Prerna Katyal: నానమ్మ కోసం.. ఆ మంచి పని!

కుటుంబ సభ్యులెవరైనా చనిపోతే.. ఆ బాధను దిగమింగడం అంత సులభం కాదు. అయితే మనసుకు ఉపశమనం కోసం, వాళ్ల జ్ఞాపకార్థం కొన్ని మంచి పనులు చేయడం మనలో చాలామందికి అలవాటే! దిల్లీకి చెందిన ప్రేరణ కత్యాల్‌ కూడా ఇదే చేసింది. చిన్న వయసులో క్యాన్సర్‌ కారణంగా నానమ్మను కోల్పోయిన ఆమె.. ఆపై తల్లిదండ్రుల ద్వారా ఆమె చేసిన మంచి పనుల....

Published : 31 Mar 2023 20:08 IST

(Photos: Instagram)

కుటుంబ సభ్యులెవరైనా చనిపోతే.. ఆ బాధను దిగమింగడం అంత సులభం కాదు. అయితే మనసుకు ఉపశమనం కోసం, వాళ్ల జ్ఞాపకార్థం కొన్ని మంచి పనులు చేయడం మనలో చాలామందికి అలవాటే! దిల్లీకి చెందిన ప్రేరణ కత్యాల్‌ కూడా ఇదే చేసింది. చిన్న వయసులో క్యాన్సర్‌ కారణంగా నానమ్మను కోల్పోయిన ఆమె.. ఆపై తల్లిదండ్రుల ద్వారా ఆమె చేసిన మంచి పనుల గురించి తెలుసుకొని స్ఫూర్తి పొందింది.. తానూ సమాజానికి ఉపయోగపడే మంచి పని చేయాలనుకుంది. అది కూడా తన నానమ్మకు నివాళిగా ఉండాలనుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే క్యాన్సర్‌ బాధితులకు తన జుట్టును దానమిచ్చింది. అయితే ఇలా తాను గుండు చేయించుకోవడాన్ని కొంతమంది విమర్శించినా.. ‘గుండుతో ఇంతకుముందెన్నడూ లేనంత అందంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నానం’టూ తనలోని పాజిటివిటీని చాటుతూ ప్రేరణ పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ప్రేరణ కత్యాల్‌కు హైకింగ్‌ (కొండలెక్కడం) అంటే చాలా ఇష్టం. ఇక ప్రకృతితో సమయం గడపడమంటే మరీనూ! ఈ క్రమంలోనే హైకింగ్‌ చేస్తూ తాను సందర్శించిన పచ్చటి ప్రదేశాల్ని, వాటి అందాల్ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటుందామె. ఇలా ట్రావెల్‌ బ్లాగర్‌గా పేరు తెచ్చుకున్న ఆమెకు.. ఫ్యాషన్‌ సెన్స్‌ కూడా ఎక్కువే! ఈ క్రమంలోనే తాను విభిన్న ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌ ధరించి ఫొటోలకు పోజిచ్చిన సందర్భాలూ చాలానే ఉన్నాయి.

బర్త్ డేకు ముందు రోజు..!

అయితే ఇటీవలే 26వ పుట్టినరోజు జరుపుకొంది ప్రేరణ. పాతికేళ్లు నిండిన సందర్భంగా ప్రేరణ తల్లిదండ్రులు ఆమె పుట్టినరోజును వేడుకగా జరపాలనుకున్నారు. అయితే తాను మాత్రం ఈ సందర్భంగా తన నానమ్మ జ్ఞాపకార్థం ఓ మంచి పని చేయాలనుకుంది. ఇందులో భాగంగానే తన పుట్టినరోజుకు ఒక రోజు ముందే తన పొడవాటి జుట్టును క్యాన్సర్‌ బాధితులకు విరాళంగా అందించి తనలోని దాతృత్వాన్ని చాటుకుంది ప్రేరణ. అంతేకాదు.. ఈ వీడియోతో పాటు దీని వెనకున్న కథనూ ఇటీవలే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందామె.

‘చిన్నతనంలో చాలామంది పిల్లలు రాత్రుళ్లు వాళ్ల అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే నీతి కథలు వింటూ నిద్రపోతుంటారు. దీనివల్ల వారితో అనుబంధం పెరుగుతుంది.. వారికీ చాలా విషయాలు తెలుస్తాయి. కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఎందుకంటే మా నానమ్మ నేను కిండర్‌ గార్టెన్‌లో ఉండగానే క్యాన్సర్‌తో చనిపోయింది. ఓరోజు స్కూల్‌ నుంచి ఇంటికొచ్చే సరికి మా నాన్న ఏడవడం చూశా. ఎందుకేడుస్తున్నావ్‌? అని అమాయకంగా అడిగా. నానమ్మ చనిపోయిందని చెప్పాడు. నిజానికి చావుబతుకులకు అర్థం కూడా తెలియని వయసు నాది! ఇక ఆ తర్వాత అమ్మానాన్నలు రోజూ తన గురించి చెప్పే కథలు, విషయాలు వింటూ పెరిగా.

పట్టుదలతో అవన్నీ నేర్చుకుందట!

