‘ఇంజినీరింగ్‌ వద్దు.. పెళ్లి చేసుకోమ’న్నారు!

మన చుట్టూ ఎన్నో సమస్యలుంటాయి. వాటిని చూస్తూ నాకెందుకులే అనుకునే వారే ఎక్కువ! కానీ బెంగళూరుకు చెందిన అరుణిమా సేన్‌ అలా ఆలోచించలేదు. స్వీయానుభవాలతో ఈ సమాజంలోని వివిధ సమస్యల్ని గుర్తించిన ఆమె..

Updated : 03 Mar 2023 18:41 IST

మన చుట్టూ ఎన్నో సమస్యలుంటాయి. వాటిని చూస్తూ నాకెందుకులే అనుకునే వారే ఎక్కువ! కానీ బెంగళూరుకు చెందిన అరుణిమా సేన్‌ అలా ఆలోచించలేదు. స్వీయానుభవాలతో ఈ సమాజంలోని వివిధ సమస్యల్ని గుర్తించిన ఆమె.. వాటికి టెక్నాలజీతో పరిష్కారం చూపాలనుకుంది. ఈక్రమంలోనే అనేక సాంకేతిక పరికరాల్ని అభివృద్ధి చేసింది. తనలో ఉన్న ఈ సృజనాత్మకతే చిన్న వయసులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఆమెకు ఎన్నో అవార్డులు-రివార్డులు తెచ్చిపెట్టింది. ఈ సమాజ స్థితిగతుల్ని మార్చే శక్తి యువతకే ఉందంటోన్న అరుణిమ.. ఆయా సమస్యలకు కచ్చితమైన, సులభమైన పరిష్కారం చూపడంలో టెక్నాలజీని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదంటోంది. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ నేపథ్యంలో శాస్త్రసాంకేతిక రంగాల్లో (STEM) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ యువ టెకీ అంతరంగం మీకోసం..!

బెంగళూరులో పుట్టిపెరిగింది అరుణిమ. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇస్రోలో ఉద్యోగులు. ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు, క్రమశిక్షణతో కూడిన వాతావరణం మధ్య పెరిగిన ఆమెకు.. కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవాలన్న మక్కువ చిన్నతనం నుంచే అలవడింది. ఈ క్రమంలోనే సామాజిక అంశాలు, టెక్నాలజీకి సంబంధించిన విషయాల గురించి నిత్యం తన పేరెంట్స్‌తో చర్చించేదామె. ఇదే శాస్త్రసాంకేతిక రంగాలపై ఆమెకు ఆసక్తి పెరిగేందుకు దోహదం చేసింది.

‘ఇంజినీరింగ్‌ వద్దు.. పెళ్లి చేసుకోమ’న్నారు!

సాధారణంగా ఇలా ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులున్న పిల్లలకు ఎలాంటి సమస్యలు ఉండవనుకుంటారు చాలామంది. అయితే తన విషయంలో స్కూలింగ్‌ అంతా హ్యాపీగానే గడిచినా.. పైచదువులకు వెళ్లే క్రమంలో మాత్రం పలు సమస్యలు ఎదురయ్యాయంటోంది అరుణిమ.

‘మీ అమ్మానాన్నలిద్దరూ ఇస్రోలో ఉద్యోగులు.. నీకేంటి లోటు? అనేవారు చాలామంది. కానీ నా స్కూలింగ్‌ పూర్తయ్యాక మా ఇల్లు సమస్యల వలయంగా మారిపోయింది. నాన్న తాగి రావడం, అమ్మను-నన్ను-అన్నయ్యను వేధించడం.. ఇలా రోజురోజుకీ తన హింస పెరిగిపోయేది. అది భరించలేక ఒకానొక సమయంలో మేం ముగ్గురం ఇల్లు వదిలి బయటికొచ్చేశాం. ఈ వేధింపులు అమ్మ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో తాను కొన్నాళ్ల పాటు తీవ్ర అనారోగ్యానికి గురైంది. మరోవైపు అన్నయ్యకు ఆటిజం.. ఈ పరిస్థితుల్లో పలు కుటుంబ బాధ్యతలు నా భుజాన పడ్డాయి. ఇక ఇంజినీరింగ్‌ చదువుతానంటే.. తెలిసిన వాళ్లంతా ‘అది అబ్బాయిలకు సూటవుతుంది.. అమ్మాయిలకు కాదు! అయినా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండక.. నీకెందుకు ఇంజినీరింగ్‌?’ అన్నారు. ఇలా వాళ్ల మాటలే నాలో లక్ష్యంపై పట్టు పెంచాయి..’ అంటోన్న అరుణిమ.. అశోకా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌-భౌతిక శాస్త్రం విభాగాల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసింది. యూఎస్‌లోని యేల్‌ యూనివర్సిటీలో నిర్వహించిన ‘యేల్‌ యంగ్‌ గ్లోబల్‌ స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌’ కోసం ఎంపికైన ఐదుగురు భారతీయుల్లో అరుణిమ ఒకరు.

సమస్యలు.. టెక్‌ పరిష్కారాలు!

