షార్క్స్‌ని తప్పించుకుంటూ.. 900 మైళ్ల దూరం ఈదేసింది!

సవాళ్లన్నా, సాహసాలన్నా కొంతమందికి విపరీతమైన ఆసక్తి ఉంటుంది. వ్యక్తిగతంగానే కాదు.. తాము ఎంచుకునే వృత్తిలోనూ సాహసాలు చేయాలనుకుంటారు. అలాంటి అరుదైన అమ్మాయే యూకే క్రీడాకారిణి జాస్మిన్‌ హ్యారిసన్‌. వృత్తిరీత్యా స్విమ్మర్ అయిన ఆమె.. ఔత్సాహికులకు ఇందులో శిక్షణ ఇస్తూనే.. మరోవైపు పలు సాహసాలకూ.....

Published : 20 Oct 2022 17:59 IST

(Photos: Instagram)

సవాళ్లన్నా, సాహసాలన్నా కొంతమందికి విపరీతమైన ఆసక్తి ఉంటుంది. వ్యక్తిగతంగానే కాదు.. తాము ఎంచుకునే వృత్తిలోనూ సాహసాలు చేయాలనుకుంటారు. అలాంటి అరుదైన అమ్మాయే యూకే క్రీడాకారిణి జాస్మిన్‌ హ్యారిసన్‌. వృత్తిరీత్యా స్విమ్మర్ అయిన ఆమె.. ఔత్సాహికులకు ఇందులో శిక్షణ ఇస్తూనే.. మరోవైపు పలు సాహసాలకూ సై అంటుంటుంది. అలాంటి సాహసమే చేసి ఇటీవల ప్రపంచ రికార్డు సృష్టించింది జాస్మిన్‌. బ్రిటన్‌ రెండు అంత్య భూభాగాల మధ్య ఈత కొట్టి.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కిందామె. ‘సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలం.. నలుగురికీ ఆదర్శంగా నిలవగలం..’ అంటోన్న ఈ బ్రిటన్‌ స్విమ్మర్‌ ఈ సాహసానికి పూనుకోవడం వెనుక మరో కారణం కూడా ఉందంటోంది. అదేంటో తెలుసుకుందాం రండి..

యూకేలోని నార్త్‌యార్క్‌షైర్‌కు చెందిన 23 ఏళ్ల జాస్మిన్‌కు సాహసాలంటే మక్కువ. ఈ ఇష్టంతోనే ఈతను కెరీర్‌గా ఎంచుకున్న ఆమె.. ఇదే క్రీడలో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూనే.. మరోవైపు పలు సాహసాలు కూడా చేస్తుంటుంది. అలాంటి సాహసమే చేసి ఇటీవలే ప్రపంచ రికార్డు సృష్టించింది జాస్మిన్.

సాహసాలంటే ఇష్టం..!

బ్రిటన్‌ నైరుతి అంత్య భాగమైన వెస్ట్‌ కోస్ట్‌ (స్కాట్లాండ్‌ బోర్డర్‌) నుంచి ఈశాన్యం చివర John O’Groats వరకు (సెల్టిక్‌ సముద్రంలో) ఈత కొట్టింది జాస్మిన్‌. ఈ రెండు భూభాగాల మధ్య ఉన్న 900 మైళ్ల దూరాన్ని 110 రోజుల్లో చుట్టేసి.. ఈ ఘనత సాధించిన మూడో స్విమ్మర్‌గా, మొదటి మహిళగా నిలిచిందామె. జులై 1న ఈ సాహసానికి వెస్ట్‌ కోస్ట్‌ వద్ద శ్రీకారం చుట్టిన జాస్మిన్‌.. అక్టోబర్‌ 18న తాను అనుకున్న గమ్యానికి చేరుకోవడంతో పూర్తైంది. అయితే ఈ ఫీట్‌ పూర్తిచేయడం అంత సులభంగా జరగలేదని, ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయంటోందీ బ్రిటిష్‌ స్విమ్మర్.

