Samaira: అమెరికా అధ్యక్షురాలిని కావాలనుకుంటున్నా..!

కోడింగ్‌ అంటే భయపడిపోతుంటారు చాలామంది.. ఇది చాలా కష్టం, బోరింగ్‌ సబ్జెక్ట్‌ అన్న భావనలో ఉంటారు. కానీ దీనికున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని.. సులభమైన పద్ధతుల్లో నేర్పిస్తోంది యంగ్‌ ఇన్నొవేటర్‌ సమైరా మెహతా. ఆరేళ్ల వయసులోనే ఇందులో పట్టు సాధించిన ఆమె.. తోటి పిల్లల్నీ ఇందులో నిష్ణాతుల్ని చేయడానికి కృత్రిమ మేధ....

Updated : 08 Mar 2023 19:09 IST

(Photos: Instagram)

కోడింగ్‌ అంటే భయపడిపోతుంటారు చాలామంది.. ఇది చాలా కష్టం, బోరింగ్‌ సబ్జెక్ట్‌ అన్న భావనలో ఉంటారు. కానీ దీనికున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని.. సులభమైన పద్ధతుల్లో నేర్పిస్తోంది యంగ్‌ ఇన్నొవేటర్‌ సమైరా మెహతా. ఆరేళ్ల వయసులోనే ఇందులో పట్టు సాధించిన ఆమె.. తోటి పిల్లల్నీ ఇందులో నిష్ణాతుల్ని చేయడానికి కృత్రిమ మేధ సహాయంతో బోర్డ్‌ గేమ్స్‌ రూపొందించే సంస్థను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్‌ మంది చిన్నారుల్ని కోడింగ్‌లో ఆరితేరేలా చేయడమే తన లక్ష్యమంటోన్న సమైరా.. తన ప్రతిభను ప్రశంసిస్తూ లేడీ ఒబామా రాసిన లేఖనూ అందుకుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో (STEM) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ యంగ్‌ ఇన్నొవేటర్‌ గురించి కొన్ని విశేషాలు.. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా.. మీకోసం..!

సమైరా పూర్వీకులు భారత సంతతికి చెందిన వారు. క్యాలిఫోర్నియాలోని శాంతాక్లారాలో జన్మించిన ఆమె.. చిన్న వయసు నుంచే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపేది. ఇది గమనించిన ఆమె తండ్రి.. ఆరేళ్ల వయసు నుంచే సమైరాకు కోడింగ్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. వృత్తిరీత్యా ఇంజినీర్‌ అయిన ఆయన తన కూతురికి సులభమైన పద్ధతుల్లో కోడింగ్‌ నేర్పించడం, వాటిని రోజువారీ పనులకు, సమస్యలకు అప్లై చేస్తూ ఈ సాంకేతికతపై మరింత పట్టు సాధించేలా ప్రోత్సహించారు.

ఆసక్తి పెంచాలని!

తన తండ్రి ప్రేరణతో కోడింగ్‌పై మక్కువ పెంచుకున్న సమైరా.. స్కూల్లోనూ తన ఫ్రెండ్స్‌కి తాను నేర్చుకున్న కోడింగ్‌ మెలకువల్ని పరిచయం చేసేది. అయితే అప్పుడు వాళ్ల సమాధానమే తనను ఆలోచనలో పడేలా చేసిందంటోందీ యంగ్‌ ఇంజినీర్.
‘నాన్న నాకు ఆటపాటలతోనే కోడింగ్‌ నేర్పించారు. అలా ఈ అంశంపై నాకు మక్కువ పెరిగింది. మనం దేన్నైనా బాగా ఇష్టపడితే పదే పదే దాని గురించే మాట్లాడుతుంటాం కదా.. అదే విధంగా నేను ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. స్కూల్లోనూ నా స్నేహితులతో కోడింగ్‌ గురించి మాట్లాడేదాన్ని. ఇందులో నేను నేర్చుకున్న మెలకువల్ని వారితో పంచుకునేదాన్ని. కానీ వాళ్లు వాటిని వినీ విననట్లుగా ఉండేవారు. దీన్ని నేర్చుకోవడం కష్టమని, పెద్ద బోరింగ్‌ సబ్జెక్ట్‌ అని కొట్టిపడేసేవారు. అప్పుడనుకున్నా.. చాలామంది ఇదే భావనలో ఉన్నారని, ఎలాగైనా వారి మనసులోని ఈ భయాల్ని, అపోహల్ని తొలగించి కోడింగ్‌పై మక్కువ పెరిగేలా చేయాలని! అది కూడా పిల్లలు ఇష్టపడి ఆడే బోర్డ్‌ గేమ్స్‌తోనే కోడింగ్‌ నేర్పించాలని నిర్ణయించుకున్నా. ఈ ఆలోచనే నా పదేళ్ల వయసులో ‘కోడర్‌బన్నీజ్‌’ (CoderBunnyz) అనే గేమింగ్‌ సంస్థకు తెరతీసింది..’ అంటూ తన కోడింగ్‌ జర్నీ గురించి చెప్పుకొచ్చింది సమైరా.

