కాళ్లు చచ్చుబడినా.. అమ్మ లేకపోయినా.. సాధించేసింది!

‘తను అంతర్జాతీయ క్రీడల్లో పోటీ పడుతోందంటే పతకం ఖాయం చేసుకోవాల్సిందే..’ అన్న పేరుంది ఆమెకు. తాజాగా దీన్ని మరోసారి నిజం చేసి చూపించింది యువ అథ్లెట్‌ ప్రాచీ యాదవ్‌. ప్రస్తుతం చైనాలో జరుగుతోన్న ‘ఆసియా పారా క్రీడల్లో’ రజతం కైవసం చేసుకున్న ఆమె.. వ్యక్తిగతంగానే కాదు.. ఈ క్రీడల్లో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్‌గానూ వార్తల్లోకెక్కింది....

Updated : 29 Oct 2023 10:19 IST


(Images : Instagram)

‘తను అంతర్జాతీయ క్రీడల్లో పోటీ పడుతోందంటే పతకం ఖాయం చేసుకోవాల్సిందే..’ అన్న పేరుంది ఆమెకు. తాజాగా దీన్ని మరోసారి నిజం చేసి చూపించింది యువ అథ్లెట్‌ ప్రాచీ యాదవ్‌. ప్రస్తుతం చైనాలో జరుగుతోన్న ‘ఆసియా పారా క్రీడల్లో’ రజతం కైవసం చేసుకున్న ఆమె.. వ్యక్తిగతంగానే కాదు.. ఈ క్రీడల్లో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్‌గానూ వార్తల్లోకెక్కింది. ఆపై మరో రెండు విభాగాల్లో పసిడి పతకాలూ ఒడిసిపట్టిందామె. ఇలా వరుస పతకాలతో దూసుకుపోతోన్న ప్రాచీని ప్రధాని మోదీ సహా ఇతర ప్రముఖులంతా ప్రశంసల్లో ముంచెత్తుతూ ట్వీట్లు పెడుతున్నారు. నిజానికి ఓ పారా అథ్లెట్‌గా, ప్రత్యేక అవసరాలున్న అమ్మాయిగా తానీ స్థాయికి చేరడానికి ఎంతో కష్టపడింది ప్రాచీ.. మరెన్నో సవాళ్లకోర్చింది. అందుకే తనకున్న అంగ వైకల్యాన్ని అధిగమించి ఆమె సాగిస్తోన్న జైత్రయాత్ర ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!
ప్రాచీది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌. ఆమె తండ్రి విశ్రాంత ప్రభుత్వోద్యోగి. ఆమెకు ఓ అక్క, ఓ చెల్లి ఉన్నారు. ప్రాచీకి ఏడేళ్ల వయసున్నప్పుడే ఆమె తల్లి క్యాన్సర్‌తో మరణించింది. పుట్టుకతోనే రెండు కాళ్లు చచ్చుబడిపోయి.. 60 శాతం అంగవైకల్యంతో జన్మించిన ఆమెను తల్లి మరణం మరింత కుంగదీసింది. అయితే చిన్నతనం నుంచి ఆటలంటే ప్రత్యేక ఆసక్తి చూపిన ప్రాచీ.. తల్లి మరణించాక ఆ బాధ నుంచి తేరుకోవడానికి క్రీడల్నే మార్గంగా ఎంచుకుంది.
 

ఈత నుంచి కెనోయింగ్‌కు..!

అంగ వైకల్యం ఉన్నా ఆటలపై తన కూతురికి ఉన్న ఇష్టాన్ని గుర్తించి ప్రోత్సహించారు ప్రాచీ తండ్రి. అలా పాఠశాలలో చదివే రోజుల్లోనే ఈతను తన కెరీర్‌గా ఎంచుకుంది ప్రాచీ. వివిధ పోటీల్లో పాల్గొని బహుమతులు, పతకాలూ అందుకుంది. పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌నూ గెలుచుకుంది. అయితే ఈ సమయంలోనే కోచ్‌ ఇచ్చిన సలహా తన గమ్యాన్నే మలుపు తిప్పిందంటోందీ యువ అథ్లెట్‌.
‘పుట్టుకతోనే అంగ వైకల్యం, ఆపై చిన్న వయసులోనే అమ్మను పోగొట్టుకోవడంతో జీవితమంతా శూన్యంగా అనిపించింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆటలే నన్ను మనిషిని చేశాయి. నాన్న, స్కూల్లో కోచ్‌ల ప్రోత్సాహంతో తొలుత ఈతను ఎంచుకున్నాను. పలు పతకాలూ, ఛాంపియన్‌షిప్‌లూ గెలుచుకున్నా. అయితే నా పొడవైన చేతులు కెనోయింగ్‌ క్రీడ (పెడల్‌ సహాయంతో పడవ నడిపే క్రీడ)కు అత్యంత అనువుగా ఉంటాయని కోచ్‌ సలహా ఇచ్చారు. అలా 2018లో కెనోయింగ్‌ను ఎంచుకున్నా. అయితే ఈ క్రీడలో శిక్షణ తీసుకోవాలంటే ఖర్చూ ఎక్కువే! కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించకపోవడంతో తొలుత కాస్త ఆలోచించా. కానీ కోచ్‌లు, తెలిసిన వ్యక్తులు ఆర్థికంగా సహకరించడంతో శిక్షణ తీసుకున్నా. ఆపై ఒక్కో పోటీలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నా..’ అంటోంది ప్రాచీ.
 