‘వేసే ప్రతి అడుగులోనూ సవాళ్లను వెతుక్కునే నైజం నాది. ఈ క్రమంలోనే ఈ అరుదైన ఫీట్‌కు సంబంధించిన ఆలోచన తట్టింది. ఎందుకంటే.. ఇదివరకు బ్రిటన్‌ నైరుతి నుంచి ఈశాన్యం వరకు ఈదిన వారు ఇద్దరే ఇద్దరున్నారు. వాళ్లిద్దరూ పురుషులే.. కాబట్టి ఈ అరుదైన సాహసం చేసిన తొలి మహిళగా నిలవాలనుకున్నా. ‘ది ఫుల్‌ లెంత్ ఆఫ్‌ స్విమ్మింగ్‌ బ్రిటన్‌’ అని నా సవాలుకు పేరు కూడా పెట్టుకున్నా. ఇందుకోసం కఠిన శిక్షణ తీసుకున్నా. కొలనులో ఈత కొట్టడం దగ్గర్నుంచి.. క్రమంగా ఎక్కువ దూరాలకు స్విమ్‌ చేస్తూ, స్థానిక సరస్సుల్లో ఈదుతూ నా నైపుణ్యాల్ని పెంచుకున్నా. అంతేకాదు.. ఎలాంటి వాతావరణానికైనా అలవాటు పడేలా నా శరీరాన్ని మలచుకున్నా. వేగం పెంచుకోవడానికి సైక్లింగ్‌ కూడా సాధన చేశా..’ అంటూ ఈ రికార్డు కోసం తాను చేసిన సాధన గురించి చెప్పుకొచ్చింది జాస్మిన్.

షార్క్స్‌ని తప్పించుకుంటూ..!

సముద్రంలో ఈత కొట్టడమంటే పెను సవాలే! ఎందుకంటే అటు జలచరాల్ని, ఇటు వేగంగా ఢీకొట్టే అలల్ని దాటుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. వీటికి తోడు రేయింబవళ్లు మారే వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటూ ఈదాల్సి ఉంటుంది. ఈ సవాళ్లన్నీ ఆత్మవిశ్వాసంతోనే అధిగమించానంటోంది జాస్మిన్.

‘రోజుకు గరిష్టంగా 28 కిలోమీటర్లు, నిరంతరాయంగా 12 గంటల పాటు ఈత కొట్టేదాన్ని. మధ్యమధ్యలో జెల్లీఫిష్‌లు నా ముఖం, కాళ్లు, చేతులకు గాయం చేసేవి. వీటికి తోడు షార్క్‌్ీని తప్పించుకుంటూ ముందుకు సాగేదాన్ని. డాల్ఫిన్స్‌, సీల్స్‌, వేల్స్‌.. వంటి ప్రమాదకరమైన జలచరాలు సంచరించే సముద్రంలో ఈత కొట్టడమంటే సవాలే అయినా అదో అందమైన అనుభూతి. ఇక బలమైన అలల తాకిడి, నీళ్లలోని ఉప్పు, వెనువెంటనే మారే వాతావరణ పరిస్థితుల మూలంగా నా చర్మం దెబ్బతింది. ఈ సవాళ్లన్నీ అధిగమించడానికి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం ముఖ్యం. అందుకే మధ్యమధ్యలో వ్యాయామాలు కూడా చేసేదాన్ని. ఇక నా వెంటే వచ్చిన పడవలో నేను తీసుకునే ఆహారానికి సంబంధించిన పదార్థాలన్నీ అందుబాటులో ఉంచుకున్నా. ముఖ్యంగా చాక్లెట్‌ బార్స్‌, శాండ్‌విచ్‌, టిన్‌డ్‌ మీట్‌.. వంటివి ఎక్కువగా తీసుకునేదాన్ని. అలసటగా అనిపించినప్పుడల్లా పడవలోనే నిద్రపోయేదాన్ని..’ అంటూ సవాళ్లతో కూడిన తన ఈత ప్రయాణం గురించి చెప్పుకొచ్చింది జాస్మిన్.

నిధుల సేకరణే లక్ష్యంగా..!

ఇలా సవాళ్లను స్వీకరించడమే కాదు.. సమాజ సేవలోనూ ముందుంటుంది జాస్మిన్‌. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సాహస యాత్ర పూర్తిచేశానంటోందామె. ‘నన్ను చూసి నలుగురూ స్ఫూర్తి పొందాలని ఎప్పుడూ అనుకుంటా. అందుకే కొత్త కొత్త సాహసాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటా. అంతేకాదు.. సముద్ర పరిరక్షణ కోసం నడుం బిగించిన ‘సీ షెపర్డ్‌ యూకే’ అనే స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించాలన్న ముఖ్యోద్దేశంతోనే ఈ సాహస యాత్రకు పూనుకున్నా..’ అంటోంది జాస్మిన్‌. ప్రస్తుతం ఈత నిపుణురాలిగానూ ఔత్సాహికులకు ఈత పాఠాలు నేర్పుతోన్న ఈ బ్రిటన్‌ స్విమ్మర్.. మోటివేషనల్‌ స్పీకర్‌ కూడా! అంతేకాదు.. గతేడాది అట్లాంటిక్‌ మహాసముద్రంపై ఒంటరిగా రోయింగ్‌ చేసి.. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగానూ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది జాస్మిన్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్