Young Innovator: పండ్లు, కూరగాయలు నిల్వ చేసే కూల్‌రూమ్స్!
మార్కెట్ కెళ్తే కిలోల కొద్దీ కుళ్లిన కాయగూరలు, పండ్లు ఓ మూలన వృథాగా పడేయడం చూస్తుంటాం. దీనివల్ల పంటకు తగిన ఆదాయం రాక రైతులు నష్టపోతుంటారు. మరోవైపు.. అధిక దిగుబడుల్లో పండించిన పండ్లు, కాయగూరల్ని సంప్రదాయ పద్ధతుల్లో గోదాముల్లో నిల్వ ఉంచినా....
(Photos: Instagram)
మార్కెట్ కెళ్తే కిలోల కొద్దీ కుళ్లిన కాయగూరలు, పండ్లు ఓ మూలన వృథాగా పడేయడం చూస్తుంటాం. దీనివల్ల పంటకు తగిన ఆదాయం రాక రైతులు నష్టపోతుంటారు. మరోవైపు.. అధిక దిగుబడుల్లో పండించిన పండ్లు, కాయగూరల్ని సంప్రదాయ పద్ధతుల్లో గోదాముల్లో నిల్వ ఉంచినా అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండవు.. పోనీ రిఫ్రిజిరేటర్‌లో భద్రపరుద్దామంటే.. దాన్నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి నష్టం. ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క ఆవిష్కరణతో పరిష్కారం చూపింది చెన్నైకి చెందిన టీనేజ్ విద్యార్థిని మహేక్ పర్వేజ్. రిఫ్రిజిరేటర్‌తో పని లేకుండా, పర్యావరణహితంగానే కాయగూరల్ని, పండ్లను ఎక్కువ రోజుల పాటు నిల్వ చేయడానికి.. ‘సన్‌హార్వెస్టెడ్ కూల్‌రూమ్స్’ని రూపొందించిందామె. ఇలా తాను చేసిన వినూత్న ఆవిష్కరణకు గుర్తింపుగా.. ఈ ఏడాదికి గాను ఇటీవలే ‘లెక్సస్ డిజైన్ ఇండియా’ అవార్డు అందుకుంది పర్వేజ్. ఈ నేపథ్యంలో తన గురించి, తన ఇన్నొవేషన్ గురించి కొన్ని విశేషాలు మీకోసం..!
పర్వేజ్‌ది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం. దాంతో చిన్నతనంలో తన కుటుంబం కూడా పంట పొలాలకు దగ్గరగానే నివసించేది. ఈ క్రమంలోనే కొంతమంది రైతులు తాము పండించిన కాయగూరలు, పండ్లు.. త్వరగా కుళ్లిపోయి.. మార్కెట్‌కు చేరకముందే వాటిని పడేయాల్సిన దుస్థితిని గమనించింది.
అమ్మ సమస్య చూశాక..!
అంతెందుకు.. పర్వేజ్ తల్లి కూడా వ్యవసాయం చేస్తుంటారు. స్ట్రాబెర్రీ, చెర్రీ.. వంటి సీజనల్ పండ్లను సాగు చేస్తుంటారామె. తన తల్లి విషయంలోనూ ఇలాంటి సమస్యల్ని గుర్తించిన ఆమె.. ఎలాగైనా దీనికి పరిష్కారం చూపాలనుకుంది.
‘మాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో మా అమ్మ మరో ఆరుగురు రైతులతో కలిసి వ్యవసాయం చేస్తోంది. స్ట్రాబెర్రీ, చెర్రీ, ప్యాషన్ ఫ్రూట్.. వంటి ఖరీదైన పండ్లను సాగు చేస్తోంది. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. పొలంలోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. ఈ క్రమంలోనే రైతుల సమస్యలు నాకు అర్థమయ్యాయి. నెలల కొద్దీ కష్టపడి పంటలు పండిస్తే.. అవి వినియోగదారుల్ని చేరకముందే వృథా అవడం గుర్తించాను. కొంతమంది రైతులు సంప్రదాయ పద్ధతుల్లో గోదాముల్లో ఆయా పండ్లు, కాయగూరల్ని నిల్వ చేసినా.. అవి త్వరగా కుళ్లిపోవడం గమనించాను. అలాగని అందరి వద్ద రిఫ్రిజిరేటర్లు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా.. వాటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యలన్నీ పరిగణనలోకి తీసుకొని పరిష్కారం దిశగా ఆలోచించడం మొదలుపెట్టా. ఈ క్రమంలో వచ్చిన ఐడియానే ఈ సన్‌హార్వెస్టెడ్ కూల్ రూమ్స్..’ అంటూ చెప్పుకొచ్చింది పర్వేజ్.
