దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!

ఎంతో ఇష్టపడి పెంపుడు జంతువుల్ని ఇంటికి తెచ్చుకుంటాం.. వాటిని అల్లారుముద్దుగా పెంచుకుంటాం.. వాటికే చిన్న సమస్య ఎదురైనా అల్లల్లాడిపోతాం.. ఒక్కమాటలో చెప్పాలంటే పెట్స్‌ని మన కన్నబిడ్డల్లా చూసుకుంటాం.

Updated : 16 Mar 2024 19:59 IST

(Photos: Instagram)

ఎంతో ఇష్టపడి పెంపుడు జంతువుల్ని ఇంటికి తెచ్చుకుంటాం.. వాటిని అల్లారుముద్దుగా పెంచుకుంటాం.. వాటికే చిన్న సమస్య ఎదురైనా అల్లల్లాడిపోతాం.. ఒక్కమాటలో చెప్పాలంటే పెట్స్‌ని మన కన్నబిడ్డల్లా చూసుకుంటాం. కానీ ఎప్పుడైనా వాటి ఆలోచనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం మీరెప్పుడైనా చేశారా? వాటి ప్రవర్తనను ఎలా పసిగట్టచ్చన్నది ఆలోచించారా? అయితే ఇవీ పెట్‌ పేరెంటింగ్‌ కిందకే వస్తాయంటున్నారు భావనా గఖర్‌. పెంపుడు జంతువుల సంరక్షణంటే వాటి బాగోగులు చూడడమే కాదు.. వాటి మనసు, భాష తెలుసుకొని మసలుకోవడమే అంటున్నారామె. ఈ విషయాలపై పెట్‌ పేరెంట్స్‌లో అవగాహన పెంచడం కోసమే ఓ డాగ్‌ కన్సల్టెన్సీ స్టార్టప్‌ను ప్రారంభించిన భావన.. ఈ వేదికగా ఎంతోమంది పెట్‌ పేరెంట్స్‌ను తమ పెంపుడు కుక్కలతో అనుబంధాన్ని పెంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

హరియాణాలోని గురుగ్రామ్‌లో పుట్టినా.. దిల్లీలో పెరిగారు భావన. ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను అల్లారుముద్దుగా, గారాబంగా పెంచారు. అడిగిందల్లా కొనిచ్చేవారు. అయితే చిన్న వయసు నుంచి భావనకు కుక్కలంటే ఆసక్తి ఎక్కువ. వాటితో ఆడుకోవాలని, మాట్లాడాలని, వాటి భాషను, భావాల్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించేది. కానీ కుక్కల్ని పెంచుకోవడానికి తన తల్లిదండ్రులు ఇష్టపడకపోయేవాళ్లు. దాంతో బయట, స్కూల్‌కి వెళ్లినప్పుడు వీధి కుక్కలతో ఎక్కువగా ఆడుకునేదాన్నని చెబుతోంది భావన.

నా మతి భ్రమించిందనేవారు!

‘మా స్కూల్‌ దగ్గర ఒక నల్ల కుక్క ఉండేది. దాన్ని నేను ముద్దుగా ‘హ్యాపీ సింగ్’ అని పిలిచేదాన్ని. నేను స్కూల్‌ నుంచి బయటికి రాగానే అది నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేది. స్కూల్లో నాతో ఎవరూ స్నేహం చేసే వారు కాదు.. నా తోటి విద్యార్థులు ఎప్పుడూ నన్ను ఏడిపించడం, ఆటపట్టించడం చేసేవారు. దాంతో హ్యాపీ సింగ్‌ని చూసినప్పుడల్లా నాలో ఒంటరితనం మాయమయ్యేది. ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాల గురించి దాంతో పంచుకునేదాన్ని. ఇది చూసి కొందరు నా మతి భ్రమించిందనే వారు. అలా చాలా ఏళ్ల పాటు ఆ కుక్కతో స్నేహం కొనసాగించా. ఇక మా ఇంట్లో రెండు చిలుకలు ఉండేవి.. వాటిని ఎప్పుడూ పంజరంలో బంధించి ఉంచేవాళ్లు. దాంతో ఆ పంజరాన్ని నా గదిలోకి తీసుకెళ్లి వాటికి అందులో నుంచి విముక్తి కలిగించేదాన్ని. అవి నా గదిలో ఎగురుతూ నాతో ఆడుకునేవి. ఇక నా వద్ద కొన్ని బాతు పిల్లలు కూడా ఉండేవి..’ అంటూ పెట్స్‌ అంటే తనకు ఎంతిష్టమో చెప్పుకొచ్చింది భావన.

ఉద్యోగమూ వదులుకున్నా!

