Malia Obama: నాన్న పేరుతో పని లేదంటోంది!

తల్లిదండ్రులు సంపాదించిన పేరుప్రఖ్యాతులు పిల్లల కెరీర్‌కు సోపానాలుగా మారతాయి. కానీ కుటుంబ నేపథ్యంతో సంబంధం లేకుండా సొంతంగా ఎదగాలని, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని ఆరాటపడుతుంటారు కొందరు.

Updated : 28 Feb 2024 13:19 IST

(Photos: Instagram)

తల్లిదండ్రులు సంపాదించిన పేరుప్రఖ్యాతులు పిల్లల కెరీర్‌కు సోపానాలుగా మారతాయి. కానీ కుటుంబ నేపథ్యంతో సంబంధం లేకుండా సొంతంగా ఎదగాలని, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని ఆరాటపడుతుంటారు కొందరు. మలియా ఒబామా ఇదే కోవకు చెందుతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, తొలి మహిళ మిషెల్‌ ఒబామాల పెద్ద కూతురైన ఆమె.. తండ్రిలా రాజకీయాల్లోకి రాకుండా.. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అదీ దర్శకత్వ విభాగంలో! ఈ క్రమంలోనే తాను రూపొందించిన తొలి సినిమా ప్రీమియర్‌ను ఇటీవలే జరిగిన ‘సన్‌డ్యాన్స్‌ చిత్రోత్సవం’లో ప్రదర్శించిందామె. ఈ వేదిక పైనే తన ఇంటి పేరును తొలగించుకొని ‘మలియా అన్‌’గా తనను తాను పరిచయం చేసుకుందీ సెలబ్రిటీ డాటర్‌. ఇలా తల్లిదండ్రుల పేరుప్రఖ్యాతులతో సంబంధం లేకుండా.. తన సొంత ప్రతిభతోనే ఎదగాలనుకుంటోన్న మలియా ఆలోచనను ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ట్యాలెంటెడ్‌ గర్ల్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, తొలి మహిళ మిషెల్ ఒబామాల పెద్ద కూతురైన మలియా.. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసింది. ఇక్కడ చదువుకొనే సమయంలోనే ‘విశ్వవిద్యాలయ మహిళల బాస్కెట్‌ బాల్‌ టీమ్‌’లో సభ్యురాలిగానూ ఉందామె. అయితే పెరిగి పెద్దయ్యే క్రమంలో తన తండ్రిలా రాజకీయాల్లోకి రాకుండా.. సినిమా రంగం వైపు వెళ్లాలనుకుంది మలియా. ఇదే ఆమెను తొలుత సినిమా రచయిత్రిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసింది.

ఇంటి పేరు వద్దంది!

అమెరికన్‌ నిర్మాత, నటుడు అయిన డొనాల్డ్‌ గ్లోవర్‌ తెరకెక్కించిన ‘స్వార్మ్‌’ అనే అమెజాన్‌ ప్రైమ్‌ షోకు రచయిత్రిగా వ్యవహరించింది మలియా. ఈ క్రమంలోనే ఆమె రచనా నైపుణ్యాలు, పని పట్ల ఆమెకున్న అంకితభావాన్ని గ్లోవర్‌ కొనియాడారు. అంతేకాదు.. ఆమె తొలిసారి దర్శకత్వం వహించిన ‘ది హార్ట్‌’ అనే లఘుచిత్రానికి నిర్మాణ బాధ్యతలూ తీసుకున్నారు. దీంతో ఆమె పాపులారిటీ మరింతగా పెరిగిపోయింది. ఇక ఇటీవలే జరిగిన ‘సన్‌డ్యాన్స్‌ చిత్రోత్సవం’లో తన చిత్ర ప్రీమియర్‌ని ప్రదర్శించింది మలియా. ఇదే వేదికపై ‘మలియా అన్‌ - ది ఫిల్మ్‌మేకర్‌’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంది కూడా! నిజానికి ఆమె పూర్తి పేరు మలియా అన్‌ ఒబామా. ఇందులో నుంచి తన ఇంటి పేరు ‘ఒబామా’ తొలగించుకుందామె. అంతేకాదు.. ‘ఈ కథలో కొంత వాస్తవికత, మరికొంత కాల్పనికత ఉంది. తల్లీకొడుకుల మధ్య సాగే భావోద్వేగ కథ ఇది!’ అంటూ తాను రూపొందించిన చిత్ర కథను సంక్షిప్తంగా పంచుకుందామె.

