Windsurfer: నీటితో చెలగాటం.. ఈ అమ్మాయికెంతో ఇష్టం!

విండ్‌ సర్ఫింగ్‌.. సెయిలింగ్‌, సర్ఫింగ్‌ కలగలిపి ఆడే నీటి క్రీడ ఇది. అమ్మాయిలు అరుదుగా ఎంచుకునే ఈ క్రీడలో రాణిస్తూ దేశానికి పతకాల పంట పండిస్తోంది గోవా అమ్మాయి కత్యా ఇడా కోయెల్హో. అభిరుచిగా ఎంచుకున్న ఈ ఆటపై క్రమంగా మక్కువ పెంచుకున్న ఆమె.. దీన్నే తన పూర్తి స్థాయి కెరీర్‌గా....

Published : 14 Jun 2023 18:06 IST

(Photos: Instagram)

విండ్‌ సర్ఫింగ్‌.. సెయిలింగ్‌, సర్ఫింగ్‌ కలగలిపి ఆడే నీటి క్రీడ ఇది. అమ్మాయిలు అరుదుగా ఎంచుకునే ఈ క్రీడలో రాణిస్తూ దేశానికి పతకాల పంట పండిస్తోంది గోవా అమ్మాయి కత్యా ఇడా కోయెల్హో. అభిరుచిగా ఎంచుకున్న ఈ ఆటపై క్రమంగా మక్కువ పెంచుకున్న ఆమె.. దీన్నే తన పూర్తి స్థాయి కెరీర్‌గా మలచుకుంది. ఇందులో రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో అరుదైన విజయాలు సాధిస్తోంది. 2014 ‘యూత్‌ ఒలింపిక్స్‌’లో పాల్గొన్న తొలి, ఏకైక భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన ఈ గోవా సర్ఫర్‌.. త్వరలో జరగనున్న ఏషియన్‌ గేమ్స్‌కు, ప్రపంచ ఛాంపియన్‌కు అర్హత సాధించింది. ఈ రెండు ఈవెంట్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఉవ్విళ్లూరుతోన్న కత్యా విండ్‌సర్ఫింగ్‌ జర్నీ గురించి తెలుసుకుందాం..

కత్యా గోవాలో పుట్టి పెరిగింది.. ఆమె తండ్రి, అన్నయ్య.. ఇద్దరూ జాతీయ స్థాయి విండ్‌సర్ఫింగ్‌ క్రీడాకారులే! చిన్న వయసు నుంచే వీరిద్దరినీ చూస్తూ పెరిగిన ఆమెకూ ఈ క్రీడపై ఇష్టం ఏర్పడింది. దాంతో 11 ఏళ్ల వయసు నుంచే ఈ క్రీడలో మెలకువలు నేర్చుకోవడం ప్రారంభించింది కత్యా.

అప్పుడు భయమేసింది!

తన తండ్రితో కలిసి విండ్‌ సర్ఫింగ్‌ ప్రాక్టీస్‌ సెషన్స్‌కి, టోర్నమెంట్స్‌కి వెళ్లేది కత్యా. అంతటితో ఊరుకోకుండా.. వెళ్లిన చోటే ఈ క్రీడను సాధన చేసేది. ఇక వేసవి సెలవులొస్తే కత్యాకు పండగే! ఎందుకంటే.. నిరంతరాయంగా దీన్ని సాధన చేయచ్చని! అయితే అభిరుచిగా తాను ఎంచుకున్న ఈ క్రీడే తన కెరీర్‌గా మారుతుందని ఊహించలేదంటోందీ యంగ్‌ ప్లేయర్.

‘చిన్న వయసు నుంచే నీళ్లను చూస్తూ పెరిగిన నాకు అవంటే భయం పోయింది. అయినా తొలిసారి విండ్‌ సర్ఫింగ్‌ చేయడానికి నీటిలోకెళ్లిన నేను నెర్వస్‌గా ఫీలయ్యా. జెల్లీ ఫిష్‌, డాల్ఫిన్స్‌.. వంటివి నాకు దగ్గరగా వచ్చేసరికి కాస్త భయమేసింది. కానీ ఈ అభిరుచే నేను కెరీర్‌గా మార్చుకోవాలని, మారుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ప్రస్తుతం ఈ ఆటను ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నా..’ అంటోంది కత్యా.

