Archana Devi : పూరి గుడిసెలో పుట్టి.. క్రికెటరైంది!

గంగానది ఒడ్డున శిథిలావస్థలో ఉన్న పూరి గుడిసెలో పుట్టిపెరిగిందామె.. సాధారణంగా ఇలాంటి పేద కుటుంబంలో పూట గడవడమే కష్టమనుకుంటే.. ఏకంగా క్రికెటర్‌ కావాలని కలలు కందామె. తన మక్కువను కలలకే పరిమితం చేయకుండా దాన్ని నెరవేర్చుకునే దిశగా ప్రయత్నించింది. ఒకానొక దశలో క్రికెట్‌ కిట్‌ కొనే స్థోమత లేకపోయినా....

Updated : 21 Jan 2023 15:21 IST

(Photos: Instagram)

గంగానది ఒడ్డున శిథిలావస్థలో ఉన్న పూరి గుడిసెలో పుట్టిపెరిగిందామె.. సాధారణంగా ఇలాంటి పేద కుటుంబంలో పూట గడవడమే కష్టమనుకుంటే.. ఏకంగా క్రికెటర్‌ కావాలని కలలు కందామె. తన మక్కువను కలలకే పరిమితం చేయకుండా దాన్ని నెరవేర్చుకునే దిశగా ప్రయత్నించింది. ఒకానొక దశలో క్రికెట్‌ కిట్‌ కొనే స్థోమత లేకపోయినా, శారీరక ఫిట్‌నెస్‌ లేక నీరసించినా.. తన ప్రయత్నాలను మాత్రం విరమించుకోలేదామె. ఈ పట్టుదలే ఆమెను మహిళా క్రికెటర్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న ‘అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌’లో చోటుదక్కేలా చేశాయి. తన క్రికెట్‌ నైపుణ్యాలతో ఈ టోర్నీలో భారత మహిళల జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న అర్చనా దేవి స్ఫూర్తి గాథ ఇది!

18 ఏళ్ల అర్చనా దేవిది ఉత్తరప్రదేశ్‌లోని రతాయ్‌ పుర్వా అనే మారుమూల గ్రామం. గంగానదీ పరీవాహక ప్రాంతంలో ఉండే ఈ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఓ మట్టి ఇంట్లో పుట్టి పెరిగిందామె. ఆమెకు ఆటలంటే చిన్న వయసు నుంచే మక్కువ. అయితే చిన్న వయసులోనే తన తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణ భారమంతా ఆమె తల్లిపైనే పడింది. అయినా అర్చనను చదివించాలనుకుందామె. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఆమెను చేర్పించింది.

టీచర్‌ ప్రోత్సాహంతో..!

స్కూల్లో చదువుతో పాటు క్రీడాంశాల్లోనూ చురుగ్గా పాల్గొనేది అర్చన. ఓ పరుగు పందెంలో ఆమె నైపుణ్యాలు గమనించిన ఆ స్కూల్‌ పీఈటీ పూనమ్‌ గుప్తా.. అర్చనను ఈ దిశగా ప్రోత్సహించారు. నిజానికి తాను యుక్త వయసులో ఉన్నప్పుడు క్రికెటర్‌ కావాలని కలలు కన్న పూనమ్‌.. తన కోరికను అర్చన ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నారు. అర్చనకు కూడా క్రికెటర్‌ కావాలన్న మక్కువ ఉండడంతో.. ఆమెను తన సొంత డబ్బుతో కాన్పూర్‌లోని ‘కపిల్‌ దేవ్‌ పాండే క్రికెట్‌ అకాడమీ’లో చేర్పించారు పూనమ్‌. అప్పటికీ క్రికెట్‌ కిట్‌ కొనడానికి, అకాడమీ ఫీజు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో.. తన వంతుగా సహకరించారు పూనమ్‌. అంతేకాదు.. ఈ అకాడమీ యజమాని, క్రికెట్‌ కోచ్‌ కపిల్‌ దేవ్‌ పాండే.. ఆయన దగ్గరే క్రికెట్‌ మెలకువలు నేర్చుకున్న భారత స్టార్‌ పేసర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా ఆమె శిక్షణ కోసం సహకరించారు. ఇలా వీరందరి ప్రోత్సాహంతో మీడియం పేసర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించిన అర్చన.. కోచ్‌ సలహా మేరకు ఆఫ్‌ స్పిన్‌లో రాటుదేలింది.

ఆఫ్‌ స్పిన్‌ మాయాజాలంతో..!

తన ఆఫ్‌ స్పిన్‌ నైపుణ్యాలతో అనతి కాలంలోనే ఉత్తరప్రదేశ్‌ మహిళల క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకున్న అర్చన.. ఆపై సెలక్టర్ల దృష్టిలోనూ పడింది. ఈ క్రమంలోనే ఆమెను గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన అండర్‌-19 టోర్నీ కోసం ఎంపిక చేశారు. సెలక్టర్ల ఆశల్ని వమ్ము చేయకుండా తన ప్రతిభ చాటిన ఆమెను.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న ‘అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌’ కోసమూ ఎంపిక చేశారు. ఇక్కడా తన ఎడం చేతి వాటం ఆఫ్‌ స్పిన్‌ మాయాజాలంతో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది అర్చన. ఇప్పటి వరకు గ్రూపు దశలో జరిగిన మూడు మ్యాచుల్లో భారత మహిళల జట్టు గెలవడంలో ఈ యువ స్పిన్నర్‌దీ ముఖ్య భూమికే!

‘ఓ మారుమూల గ్రామంలో, నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను అంతర్జాతీయ వేదికపైకి రాగలిగానంటే.. అందుకు మా టీచర్‌, కోచ్‌ ప్రోత్సాహమే కాదు.. అమ్మ అండ కూడా ఎంతో! నా మనసులోని కోరిక తెలుసుకున్న తను.. కష్టమైనా నా వెన్నుతట్టింది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని దాటుకొని కల నెరవేర్చుకున్న నేను.. ఇప్పుడు భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు గర్వపడుతున్నా..’ అంటూ ఉప్పొంగిపోతున్న అర్చన పట్టుదల ఎంతోమంది యువ కెరటాలకు స్ఫూర్తి అనడంలో సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్