అసలేంటీ ‘కూల్ రూమ్స్’ ?
ఈ క్రమంలోనే పలు పరిశోధనలు చేసి, కాన్సెప్ట్‌ను అర్థం చేసుకున్నాక.. ఒక నమూనాను తయారుచేసింది పర్వేజ్. ‘చెన్నైలో పగటి పూట హ్యుమిడిటీ ఎక్కువ. ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు పైమాటే! అదే సాయంత్రం కాగానే చల్లబడుతుంది. నిజానికి ఇలాంటి హ్యుమిడిటీతో కూడిన వాతావరణంలో పండ్లు, కాయగూరలు త్వరగా పాడైపోతాయి. ఇలా ఈ పరిస్థితుల్ని తట్టుకొనేలా ఈ కూల్ రూమ్స్‌లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశా. ఇందులో ముఖ్యంగా బ్రిక్ రూమ్, ఎగ్జాస్ట్ చిమ్నీ, డ్రాఫ్ట్ ట్యూబ్.. అనే మూడు భాగాలుంటాయి. భౌతిక సూత్రాల ఆధారంగా ఇవి పనిచేస్తాయి. తద్వారా రిఫ్రిజిరేటర్ అవసరం లేకుండానే చల్లదనం ఉత్పత్తవుతుంది.
సూర్యరశ్మిని శోషించుకొని..!
చెక్క, అల్యూమినియంతో తయారుచేసిన డ్రాఫ్ట్ ట్యూబ్‌లో ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని నింపుతాం. దీనిపై గ్లాస్ కవర్ ఉంటుంది. ఎగ్జాస్ట్ చిమ్నీ, బ్రిక్ రూమ్.. ఈ ట్రేకు అనుసంధానించి ఉంటాయి. ట్రేలో నింపిన ప్రత్యేకమైన పదార్థం సూర్యరశ్మిని గ్రహించి.. పలు భౌతిక చర్యలు జరిపి.. బ్రిక్ రూమ్‌ను చల్లబరుస్తుంది. తద్వారా అందులో నిల్వ ఉంచిన కాయగూరలు, పండ్లు ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి.. ఫలితంగా ఇటు పర్యావరణానికి మేలు.. అటు పదార్థాలు వృథా కాకుండా రైతుల శ్రమకు తగిన ఫలితమూ దక్కుతుంది.. ఇలా సహజ పద్ధతిలో నిల్వ చేయడం వల్ల మరోవైపు ఆరోగ్యానికీ మంచిది..’ అంటూ తన ఆవిష్కరణ గురించి చెప్పుకొచ్చింది పర్వేజ్.
ప్రతిభకు దక్కిన పురస్కారం!
ఇలా తాను రూపొందించిన ఆవిష్కరణతో.. సంప్రదాయ పద్ధతుల్లో, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన ఉత్పత్తుల కంటే అదనంగా ఎక్కువ రోజుల పాటు వాటిని తాజాగా ఉంచచ్చంటోన్న పర్వేజ్.. తన ప్రతిభకు గుర్తింపుగా ఇటీవలే ‘లెక్సస్ డిజైన్ ఇండియా-2023’ అవార్డు అందుకుంది. సమాజంలో ఉన్న సమస్యల్ని గుర్తించి.. వాటికి కొత్త కొత్త ఆవిష్కరణలతో పరిష్కారం చూపిన యువ అఛీవర్స్‌కి ఏటా అందించే అవార్డిది. ‘ఎకో-ఇన్నొవేషన్’ విభాగంలో వివిధ దేశాలకు చెందిన వెయ్యి విభిన్న ప్రాజెక్టులతో పోటీపడి మరీ పర్వేజ్ ఈ పురస్కారం గెలుచుకోవడం విశేషం. ప్రస్తుతం అటు తన చదువు కొనసాగిస్తూనే.. ఇటు ఓ స్వచ్ఛంద సంస్థలో స్టూడెంట్ వలంటీర్‌గా ఉన్న పర్వేజ్‌కు.. వయొలిన్, గోల్ఫ్, మార్షల్ ఆర్ట్స్.. వంటి అంశాల్లోనూ ప్రావీణ్యముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.