ప్రతిరోజూ సాహసమే!

నిజానికి సాహస క్రీడల్లో విండ్‌ సర్ఫింగ్‌ కూడా ఒకటి. సెయిలింగ్‌, సర్ఫింగ్‌ కలగలిపి.. గాలి వీచే దిశగా విండ్‌ సర్ఫింగ్‌ బోర్డుపై దూసుకెళ్లే ఈ ఆట నీటితో చెలగాటమాడినంత సవాలుతో కూడుకున్నదంటోంది కత్యా.
‘విండ్‌ సర్ఫింగ్‌ను ఎంచుకోవడంతోనే సరిపోదు.. ఇందుకు శారీరకంగా, మానసికంగా దృఢమవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు.. గాలి, నీటి పరిస్థితుల్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఏ రెండు రోజులూ విండ్ సర్ఫింగ్‌కు సమానమైన అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండకపోవచ్చు. కాబట్టి రోజూ ఓ కొత్త సాహసంలా అనిపిస్తుంటుందీ క్రీడ. అందుకే ఇది నాకెంతో నచ్చింది. అయితే ఇందులో పలు సవాళ్లూ ఎదుర్కొన్నా. 2018 ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొన్న సమయంలో ప్రమాదవశాత్తూ బోర్డ్‌పై నుంచి నీటిలో పడిపోయా. ఫలితంగా నా రెండు మోకాళ్లకు గాయాలయ్యాయి. అదే సమయంలో వరల్డ్‌ సెయిలింగ్‌ సంస్థ అప్పటిదాకా ఉన్న RS:X విభాగం స్థానంలో IQFoil అనే కొత్త విభాగాన్ని పరిచయం చేసింది. ఇక గాయం నుంచి కోలుకున్నాక.. ఈ అధునాతన విభాగంలో శిక్షణ తీసుకున్నా..’ అంటోన్న కత్యా.. ఈ కొత్త విభాగంలో రాణిస్తోన్న ఏకైక భారతీయ విండ్‌ సర్ఫర్‌గా ఘనత సాధించింది.

దేశానికి పతకాల పంట!

విండ్‌ సర్ఫింగ్‌లో భాగంగా ఇప్పటివరకు పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది కత్యా. 2014 ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొన్న తొలి, ఏకైక భారతీయురాలిగా చరిత్రకెక్కిన ఆమె.. 2018 ఏషియన్‌ గేమ్స్‌లోనూ సత్తా చాటింది. ఇక గతేడాది థాయ్‌ల్యాండ్‌ వేదికగా జరిగిన ‘ప్రపంచ విండ్‌సర్ఫింగ్‌ కప్‌’ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ఈ గోవా సర్ఫర్‌.. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో 15 పసిడి, 1 రజత, 2 కాంస్య పతకాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనా వేదికగా జరగనున్న ‘ఏషియన్‌ గేమ్స్‌’కూ అర్హత సాధించిన కత్యా.. కొత్త విభాగంలోనే ప్రత్యర్థులతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో రాబోయే ‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌’ కోసం అనితర సాధన చేస్తున్నానంటోంది.

రోజులో నాలుగ్గంటలు..!

‘ప్రస్తుతం నా ముందున్న లక్ష్యాలు మూడే మూడు. తొలుత ఏషియన్‌ గేమ్స్‌, ఆపై వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌.. వచ్చే ఏడాది జరగనున్న ప్యారిస్‌ ఒలింపిక్స్‌. అసాధారణమైన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని మరీ విండ్ సర్ఫింగ్‌ చేసేలా సాధన చేస్తున్నా. ఇందులో భాగంగా.. రోజుకు రెండు గంటలు కఠినమైన వ్యాయామాలు, కనీసం రెండు గంటల పాటు విండ్‌ సర్ఫింగ్‌ సాధనకు సమయం కేటాయిస్తున్నా. ఎందుకంటే ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే.. తొలి రెండు పోటీలే కీలకం. రాబోయే పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి.. దేశానికి పతకాలు తీసుకురావాలని ఉవ్విళ్లూరుతున్నా. తద్వారా అమ్మాయిలు ఈ క్రీడను ఎంచుకునేలా స్ఫూర్తి నింపాలనుకుంటున్నా..’ అంటోన్న కత్యా ఫ్రీలాన్సర్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌, పెయింటర్‌ కూడా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్