Rajwa Al Saif: ఈ ఆర్కిటెక్ట్.. జోర్డాన్‌కు కాబోయే మహారాణి!
రాజ వంశస్థులు మరో రాజ కుటుంబంతోనే వియ్యమందుకునే సంప్రదాయానికి క్రమంగా తెరపడుతోంది. హోదా కంటే మనసుకు నచ్చిన వారిని మనువాడడానికే మోడ్రన్ రాయల్ ఫ్యామిలీస్ మక్కువ చూపుతున్నాయి. ఈ క్రమంలోనే యువ రాజులు సామాన్య మహిళల్ని వివాహమాడడం, యువరాణులు సాధారణ పురుషుల్ని....
(Photo : Instagram)
రాజ వంశస్థులు మరో రాజ కుటుంబంతోనే వియ్యమందుకునే సంప్రదాయానికి క్రమంగా తెరపడుతోంది. హోదా కంటే మనసుకు నచ్చిన వారిని మనువాడడానికే మోడ్రన్ రాయల్ ఫ్యామిలీస్ మక్కువ చూపుతున్నాయి. ఈ క్రమంలోనే యువ రాజులు సామాన్య మహిళల్ని వివాహమాడడం, యువరాణులు సాధారణ పురుషుల్ని పెళ్లి చేసుకోవడం మనం చూస్తున్నాం. త్వరలో జరగబోయే ప్రిన్స్ హుస్సేన్-రజ్వా అల్ సైఫ్‌ల వివాహమూ ఇందుకు మినహాయింపు కాదు. ప్రిన్స్ హుస్సేన్ జోర్డాన్‌కు కాబోయే రాజు.. కాగా, రజ్వా.. సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురు. ఇక పెళ్లి తర్వాత తన ఇంటి పేరునే కాదు.. కాబోయే మహారాణిగా తన హోదానూ మార్చుకోనుందీ అరేబియా అందం. ఈ నేపథ్యంలో రజ్వా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!
సౌదీ అరేబియాలోని రియాద్‌లో పుట్టి పెరిగింది రజ్వా. ఆమె కుటుంబం ఇక్కడి సుదైర్ అల్-అట్టర్ పట్టణంలోని సుబాయ్ తెగకు చెందినది. ఎన్నో ఏళ్ల క్రితం రియాద్‌లో స్థిరపడిన రజ్వా తండ్రి ఖలీద్ అల్ సైఫ్ ప్రముఖ వ్యాపారవేత్త. ‘అల్ సైఫ్ గ్రూప్’ పేరుతో ఆయన ఆరోగ్యం-ఆర్కిటెక్చర్.. వంటి పలు రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇక రజ్వా తల్లి అజ్జా అల్ సుదైరీ.. ప్రస్తుతం సౌదీ రాజైన సల్మాన్ బిన్‌కు స్వయానా కజిన్. ఇలా తల్లి తరఫున చూస్తే రజ్వాను రాజకుటుంబీకురాలిగా పరిగణించచ్చు. తన నలుగురు తోబుట్టువుల్లో రజ్వానే చిన్నది.
ఆర్కిటెక్ట్.. ఫ్యాషనర్!
వ్యాపారవేత్త అయిన తండ్రి స్ఫూర్తితో తానూ వ్యాపార రంగంలో స్థిరపడాలని చిన్న వయసులోనే నిర్ణయించుకుంది రజ్వా. ఈ ఆలోచనతోనే న్యూయార్క్‌లోని ‘Syracuse యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్’లో బీఏ ఆర్కిటెక్చర్ పూర్తిచేసింది. ఆపై లాస్ ఏంజెల్స్‌లోని ‘ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్’లో ఫ్యాషన్ డిజైనింగ్ చదివిన ఈ అరేబియా బ్యూటీ.. చదువు పూర్తయ్యాక అక్కడే కొన్నాళ్ల పాటు ఓ ఆర్కిటెక్చర్ సంస్థలో పనిచేసింది. ఆపై రియాద్ చేరిన ఆమె.. దుబాయ్‌లోని ‘డిజైన్ ల్యాబ్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్ స్టూడియో’లో విధుల్లో చేరింది. తన అందం, బ్యూటిఫుల్ స్మైల్‌తో ఆకట్టుకునే రజ్వా.. తన ఫ్యాషన్ సెన్స్‌తోనూ అక్కడి ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంటుంది. అయితే గతేడాది వరకు ఓ ఆర్కిటెక్ట్‌గా, ఫ్యాషనర్‌గా మాత్రమే రజ్వా అక్కడి వారికి పరిచయం! కానీ గతేడాది ఆగస్టులో జోర్డాన్‌కు కాబోయే రాజు ప్రిన్స్ హుస్సేన్‌తో ఆమె నిశ్చితార్థం ఎప్పుడైతే జరిగిందో.. అప్పట్నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ వస్తోందీ రాయల్ బ్యూటీ. ఇక గుర్రపు స్వారీలోనూ రజ్వాకు ప్రవేశముంది.