మా నానమ్మకు 1960లో వివాహమైంది.. అప్పటికి తనకు 16 ఏళ్లు. ఆ సమయంలో చదువుకోవాలని మక్కువ ఉన్నా.. సామాజిక కట్టుబాట్ల కారణంగా పైచదువులకు నోచుకోలేకపోయింది. కానీ పెళ్లయ్యాక మా తాతయ్య తనకు చదువుకునే అవకాశమిచ్చారు. ఇలా ఆయన ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తిచేసింది. కష్టపడే తత్వం ఆమెది. తాను అనుకున్న లక్ష్యాల్ని చేరుకునే మొండి పట్టుదల ఆమెలో ఎక్కువ! ఈ క్రమంలోనే కుట్టుపని, ఎంబ్రాయిడరీ, ఆక్యుప్రెజర్‌ థెరపీ.. వంటివి  ఎన్నో నేర్చుకుంది. వీటిని ఉచితంగా పేద అమ్మాయిలకు నేర్పించి.. వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపించాలనుకుంది. కానీ ఆ రోజుల్లో అమ్మాయిల్ని బడికే కాదు.. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలకు కూడా పంపడానికి నిరాకరించేవారు చాలామంది తల్లిదండ్రులు. మరికొంతమంది.. గుడి లాంటి ప్రదేశంలో నేర్పిస్తేనే పంపుతామని మొండికేసేవారట! ఇలా ఆరేళ్ల పాటు పలు సవాళ్లను ఎదుర్కొన్న నానమ్మ.. అంతిమంగా నిధులు సమకూర్చుకొని.. స్థానికంగా గుడి నిర్మాణం పూర్తిచేసింది. ఈ క్రమంలో ఆమెకు ప్రజల్లో పాపులారిటీ పెరిగింది. ఒకానొక సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేయమని చాలామంది ప్రజలు కోరుకున్నారట! కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే తనకు రొమ్ము క్యాన్సర్‌ అని నిర్ధారణ అయింది.

మూడేళ్ల పోరాటం వృథా!

ఎన్నో థెరపీలు, సర్జరీలు చేయించినా ఫలితం లేదు. మూడేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడిన నానమ్మ ప్రాణం దక్కలేదు. పేద అమ్మాయిల శిక్షణ కోసం ఏ గుడైతే తాను నిర్మించిందో.. అది ఇప్పుడు ‘శ్రీహరి మందిర్‌’గా మారింది. ఇప్పటికీ అక్కడ యోగా తరగతులు, ఆక్యుప్రెజర్‌ చికిత్సలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇక మా నానమ్మ చనిపోయాక.. ఆమె జ్ఞాపకార్థం తాతయ్య ఓ గుడి కట్టి.. అందులో నానమ్మ విగ్రహం ఏర్పాటుచేశారు. ఇలా సమాజం కోసం పరితపించిన ఆమె గురించి తెలుసుకునే క్రమంలో నేనూ తనలా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకున్నా. తద్వారా నానమ్మకూ నివాళిగా ఉంటుందనిపించింది. గతంలో నా స్నేహితురాలి సహకారంతో క్యాన్సర్‌ బాధితులకు ఉచితంగా విగ్స్‌ అందించే ‘కోప్‌ విత్‌ క్యాన్సర్‌’ ఫౌండేషన్‌ గురించి తెలుసుకున్న నేను.. నా జుట్టును ఆ సంస్థకు విరాళంగా అందించాలనుకున్నా. ఇందుకు నా 26వ పుట్టినరోజును మించిన సందర్భం మరొకటి లేదనిపించింది. నేను చేసిన పనికి నానమ్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది..’ అంటూ తన నానమ్మ జ్ఞాపకాల్ని పంచుకుంది ప్రేరణ.

‘పెళ్లెవరు చేసుకుంటారు?’ అన్నారు!

అయితే ప్రేరణ పెట్టిన వీడియో, పోస్ట్‌ చూసి చాలామంది సానుకూలంగా స్పందించారు. ‘ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందం’టూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అదే సమయంలో కొన్ని విమర్శలూ వచ్చాయంటోందీ యంగ్‌ బ్యూటీ.
‘ఈ భూమ్మీద నాకెంతో ఇష్టమైన రిషికేశ్‌లో మా నానమ్మ జ్ఞాపకార్థం క్యాన్సర్‌ బాధితుల కోసం నా కేశాల్ని విరాళంగా అందించడం చాలా సంతోషంగా అనిపించింది. ఆపై అక్కడే గంగా స్నానం చేసి ఇల్లు చేరా. గుండుతో నన్ను చూసి అమ్మానాన్న తొలుత ఆశ్చర్యపోయారు. కానీ ఆ తర్వాత అసలు వాస్తవం తెలుసుకొని ప్రశంసించారు. అయితే నేను పెట్టిన వీడియోకూ చాలామంది సానుకూలంగా స్పందించారు. అంతేకాదు.. నన్ను గుండుతో చూసి విమర్శించిన వాళ్లూ ఉన్నారు. ‘నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’ అని దెప్పి పొడిచారు. అయినా నా మనసుకు నచ్చిన పని చేశానన్న సంతోషం ముందు వాళ్ల మాటలు నన్ను బాధపెట్టలేదు. నిజానికి నేను ఇంతకుముందు కంటే మరింత అందంగా మారాననిపిస్తోంది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మన బాహ్య సౌందర్యం కంటే మానసిక సంతృప్తి మనకు మరింత సంతోషాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ఆ ఆనందాన్నే అనుభవిస్తున్నా. నా దృష్టిలో.. ఇతరుల మాటలు పట్టించుకోకుండా మనకు నచ్చిన దారిని ఎంచుకోవడమే అసలైన సాధికారత!’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోంది ప్రేరణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్