Sandhiya Ranganathan: అమ్మే నా హీరో.. తన వల్లే నేనిలా..!

అమ్మ త్యాగానికి ప్రతిరూపం అంటుంటారు.. భర్త అండ ఉన్నా, లేకపోయినా పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఎంతో కష్టపడుతుందామె. వాళ్ల ఉన్నతి కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది. అలాంటి మాతృమూర్తి వల్లే ప్రస్తుతం తానీ స్థాయిలో ఉండగలిగానంటోంది తమిళనాడుకు చెందిన మహిళా ఫుట్‌బాలర్....

Published : 22 Feb 2023 19:23 IST

(Photos: Instagram)

అమ్మ త్యాగానికి ప్రతిరూపం అంటుంటారు.. భర్త అండ ఉన్నా, లేకపోయినా పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఎంతో కష్టపడుతుందామె. వాళ్ల ఉన్నతి కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది. అలాంటి మాతృమూర్తి వల్లే ప్రస్తుతం తానీ స్థాయిలో ఉండగలిగానంటోంది తమిళనాడుకు చెందిన మహిళా ఫుట్‌బాలర్ సంధ్యా రంగనాథన్‌. పిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న ఆమెకు.. తల్లీతండ్రి అన్నీ అమ్మే అయి పెంచింది. తనకు నచ్చిన ఫుట్‌బాల్‌ క్రీడలో ఆరితేరేందుకు తగిన ప్రోత్సాహమూ అందించింది. అందుకే అమ్మే నా హీరో అంటూ.. అమ్మతో దిగిన ఫొటోను తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది సంధ్య. తన కెరీర్‌ ఉన్నతిలో అమ్మ ప్రేమ, త్యాగాన్ని ప్రతిబింబిస్తోన్న ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరలవుతోంది. ఈ నేపథ్యంలో పలు ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటూ సంధ్య సాగించిన జీవిత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!

పాతికేళ్ల సంధ్యా రంగనాథన్‌.. తమిళనాడులోని పన్రూతి అనే ప్రాంతంలో పుట్టి పెరిగింది. ఆమెకో అక్క. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆమె.. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక కొన్నేళ్ల పాటు అనాథాశ్రమంలోనే పెరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో కడలూరులోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ.. తన చదువును కొనసాగించింది సంధ్య.

ఆ ఆట నచ్చింది!

సంధ్యకు చిన్న వయసు నుంచి ఆటలంటే మక్కువ. ఇక స్కూల్లో ఆడుకునే క్రమంలో ఓరోజు ఆమెకు ఫుట్‌బాల్‌ పరిచయమైంది. పాఠశాలలోని బాలికల బృందం స్కూల్‌ ఆట స్థలంలో ఫుట్‌బాల్‌ ఆడుకోవడం గమనించిన ఆమె.. వాళ్ల ఆటను తదేకంగా పరిశీలించింది. ఆ అమ్మాయిల ఆటతీరు, క్రీడలోని మెలకువలు ఆమెను ఆకట్టుకున్నాయి. ఎలాగైనా తానూ ఈ బృందంలో చేరాలని, ఫుట్‌బాల్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది సంధ్య. ఇలా తన ఇష్టాన్ని అమ్మతో పంచుకోగా.. ఆమె కూడా అందుకు అంగీకరించింది.. ప్రోత్సహించింది. దీంతో ఆ బాలికల బృందంలో చేరి ఆటలో ఓనమాలు దిద్దింది సంధ్య. మనకు ఆసక్తి ఉన్న విషయాల్ని ఇట్టే నేర్చేసుకున్నట్లు.. తక్కువ సమయంలోనే ఫుట్‌బాల్‌ క్రీడలో ఆరితేరిందామె. ఆట పట్ల తనకున్న ఈ తపనే.. ‘మహిళల జాతీయ ఫుట్‌బాల్‌ లీగ్‌’లో తమిళనాడు తరపున ప్రాతినిథ్యం వహించే అవకాశం తెచ్చిపెట్టింది.

విదేశాలకు వెళ్తాననుకోలేదు!

