపేయచ్చనుకుందామె.

నాలుగో దశ క్యాన్సర్!

తాను ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకు.. ఓరోజు తీవ్ర గొంతు నొప్పితో ఇబ్బంది పడిందామె. స్వయంగా పరిశీలించుకోగా చిన్న గడ్డలాంటిది తగిలింది. టాన్సిల్సేమో అనుకొని కొన్నాళ్ల పాటు సమస్యను వాయిదా వేస్తూ వచ్చింది నియతి. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకుంది. అందులో తనకు గొంతు క్యాన్సర్‌ సోకిందని నిర్ధారణ అయింది.

‘రిపోర్టు చూడగానే గుండె దడ పెరిగిపోయింది. ఎందుకంటే క్యాన్సర్‌ అంటే చావే అనుకునేదాన్ని. పైగా నాలుగో దశలో ఉందనగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఇక ఆ సమయంలో దీని గురించి కనీస అవగాహన కూడా లేదు. ఇలా ఈ ప్రతికూల ఆలోచనల్లో పడిపోయి నా ఆరోగ్య సమస్యను నేను అంగీకరించడానికి కొన్ని నెలలు పట్టింది. ఇక దీన్నుంచి బయటపడే క్రమంలో హోమియోపతి, ఆయుర్వేద.. చికిత్స పద్ధతుల్ని అనుసరించాను. కానీ కీమోథెరపీ చేయించుకోవడానికి మాత్రం నిరాకరించేదాన్ని..’ అంటూ చెప్పుకొచ్చింది నియతి.

హిప్నో థెరపీతో ఉపశమనం!

ఇలా క్యాన్సర్‌ మహమ్మారి కారణంగా శారీరకంగా, మానసికంగా అస్తవ్యస్థమైన తన జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు హిప్నో థెరపీ తనకు ఎంతగానో ఉపయోగపడిందంటోంది నియతి. ‘క్యాన్సర్ నుంచి బయటపడే క్రమంలో ఓవైపు చికిత్స తీసుకుంటూనే.. మరోవైపు మానసిక నిపుణుల కౌన్సెలింగ్‌ కూడా తీసుకున్నా. వాళ్ల మాటలు నా మనసుకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. భయంతో కీమోథెరపీ పూర్తిగా వద్దనుకున్న నేను.. కౌన్సెలింగ్‌ నిపుణుల సలహా మేరకు ఈ భయాన్ని దూరం చేసుకున్నా. కీమోథెరపీ తీసుకున్నా.. జరిగింది నాలుగు సెషన్లే కానీ భరించలేనంత నొప్పిని ఎదుర్కొన్నా. జుట్టు విపరీతంగా రాలిపోయింది. ఏదైతేనేం.. మొత్తానికి ఈ మహమ్మారి నుంచి బయటపడగలిగా..’ అంటోన్న ఈ క్యాన్సర్‌ వారియర్‌.. దీన్నుంచి పూర్తిగా కోలుకోవడానికి మూడేళ్లకు పైగా సమయం పట్టిందంటోంది.

‘IDHAYA’ పుట్టిందలా!

గొంతు క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకున్నాక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది నియతి. నచ్చిన వాడే తన జీవితంలోకి రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆపై కొన్నాళ్లకు ఓ బిడ్డకు తల్లైందామె. ఇదే సమయంలో రొమ్ము క్యాన్సర్‌ రూపంలో విధి తన జీవితానికి మరో సవాలు విసిరింది. ఇక ఈసారీ క్యాన్సర్‌ను ఓడించాలని నిర్ణయించుకుందామె. గత క్యాన్సర్‌ పోరాటంలాగే పలు చికిత్సలు, మానసిక నిపుణుల కౌన్సెలింగ్‌ సెషన్స్‌తో ఇప్పుడూ ఈ మహమ్మారిని జయించిందామె. ఈ క్రమంలోనే ఇలాంటి ఆరోగ్య సమస్యలు, జీవితంలో తలెత్తే జటిలమైన సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారని, ఇవి వారి ఆరోగ్యం, మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని గుర్తించింది నియతి. అందుకే ఉద్యోగం వదిలేసి మరీ.. హిప్నోథెరపీ నైపుణ్యాలు నేర్చుకుందామె.

‘శరీరం, మనసు.. నిశ్చలంగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అయితే చాలామంది రకరకాల సమస్యలతో వీటిని బ్యాలన్స్‌ చేయలేకపోతున్నారు. ఈ విషయం గ్రహించాకే ‘IDHAYA – Consious Living’ అనే హిప్నో థెరపీ సెంటర్‌ను ప్రారంభించా. థెరపీ సహాయంతో వ్యక్తి ఆరోగ్య/ఇతర సమస్యల్ని పోగొట్టి.. వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారుచేయడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం..’ అని చెప్పే నియతి.. ఈ వేదికగా వ్యక్తిగత థెరపీ సెషన్లు, ఉద్యోగులకు వెల్‌నెస్‌ వర్క్‌షాప్స్‌, నాద యోగా, పేరెంటింగ్‌ సెషన్స్‌, హిప్నోబర్తింగ్‌ తరగతులు.. వంటివి నిర్వహిస్తోంది. మరోవైపు ఆయా సమస్యల్ని ఎదుర్కొన్న మహిళలతో స్ఫూర్తిదాయక ప్రసంగాలూ ఇప్పిస్తోంది.

భయం కాదు.. ధైర్యం కావాలి!

ఇలా తన హిప్నో థెరపీ సెషన్స్‌తో.. పదేళ్లలో సుమారు 10 వేల మందిలో పాజిటివిటీ నింపగలిగింది నియతి.. వాళ్ల జీవితంపై వాళ్లకు ఆశలు చిగురింపజేసింది.

‘క్యాన్సర్‌ నాకు జీవితం విలువ తెలియజేసింది. శరీరాన్ని, మనసును సమతుల్యం చేసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలమన్న విషయం అర్థం చేసుకున్నా. కారణమేదైనా.. మానసికంగా బలహీనంగా మారిన వారిలో తిరిగి ధైర్యం నింపడం, వారికి జీవితంపై ఆశలు చిగురించేలా చేయడమే నా లక్ష్యం. ఎందుకంటే ధైర్యంగా ఉన్నప్పుడే మనం ఎలాంటి సవాలునైనా, అవరోధాన్నైనా జయించగలం..’ అంటూ తన క్యాన్సర్‌ జర్నీతో, సేవతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది నియతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్