తను కాదు.. నేను లక్కీ!
సాధారణంగా అమ్మాయికి గొప్పింటి సంబంధం కుదిరితే.. ‘రాజా లాంటి సంబంధం వచ్చిందం’టుంటారు. కానీ రజ్వా లాంటి అందం, అణకువ కలిగిన అమ్మాయి దొరకడం తన అదృష్టమంటున్నాడు ప్రిన్స్ హుస్సేన్. ‘నా స్కూల్ ఫ్రెండ్ ద్వారా రజ్వాను తొలిసారి కలిశాను. చూడగానే నచ్చేసింది. తన అందం, అణకువ, మాటల్లో మృదుత్వం, సౌమ్య స్వభావం.. వంటి లక్షణాలన్నీ నన్ను కట్టిపడేశాయి. మనం రోజూ ఎంతోమంది వ్యక్తుల్ని కలుస్తుంటాం. కానీ రజ్వా లాంటి అమ్మాయి జీవితంలో ఒక్కసారే తారసపడుతుంది. అందుకే ఆ అరుదైన అవకాశం వదులుకోకూడదనుకున్నా. నిజంగా నేను చాలా లక్కీ!’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడీ హ్యాండ్‌సమ్ ప్రిన్స్.
రెండు నెలలు పెద్దది!
ఇక గతేడాది నిశ్చితార్థం తర్వాత పలు సందర్భాల్లో తనకు కాబోయే భార్యతో ఫొటోలు దిగుతూ వాటిని తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడీ జోర్డాన్ రాకుమారుడు. ఇక ఇటీవలే తనకు కాబోయే భార్య పుట్టిన రోజు సందర్భంగా.. ‘నిండు నూరేళ్ల జీవితాన్ని నీతో పంచుకోవడానికి ఎదురుచూస్తున్నా డియర్..!’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు హుస్సేన్. అలాగే ఈ వేడుక తర్వాత రజ్వా కూడా తమకు కాబోయే అత్తింటి వారింట్లో జరిగే వేడుకలు, ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువగా పాల్గొనడంతో ఆమె ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తనకు కాబోయే ఆడపడుచు, ప్రిన్స్ హుస్సేన్ చెల్లెలు ప్రిన్సెస్ ఇమాన్ వివాహం ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఈ వేడుకల్లోనూ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందీ కాబోయే పెళ్లి కూతురు. ఇక రజ్వా, హుస్సేన్‌లిద్దరి వయసు 29.. అయితే రజ్వానే తనకు కాబోయే భర్త కంటే రెండు నెలలు పెద్దది.
అత్తగారి బహుమతి!
ఏ ఇంట్లో అయినా అత్తాకోడళ్ల మధ్య పొసగదంటుంటారు. కానీ పెళ్లికి ముందే తనకు కాబోయే కోడలిని కూతురిగా భావిస్తూ తమ కుటుంబంలోకి ఆహ్వానించారు రజ్వా అత్తగారు క్వీన్ రాణియా. ఇద్దరు కొడుకులతో పాటు ఇద్దరు కూతుళ్లకు తల్లైన ఆమె.. తన పెద్ద కొడుకు ప్రిన్స్ హుస్సేన్ నిశ్చితార్థం తర్వాత ‘ఇక నుంచి రజ్వా నా మూడో కూతురు.. వెల్‌కమ్ డియర్!’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టి మరీ.. కోడలి మనసు గెలుచుకుందామె. అంతేకాదు.. తానెంతో ముచ్చటపడి చేయించుకున్న వెయిస్ట్ బెల్ట్, వజ్రాలు పొదిగిన చెవిదిద్దుల్ని ఎంగేజ్‌మెంట్‌లో రజ్వాకు బహుమతిగా ఇచ్చిందీ జోర్డాన్ క్వీన్. వేడుక తర్వాత రాజ కుటుంబం సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. అప్పట్లో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరలయ్యాయి. ఇక తన నిశ్చితార్థపు వేడుకలో ఆలివ్ గ్రీన్-క్రీమ్ కలగలిసిన అభయా డ్రస్ ధరించిన రజ్వా.. తన అత్తగారు కానుకిచ్చిన ఆభరణాలతోనే తన అటైర్‌కు వన్నెలద్దింది.
రజ్వా-ప్రిన్స్ హుస్సేన్‌లు జూన్ 1న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ప్రి-వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ పెళ్లితో రాచరికపు హోదాను అందుకోనుందీ సౌదీ బ్యూటీ. తన అత్తగారి తర్వాత జోర్డాన్ మహారాణిగానూ హోదాను అందుకోనున్న రజ్వా.. పెళ్లి తర్వాత సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొననుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.