‘ఏమీ సాధించలేవ’న్నారు!

నిజానికి కెనోయింగ్‌, కయాకింగ్‌ వంటి నీటి క్రీడల్లో పడవను ముందుకు నెట్టాలంటే కాళ్లతోనే సాధ్యమవుతుంది. కానీ రెండు కాళ్లు చచ్చుబడిపోయిన ప్రాచీకి ఇదే అతి పెద్ద సవాలుగా మారింది. అయినా తన శరీరంలోని పైభాగాన్నే కాళ్లుగా మలచుకొని దీన్నీ అధిగమించిందామె.
‘నాకున్న అంగవైకల్యం కారణంగా చిన్నప్పట్నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. చాలామంది ‘ఈ శారీరక లోపంతో నువ్వేమీ సాధించలేవ’ని మొహమ్మీదే చెప్పేవారు. అయినా అవేవీ పట్టించుకోకుండా నా సత్తా ఏంటో చూపించాలనుకున్నా.. వాళ్ల అభిప్రాయాలు తప్పని నిరూపించాలనుకున్నా. అయితే అదంత సులభం కాలేదు. ఎందుకంటే కెనోయింగ్‌ వంటి నీటి క్రీడల్లో కాళ్లే ప్రధాన పాత్ర పోషిస్తాయి. పెడల్స్‌ ఉన్నా కాళ్ల సహాయంతోనే పడవను బలంగా ముందుకు నెట్టాల్సి ఉంటుంది. కానీ నా రెండు కాళ్లు పని చేయకపోవడంతో నడుం పై భాగంతోనే పడవను ముందుకు నెట్టడాన్ని సాధన చేశా.. నిజానికి ఇలా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం చాలా కష్టంగా అనిపించేది. అందుకే కోచ్‌ నా కోసం ప్రత్యేకంగా ఓ పడవను తయారుచేయించారు. ఇలా కోచ్‌ల సహకారం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగా..’ అంటూ చెప్పుకొచ్చిందీ పారా అథ్లెట్‌.
 

తొలి ప్లేయర్‌గా ఘనత!

జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో జరిగిన కెనోయ్‌ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సొంతం చేసుకున్న ప్రాచీ.. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో కెనోయింగ్, కయాకింగ్‌ వంటి క్రీడల్లో పాల్గొనే అవకాశం అందుకుంది. తద్వారా ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో కెనోయ్‌ విభాగంలో పోటీపడేందుకు అర్హత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఘనత సాధించింది ప్రాచీ. అయితే కొవిడ్‌ కారణంగా ఈ క్రీడలు వాయిదా పడడంతో సాధన చేయడానికి ఆమెకు మరింత సమయం దొరికినట్లయింది. ఇక గతేడాది జరిగిన ‘పారా కెనోయ్‌ ప్రపంచకప్‌’, ‘ఐసీఎఫ్‌ కెనోయ్‌ స్ప్రింట్‌’ పోటీల్లో రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకున్న ఈ పారా అథ్లెట్‌.. ప్రస్తుతం జరుగుతోన్న ‘ఆసియా పారా క్రీడల్లో’ తొలుత రజత పతకం గెలుచుకుంది. దీంతో ఈ గేమ్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన ప్లేయర్‌గా వార్తల్లోకెక్కింది ప్రాచీ. ఆపై మరో రెండు విభాగాల్లో రెండు పసిడి పతకాలు ముద్దాడి.. ముచ్చటగా మూడు పతకాల్ని తన ఖాతాలో వేసుకుందీ యువ క్రీడాకారిణి. ఇలా ప్రాచీ చూపిన ప్రతిభను ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘ఆసియా పారా గేమ్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన ప్రాచీ యాదవ్‌ పేరు దేశ క్రీడా చరిత్రలో నిలిచిపోతుంది. ఆమె ప్రతిభ దేశానికే గర్వకారణం!’ అంటూ ట్వీట్‌ చేశారు.
 

అదే నా ఫిట్‌నెస్‌ మంత్ర!

కెనోయింగ్‌ క్రీడలో దేశానికి పతకాల పంట పండిస్తోన్న ప్రాచీ.. చక్కటి వక్త కూడా! ఈ క్రమంలోనే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. వంటి అంశాలపై ఔత్సాహిక క్రీడాకారులకు, చిన్నారులకు, యువతకు పలు సలహాలు అందిస్తోందామె.
‘ఆటల్లో రాణించాలంటే ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌ కూడా ముఖ్యమే! ఇది సొంతం కావాలంటే వ్యాయామాలు సరిపోవు.. దానికి చక్కటి పోషకాహారం కూడా జత చేయాల్సి ఉంటుంది. అప్పుడే శరీరం శక్తిమంతమవుతుంది. ఇక నా విషయానికొస్తే ప్రతి రెండు గంటలకోసారి తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటా. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామాలూ చేస్తా.. అందుకే నిరంతరం యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉండగలుగుతున్నా..’ అంటోంది ప్రాచీ. ఇలా చెప్పడమే కాదు.. తన ఫిట్‌నెస్‌ వీడియోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ నేటి యువతలో ఈ దిశగా స్ఫూర్తి నింపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్