2018లో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న సంధ్య దేశవిదేశాల్లో పలు టోర్నమెంట్లలో పాల్గొని గోల్స్‌ సాధించింది. అయితే ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను రాష్ట్రం దాటడమే గొప్పనుకుంటే.. విదేశాలకు వెళ్తానని కలలో కూడా అనుకోలేదంటోంది సంధ్య.

‘జాతీయ జట్టులో చోటు దక్కడం నా అదృష్టం. బృందంతో కలిసి పలు టోర్నీల్లో పాల్గొనడం, దేశం తరఫున ఆడడం గొప్ప అనుభూతిని పంచుతోంది. ఒకప్పుడు నా ఆర్థిక పరిస్థితులకు రాష్ట్రం దాటడమే గొప్పనుకునేదాన్ని. అలాంటిది విదేశాలకు వెళ్తానని అస్సలు ఊహించలేదు. అయితే క్రమంగా ఆటలో పరిణతి సాధిస్తూ టోర్నీల కోసం విదేశాలకు వెళ్లడం మర్చిపోలేని అనుభూతి. మరోవైపు డబ్బు సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలవడం సంతోషంగా ఉంది. ఇక విదేశాల్లో అక్కడి క్రీడా ప్రమాణాలు, క్రీడాకారుల జీవనశైలిని చూసి స్ఫూర్తి పొందుతుంటా..’ అంటూ చెప్పుకొచ్చిందీ ఫుట్‌బాల్ ప్లేయర్.

అది నాకు కలిసొచ్చింది!

ఫుట్‌బాల్‌ క్రీడలో తన నైపుణ్యాల్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయిన సంధ్య.. తానీ స్థాయికి చేరుకోవడానికి మహిళల జాతీయ ఫుట్‌బాల్‌ లీగే కారణమంటోంది.

‘కెరీర్‌ ప్రారంభంలోనే మహిళల జాతీయ ఫుట్‌బాల్‌ లీగ్‌లో పాల్గొనే అవకాశం నాకు దొరికింది. ఈ టోర్నీ నుంచి ఎంతో నేర్చుకున్నా. తోటి క్రీడాకారిణులు, సీనియర్లతో ఆడుతూ నా ఆటతీరును మెరుగుపరచుకున్నా. నాలోని ప్రతిభను మెచ్చిన కోచ్‌ల చొరవతో జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకున్నా. ఆట విషయానికొస్తే.. ఒడిశా క్రీడాకారిణి గంగోం బాలాదేవి నాకు స్ఫూర్తి!’ అంటోన్న సంధ్య ప్రస్తుతం ‘గోకులం కేరళ మహిళల ఫుట్‌బాల్‌ క్లబ్‌’లో సభ్యురాలు.


అమ్మే నా హీరో!

ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న కుటుంబంలో పుట్టినా.. జాతీయ జట్టులో చోటు దక్కించుకునే స్థాయికి సంధ్య చేరుకుందంటే.. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల త్యాగం ఉండే ఉంటుంది. తన విషయంలో తన తల్లే త్యాగమూర్తి అంటోంది సంధ్య. ఫుట్‌బాల్‌ జెర్సీలో తన తల్లితో కలిసి దిగిన ఓ ఫొటోను తాజాగా సోషల్‌ మీడియాలో పంచుకున్న ఆమె.. ‘ప్రస్తుతం నేనింత స్థాయికి చేరుకోగలిగానంటే.. అందుకు అమ్మే ప్రధాన కారణం. ఒంటరి తల్లిగా తాను నన్ను, అక్కను పెంచి పెద్ద చేసింది. మేం కోరుకున్న జీవితాన్ని మాకు అందించింది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలకోర్చింది.. మరెన్నో త్యాగాలు చేసింది. ఈ ఉత్తమ జీవితం మాకు అమ్మ ప్రసాదించిందే! నా జీవితానికి బలమైన పునాది అమ్మే! తనే నా హీరో! తాను ప్రత్యక్షంగా నా ఆట చూడడం కంటే నాకు సంతోషమేముంటుంది?!’ అంటూ తన మనసులోని మాటల్ని అక్షరీకరించింది సంధ్య. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఫుట్‌బాల్‌ ప్రముఖుల దగ్గర్నుంచి నెటిజన్ల దాకా.. సంధ్య ప్రతిభను, ఆమె విజయం వెనకున్న తన తల్లి ప్రోత్సాహాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్