హెచ్‌ఆర్‌ విభాగంలో ఎంబీఏ పూర్తిచేసిన భావన.. ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల్లో కొన్నేళ్ల పాటు ఉద్యోగం చేసింది. ఆపై పెంపుడు జంతువులపై మక్కువతో ‘యానిమల్‌ టెలీపతి’ వంటి ప్రత్యేక కోర్సులు కూడా నేర్చుకుంది. ఇలా కెరీర్‌లో బిజీ అయ్యాక ఒక నాలుగు కుక్కల్ని దత్తత తీసుకుందామె. డూడుల్, గుల్లాక్‌, ఇండీ.. ఇలా వాటికి ముద్దు పేర్లు పెట్టుకుంది. అయితే ఓసారి గుల్లాక్‌ తీవ్రంగా జబ్బు పడింది. దాన్ని అలా వదిలిపెట్టి ఉద్యోగానికి వెళ్లేందుకు ఆమెకు మనసొప్పలేదు. అటు ఉద్యోగమా? ఇటు పెట్‌ పేరెంటింగా? అన్న అంశాల్లో పెట్‌ పేరెంటింగ్‌కే ఓటేసిందామె. ఈ క్రమంలోనే తన కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదులుకొని మరీ కుక్కల కోసం ప్రత్యేకంగా తన ఫ్లాట్‌లోనే హోమ్‌ బోర్డింగ్‌ ఏర్పాటుచేసింది.

‘ఓవైపు పెంపుడు కుక్కల సంరక్షణను చూసుకుంటూనే.. మరోవైపు పుణేకు చెందిన డాగ్‌ ట్రైనర్‌, బిహేవియరిస్ట్ సన్నీ లుథారాను కలిశా. కుక్కల మనసును ఎలా చదవాలో ఆమె శిక్షణలోనే నేర్చుకున్నా. ఇదే 2022లో ‘కుక్కుర్‌ వచన్ అనే సంస్థను ప్రారంభించేందుకు కారణమైంది..’ అంటున్నారు భావన. ఈ వేదికగా పెంపుడు కుక్కల సంరక్షణే కాదు.. వాటి భావాలు, భావోద్వేగాలూ పెట్‌ పేరెంట్స్‌ అర్థం చేసుకునేలా వారికి శిక్షణ ఇస్తున్నారామె.

వర్క్‌షాప్స్‌.. సెషన్స్!

కుక్కలంటే పెంపుడు జంతువులుగానే కాదు.. వాటిని మన కుటుంబ సభ్యులుగా భావించినప్పుడే పెట్‌ పేరెంటింగ్‌కి పూర్తి న్యాయం చేసినవాళ్లవుతారంటున్నారు భావన. ఈ క్రమంలోనే తన సంస్థ వేదికగా పలు పెట్‌ పేరెంటింగ్‌ సేవల్నీ అందిస్తున్నారామె.

డాగ్‌ పేరెంటింగ్‌లో భాగంగా.. కొత్తగా పెట్‌ డాగ్‌ని దత్తత తీసుకునే వారికి.. వాటిని ఎలా మచ్చిక చేసుకోవాలో నేర్పుతున్నారు.

అలాగే టెలీపతి సేవల్లో భాగంగా.. పెంపుడు కుక్కల భావాలు, భావోద్వేగాలు, ప్రవర్తనను అర్థం చేసుకొని.. వాటితో ఎలా మసలుకోవాలో పెట్‌ పేరెంట్స్‌కి నేర్పుతున్నారు. అంతేకాదు.. పెంపుడు కుక్కలు తప్పిపోయినా వాటిని వెతికిపెట్టడం, ఏదైనా వ్యాధి/అనారోగ్యానికి గురైన కుక్కలతో ఎలా కమ్యూనికేట్‌ చేయాలి.. వంటివన్నీ టెలీపతి సేవల్లో భాగంగా నిర్వహిస్తున్నారామె.

మరోవైపు పెంపుడు కుక్కల ప్రవర్తనకు సంబంధించిన ప్రత్యేక వర్క్‌షాప్స్‌ నిర్వహించడం, ఇతర డాగ్‌ పేరెంట్స్‌, డాగ్‌ లవర్స్‌ తమ అనుభవాల్ని ఒకరికొకరు పంచుకునేలా పలు సెషన్స్ నిర్వహించడం వంటివీ చేస్తున్నారు భావన.

అంతేకాదు.. ‘కుక్కుర్‌ వచన్‌’ అనే ఇన్‌స్టా పేజీ వేదికగానూ డాగ్‌ పేరెంటింగ్‌కి సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తున్నారామె. ఇలా ఈ నాలుగేళ్లలో ఎంతోమంది పెట్‌ పేరెంట్స్‌కి తమ పెంపుడు కుక్కల్ని పూర్తిగా అర్థం చేసుకునేలా శిక్షణ ఇచ్చిన ఈ డాగ్‌ లవర్‌.. పెట్‌ పేరెంటింగ్‌ విషయంలో ఎంతోమంది పెట్‌ లవర్స్‌లో స్ఫూర్తి నింపుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్