అయితే ఇలా మలియా తన పేరు చివర ఒబామా తొలగించుకోవడం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. నిజానికి ఇలా తన తల్లిదండ్రుల పేరుప్రఖ్యాతులతో కాకుండా సొంతంగా ఎదగాలనుకుంటున్నట్లు చెప్పకనే చెప్పిన ఆమె ఆలోచనను చాలామంది ప్రశంసిస్తున్నారు. అయితే కొందరు మాత్రం తనపై వచ్చిన నెపోటిజం విమర్శల్ని తిప్పికొట్టడానికే మలియా ఇలా తన స్టేజ్‌ పేరును మార్చుకుందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా గ్లోవర్‌ మాత్రం ‘మలియా రచనా శైలి, ఆమె ప్రతిభ అద్భుతం’ అంటూ కితాబిచ్చేశారు.


అథ్లెట్‌.. మ్యూజిక్‌ లవర్!

⚛ మలియాకు సినిమా చిత్రీకరణే కాదు.. సంగీతం, డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం! అందుకే ఎక్కడ సంగీత ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు జరిగినా.. అక్కడ వాలిపోతానంటోంది. ఇక అమెరికన్‌ పాప్‌ తార బియాన్స్‌కు మలియా వీరాభిమానట!

⚛ ఆటలన్నా ఈ సెలబ్రిటీ కిడ్‌కు భలే మక్కువట! అందులోనూ టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌.. వంటి క్రీడల్లో పొందే ఆనందం మరెందులోనూ దొరకదంటోంది.

⚛ సినిమా దర్శకత్వంపై ఆసక్తితో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘వీన్‌స్టీన్‌’లో ఇంటర్న్‌షిప్‌ కూడా చేసింది మలియా.

⚛ ట్రావెలింగ్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తానంటోంది మలియా. తన తండ్రి బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బోలెడన్ని దేశాలు సందర్శించే అవకాశం తనకు వచ్చిందంటోంది. ఇక ఆఫ్‌బీట్‌గా తన కుటుంబంతో కలిసి సెనెగల్, దక్షిణాఫ్రికా, టాంజానియా.. వంటి ఆఫ్రికన్‌ దేశాల్లో పర్యటించిందామె.

⚛ ఫ్యాషన్‌ ఐకాన్‌గానూ మలియాకు పేరుంది. సందర్భానికి తగినట్లుగా ఫ్యాషనబుల్‌గా, హుందాగా మెరిసిపోతూ ఆకట్టుకుంటుందీ డాటర్‌ ఆఫ్‌ ఒబామా. ఇలా తాను ధరించే ఫ్యాషనబుల్‌ దుస్తులు అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో వైరలవుతుంటాయి.

⚛ మలియా పుస్తకాల పురుగు. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. పుస్తకాలకే అతుక్కుపోయే ఆమె.. ప్రయాణాల్లోనూ బుక్స్‌ని తన వెంటే ఉంచుకుంటానంటోంది.

⚛ ఒబామా దంపతుల ముద్దుల కూతురైన మలియా.. తన కుటుంబంతో సమయం గడపడానికీ ప్రాధాన్యమిస్తానంటోంది. ముఖ్యంగా తన చెల్లెలు సాషాతో అల్లరి చేయడమంటే తనకు భలే సరదానట! ఇక మలియాను ఇంట్లో ‘రూ’ అంటూ ముద్దుగా పిలుచుకుంటారట ఆమె తల్లిదండ్రులు.

⚛ మలియాకు సేవా దృక్పథమూ ఎక్కువే! చదువుకొనే రోజుల్లో ‘సూప్‌ కిచెన్‌’ అనే స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా పనిచేసిన ఆమె.. ఈ వేదికగా నిరుపేదలకు భోజనం పంపిణీ చేసింది. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల్లో భాగమవుతోంది మలియా.

⚛ సెలబ్రిటీ కిడ్‌గా చూడ్డానికి సున్నితంగా కనిపించే మలియాలో కఠినమైన మార్షల్‌ ఆర్ట్స్‌ నైపుణ్యాలూ దాగున్నాయట! అంతేకాదు.. ఆత్మరక్షణ విద్యల్లోనూ ఆరితేరిందామె.

⚛ స్పానిష్‌లో అనర్గళంగా మాట్లాడగలదట మలియా.

⚛ గత కొన్నేళ్లుగా బ్రిటన్‌కు చెందిన రోరీ ఫర్కూహర్సన్‌తో ప్రేమలో ఉంది మలియా. లాక్‌డౌన్‌ సమయంలో ఈ జంట మరింత దగ్గరైంది. ఇక వీళ్లిద్దరూ చెట్టపట్టాలేసుకొని పలుమార్లు మీడియా కంటికీ చిక్కారు. దీంతో వీళ్ల అనుబంధం గురించి బయటి ప్రపంచానికి తెలిసిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్