పోషకాహార లోపం దగ్గర్నుంచి వాతావరణ కాలుష్యం దాకా.. ఈ సమాజంలో నిత్యం ఎన్నో సమస్యలు మనకు సవాలు విసురుతుంటాయి. కానీ వాటిని పట్టించుకొని పరిష్కారం వెతికే వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ఆ జాబితాలో అరుణిమ ముందు వరుసలో ఉంటుంది. వ్యక్తిగతంగా వివిధ సమస్యల్ని ఎదుర్కొంటూ పెరిగిన ఆమె.. సామాజిక సమస్యల్ని మరింత సునిశితంగా అర్థం చేసుకుంది. ఈ క్రమంలో పలు పరిశోధనలు కూడా చేసింది. ఒక్కొక్కటిగా ఆయా సమస్యలకు టెక్నాలజీతో తగిన పరిష్కారాలు చూపే లక్ష్యంతో ఇప్పటికే పలు సాంకేతిక పరికరాల్ని కూడా అభివృద్ధి చేసింది అరుణిమ. తన తొలి ప్రాజెక్ట్‌లో భాగంగా.. వెంట్రుకలతో శరీరంలోని సూక్ష్మపోషకాల స్థాయుల్ని కచ్చితంగా గుర్తించే ‘Arduino Pro Mini’ అనే పరికరాన్ని అభివృద్ధి చేసిందామె. ఇందుకోసం పోలండ్‌, ఫిన్‌ల్యాండ్‌, యూఎస్‌ఏ.. వంటి దేశాలకు చెందిన విద్యార్థులతో కలిసి పనిచేసింది. ఆపై పెద్ద పెద్ద భవన సముదాయాల్లో విద్యుత్తు, నీటి కొరతను తగ్గించి.. వీటిని సహజసిద్ధంగా పొదుపు చేసేందుకు మరో సాంకేతిక పరికరాన్ని రూపొందించింది అరుణిమ.

స్వీయానుభవాలే స్ఫూర్తిగా!

‘నేను రూపొందించే సాంకేతిక పరికరాలు చాలావరకు నా స్వీయానుభవాల నుంచి పుట్టినవే! బెంగళూరు చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో విద్యుత్తు, నీటి కొరత ఉందన్న విషయం తెలుసుకొని.. ఈ సమస్యలకు పరిష్కారం చూపే క్రమంలోనే ఓ టెక్‌ పరికరాన్ని అభివృద్ధి చేశా. ముఖ్యంగా ఆకాశ హర్మ్యాలు, పెద్ద పెద్ద భవన సముదాయాల్లో కరెంట్‌, నీటిని పొదుపు చేయడంలో ఈ పరికరం కీలక పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో ఈ వనరుల కొరతనూ నివారిస్తుంది. ఈ క్రమంలో గృహావసరాల కోసం వినియోగించుకున్న నీటిని తిరిగి శుద్ధి చేయడం, వర్షపు నీటిని సేకరించడం, సౌరశక్తిని శోషించుకొని విద్యుత్‌ తయారుచేయడం.. ఇలా దీంతో పలు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తద్వారా వాతావరణానికీ మేలు జరుగుతుంది.

ఇదిలా ఉంటే.. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామంది మహిళలు, పిల్లలు రక్తహీనత, ఇతర పోషకాల లోపంతో ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అధిగమించడానికే సూక్ష్మపోషకాల స్థాయుల్ని కచ్చితంగా గుర్తించే పరికరం రూపొందించా..’ అంటోన్న అరుణిమ.. ప్రస్తుతం చిన్న వయసులోనే ఆటిజంను గుర్తించే మరో సాంకేతిక పరికరాన్ని అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైంది. ఇదీ ఆటిజంతో ఇబ్బంది పడుతోన్న తన అన్నయ్య స్ఫూర్తితోనే రూపొందిస్తున్నానంటోందీ టెకీ.

ఈ పట్టుదలే కావాలి!

ఇలా తాను రూపొందించే ఏ సాంకేతిక పరికరమైనా.. సంబంధిత సమస్యకు కచ్చితమైన పరిష్కారం చూపడంతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటోంది అరుణిమ. ఇలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో తన సేవలకు గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయంగా పలు అవార్డులు-రివార్డులు అందుకుందామె. 2019లో ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’, ‘ప్రెసిడెంట్స్‌ గోల్డ్‌ మెడల్‌’, ‘ఎంపవర్‌ ఫైనాన్సింగ్‌ విమెన్‌ ఇన్‌ స్టెమ్‌ గ్రాండ్‌ అవార్డ్‌’.. వంటి పలు పురస్కారాలు ఆమెను వరించాయి. మరోవైపు ‘2020 గ్లోబల్‌ టీన్‌ లీడర్‌’ ప్రోగ్రామ్‌కీ ఎంపికైంది అరుణిమ.

‘నా జీవితం నాకు ఎన్ని సవాళ్లు విసిరినా.. వాటిని సానుకూలంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాను.. వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా నన్ను నేను మెరుగుపరచుకున్నాను. లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరికీ ఈ పట్టుదలే కావాలి.. అటు దేశం, ఇటు ప్రపంచం అభివృద్ధి చెందాలంటే శాస్త్రసాంకేతిక రంగాల్లో యువత ప్రాతినిథ్యం పెరగాలి.. అప్పుడే మన చుట్టూ ఉన్న సమస్యలకు కచ్చితమైన పరిష్కారాలు దొరుకుతాయి..’ అంటూ నేటి యువతలో స్ఫూర్తి నింపుతోందీ యువ టెకీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్