‘ఆడుతూ’ నేర్చేసుకోవచ్చు!

క్లిష్టమైన కోడింగ్‌ పద్ధతుల్ని సులభతరం చేసే గేమింగ్‌ జోన్‌ ఇది. ఈ క్రమంలో కృత్రిమ మేధను ఉపయోగించి ఇప్పటివరకు ‘CoderBunnyz’, ‘CoderMindz’, ‘CoderMarz’.. అనే మూడు బోర్డ్‌ గేమ్స్‌ రూపొందించిందీ టీన్‌ ఇంజినీర్‌. ఇందులో భాగంగా ఓ రోబో బొమ్మను ఉపయోగించి సరదాగా ఆటను కొనసాగించచ్చు.. మధ్యమధ్యలో సాహసాలూ చేయచ్చు.. ఇలా మొత్తానికి ఆడుతూనే కోడింగ్‌ నైపుణ్యాలు మెరుగుపరిచేలా తాను రూపొందించిన ఈ బోర్డ్‌ గేమ్స్‌కి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తోందని చెబుతోంది సమైరా.

‘కోడింగా.. అంటూ మొదట నీరసించిన నా స్నేహితులే నేను రూపొందించిన ఈ గేమ్స్‌ని ఆడి దీనిపై ఇష్టాన్ని, ఆసక్తిని పెంచుకున్నారు. వీళ్లే కాదు.. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పిల్లలకు ఈ ఆటలు చేరువయ్యాయి. వందలాది స్కూళ్లలోనూ తమ విద్యార్థులకు కోడింగ్‌ నైపుణ్యాలు బోధించడానికి మా గేమ్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఒకానొక దశలో అమెజాన్‌లో ‘బోర్డ్‌ గేమ్స్‌’ విభాగంలో నా సంస్థ టాప్‌-1లో నిలిచిందని చెప్పడానికి గర్వపడుతున్నా. కోడింగ్‌తో సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు మెరుగుపడతాయి. భవిష్యత్తులో దీనిదే హవా. అందుకే భవిష్యత్తులో బిలియన్‌ మంది చిన్నారుల్ని కోడింగ్‌లో నిష్ణాతుల్ని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా..’ అంటోందీ కోడింగ్‌ క్వీన్.

మిచెల్‌ ప్రశంసలు!

సమైరా తన సాంకేతిక నైపుణ్యాలతో గేమ్స్‌ రూపొందించడమే కాదు.. తన మాటలు, ప్రసంగాలతో సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యాన్నీ వివరిస్తోంది. తన బోర్డ్‌ గేమ్స్‌ను ఇప్పటివరకు 500 లకు పైగా వర్క్‌షాప్స్‌లో ప్రదర్శించడంతో పాటు; దేశవ్యాప్తంగా వందకు పైగా సదస్సుల్లోను.. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, ఇంటెల్‌, వాల్‌మార్ట్‌, ఐబీఎం.. వంటి దిగ్గజ సంస్థల్లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లోనూ పాల్గొని ప్రసంగించింది సమైరా. ఈ క్రమంలో స్టెమ్‌లో అమ్మాయిల ప్రాతినిథ్యం పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందీ యంగ్‌ ఇన్నొవేటర్‌. ఇలా తన ప్రతిభతో ప్రపంచ సాంకేతిక రంగంలో ప్రభావవంతమైన పాత్రను పోషిస్తున్న సమైరా.. ‘గ్లోబల్‌ ఛైల్డ్‌ ప్రాడిజీ అవార్డ్‌ ఇన్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌’, ‘ఇన్ఫీ మేకర్‌’.. వంటి పురస్కారాలతో పాటు పలు స్ఫూర్తిదాయక జాబితాల్లోనూ చోటు దక్కించుకుంది. తన ప్రతిభను ప్రశంసిస్తూ మిచెల్‌ ఒబామా రాసిన లేఖను అందుకొని మురిసిపోయిన ఈ టీన్‌ ఇన్నొవేటర్‌.. ‘భవిష్యత్తులో అమెరికా అధ్యక్షురాలిని కావాలనుకుంటున్నా.. తద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాభివృద్ధికి పాటుపడాలనుకుంటున్నా..’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్