Sunelita Toppo : వెదురు కర్రలతో హాకీ ఆడా!

ఒడిశాలోని సుందర్‌ఘర్‌.. ‘క్రాడిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ హాకీ’గా ఈ జిల్లాకు పేరుంది. ఒడిశా హాకీ క్రీడాకారుల్లో 90 శాతం మంది ఇక్కడి వారే కావడం గమనార్హం. ఇదే జిల్లాలోని కుకుడా గ్రామానికి చెందిన సునెలితా టొప్పో కూడా ఇక్కడే హాకీ మెలకువలు నేర్చుకుంది.

Published : 29 Nov 2023 13:01 IST

(Photo: Twitter)

ఒడిశాలోని సుందర్‌ఘర్‌.. ‘క్రాడిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ హాకీ’గా ఈ జిల్లాకు పేరుంది. ఒడిశా హాకీ క్రీడాకారుల్లో 90 శాతం మంది ఇక్కడి వారే కావడం గమనార్హం. ఇదే జిల్లాలోని కుకుడా గ్రామానికి చెందిన సునెలితా టొప్పో కూడా ఇక్కడే హాకీ మెలకువలు నేర్చుకుంది. సరిగ్గా ఏడాది క్రితం జూనియర్‌ జట్టులోకి ప్రవేశించిన ఆమె.. తనదైన ప్రతిభతో రాణిస్తోంది.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఏడాది కాలంలోనే సీనియర్‌ జట్టు కోచింగ్‌ క్యాంప్‌లో చేరే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. ఇక త్వరలో ప్రారంభం కానున్న ‘జూనియర్‌ మహిళల ప్రపంచకప్‌’లోనూ పాల్గొనే అవకాశాన్ని ఇటీవలే అందుకున్న సునెలితా స్ఫూర్తి ప్రయాణమిది!

సునెలితాది వ్యవసాయాధారిత కుటుంబం. చిన్నతనం నుంచి ఆటల్ని ఇష్టపడుతూ పెరిగిన ఆమె.. స్కూల్లో వివిధ రకాల ఆటల పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. తన ఎనిమిదేళ్ల వయసులో హాకీ ఆడడం ప్రారంభించిన ఆమె.. దాన్నే తన కెరీర్‌గా మలచుకోవాలని నిర్ణయించుకుంది. ‘మా గ్రామంలో ఓ పండక్కి ఆటల పోటీలు నిర్వహించారు. ఇందులో కొందరు మహిళలు హాకీ ఆడడం చూశా. నాకూ ఈ క్రీడపై మక్కువ ఏర్పడింది. దాంతో నా ఇష్టాన్ని మా నాన్నతో చెప్పా. ఆయన నన్ను ప్రోత్సహించారు. అదే ఊర్లో ఉన్న కోచ్‌ వద్దకు నన్ను తీసుకెళ్లారు..’ అంటూ ఓ సందర్భంలో పంచుకుందీ యంగ్‌ హాకీ ప్లేయర్‌.

వెదురు కర్రలే హాకీ స్టిక్స్‌!

హాకీ క్రీడలో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. పలు సవాళ్లు ఎదురయ్యాయంటోంది సునెలితా. ‘హాకీ ఆడాలంటే అందుకు తగిన కిట్‌ ఉండాలి. కానీ ఆర్థిక కారణాల వల్ల తొలినాళ్లలో దానికి నోచుకోలేకపోయా. హాకీ స్టిక్‌ కొనే స్థోమత లేకపోవడంతో వెదురు కర్రలనే హాకీ స్టిక్స్‌గా మలచుకున్నా. వాటితోనే సాధన చేశా. ఆ తర్వాత హాకీపై నాకున్న మక్కువ చూసి మా బంధువుల్లో ఒకరు నాకు హాకీ కిట్‌ కొనిచ్చారు. ఆ తర్వాత సుందర్‌ఘర్‌లోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI) ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణలో చేరాను. అక్కడే ఈ క్రీడపై పూర్తి పట్టు పెంచుకున్న నాకు 2018 భుజానికి గాయమైంది. దాంతో కొన్నాళ్ల పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. ఇక్కడి స్టాఫ్‌, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గాయం నుంచి కోలుకున్నా. భవిష్యత్తులో ఇలాంటి గాయాల్ని నివారించేలా నా ఆటతీరులో పలు మార్పులు చేర్పులు చేసుకున్నా..’ అంటోంది సునెలితా.

ఆటతో అదరగొడుతూ..!

గతేడాది గుజరాత్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో ఒడిశా తరఫున పాల్గొన్న ఆమె.. చక్కటి ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ ఏడాది జపాన్‌ వేదికగా నిర్వహించిన ‘జూనియర్‌ మహిళల ఆసియా కప్‌’తో జాతీయ జూనియర్‌ మహిళల హాకీ జట్టులోకి ప్రవేశించిన ఆమె.. జట్టు బంగారు పతకం కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది. సెమీఫైనల్‌లో ఆఖరి నిమిషంలో గోల్‌ చేసి.. జట్టును గెలిపించి.. ఫైనల్‌ చేర్చిన ఆమెపై పలువురు క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అంతేకాదు.. 16 ఏళ్ల వయసులోనే తన అద్భుతమైన క్రీడా ప్రదర్శనతో సీనియర్‌ జట్టు కోచింగ్‌ క్యాంప్‌లో చేరే అరుదైన అవకాశం సైతం ఆమెను వరించింది. ఇక ఇటీవలే ‘జూనియర్‌ మహిళల ప్రపంచకప్‌ - 2023’లో పాల్గొనే అవకాశం అందుకుందామె. నవంబర్‌ 29 నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి.

‘ప్రస్తుతం మా జట్టులో అద్భుతమైన క్రీడాకారిణులున్నారు. వివిధ రకాల టోర్నీల్లో పాల్గొని మేమంతా మరిన్ని నైపుణ్యాల్ని కూడగట్టుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ జట్లతో పోటీ పడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ అంతర్జాతీయ వేదికపైనా మెరుగైన ప్రదర్శన చేసి దేశానికి పతకం అందించాలన్న లక్ష్యంతో పోరాడతాం..’ అంటోంది సునెలితా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్