డాక్టరమ్మ ‘జీరో-వేస్ట్‌’ వెడ్డింగ్‌.. వీడియో వైరల్!

పెళ్లంటే తరతరాలు గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు కొందరు.. తరాల మాటేమో గానీ.. పర్యావరణానికి హాని కలగకుండా చేసుకుంటే చాలనుకుంటున్నారు మరికొందరు. నేటి యువతలో ఉన్న ఈ ఆలోచనా విధానమే ‘జీరో-వేస్ట్‌’ వెడ్డింగ్‌ ట్రెండ్‌కు తెర తీసింది.

Published : 08 Jun 2024 12:43 IST

(Photos: Instagram)

పెళ్లంటే తరతరాలు గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు కొందరు.. తరాల మాటేమో గానీ.. పర్యావరణానికి హాని కలగకుండా చేసుకుంటే చాలనుకుంటున్నారు మరికొందరు. నేటి యువతలో ఉన్న ఈ ఆలోచనా విధానమే ‘జీరో-వేస్ట్‌’ వెడ్డింగ్‌ ట్రెండ్‌కు తెర తీసింది. కర్ణాటకకు చెందిన ఓ డాక్టరమ్మ కూడా ఇటీవలే జరిగిన తన పెళ్లికి ఇదే ట్రెండ్‌ను ఫాలో అయింది. పెళ్లి మండపం దగ్గర్నుంచి.. అతిథులకిచ్చే రిటర్న్‌ గిఫ్టింగ్‌ దాకా.. ప్రతి దశలోనూ పర్యావరణహితాన్నే పాటించింది. అంతేనా.. తమ పెళ్లిలో ఉపయోగించిన పలు అలంకరణ వస్తువులూ వృథా కాకుండా జాగ్రత్తపడింది. ఇలా అడుగడుగునా జీరో-వేస్ట్‌ పద్ధతిలో జరిగిన తమ పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను ఆమె తాజాగా సోషల్‌ మీడియాలో పంచుకోగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరీ డాక్టరమ్మ? తన ఎకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్‌ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

నేటి యువత ప్రతి విషయంలోనూ పర్యావరణహితాన్ని కోరుకుంటోంది. ఈ క్రమంలోనే తమ జీవనశైలిలో ప్రతి ఎంపికనూ ఎకో-ఫ్రెండ్లీగానే ఎంచుకుంటోంది. కర్ణాటకకు చెందిన డాక్టర్‌ పూర్వీ భట్‌దీ ఇలాంటి మనస్తత్వమే! చిన్న వయసు నుంచే పర్యావరణ ప్రేమికురాలైన ఆమె.. ప్రకృతి, పచ్చదనంతో బాగా కనెక్ట్‌ అయింది. ఈ మక్కువతోనే ‘ప్రకృతి వైద్యం-పోషకాహారం’ సబ్జెక్టుగా విద్యనభ్యసించిన ఆమె.. పోషకాహార నిపుణురాలిగా, ప్రకృతి వైద్యురాలిగా కెరీర్‌లో స్థిరపడింది. ఇక తన పెళ్లినీ పర్యావరణహితంగానే జరుపుకోవాలని నిశ్చయించుకుంది.

గ్రీన్‌ వెడ్డింగ్‌.. ప్రత్యేకతలెన్నో!

అయితే అనుకున్నట్లుగానే ఆ ఘడియ రానే వచ్చింది. పెళ్లంటూ చేసుకుంటే అది జీరో-వేస్ట్‌ పద్ధతిలోనే చేసుకుంటానని పూర్వీ తన తల్లిదండ్రులతో చెప్పడంతో.. వాళ్లూ దానికి సరేనన్నారు. పెళ్లి అలంకరణ దగ్గర్నుంచి, మండపం, పూలదండలు, భోజనాలు, రిటర్న్‌ గిఫ్టింగ్‌ దాకా.. ఇలా ప్రతి విషయంలోనూ పర్యావరణహితంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పెళ్లి మండపాన్ని చెరుకు గడలతో తీర్చిదిద్దారు. తాటాకు పందిళ్లు వేసి.. మామిడాకులు, కొబ్బరి ఆకుల మాలలతో పందిళ్లను శోభాయమానంగా అలంకరించారు. ఇక వధూవరులు మార్చుకునే పూల దండల తయారీకి కాటన్‌ దారాన్ని ఉపయోగించారు. అరటి ఆకుల్లో భోజనాలు వడ్డించి.. మంచి నీళ్లు, ఇతర అవసరాల కోసం స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ గ్లాసులు/పాత్రల్ని వాడారు. భోజనం పూర్తయ్యాక అతిథులు చేతులు శుభ్రం చేసుకున్న నీటిని నేరుగా తోటలోకి వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేశారు. ఇక తమ పెళ్లికొచ్చిన అతిథుల కోసం పూర్వీ దంపతులు రిటర్న్‌ గిఫ్ట్‌లూ అందించారు. అది కూడా పర్యావరణహితంగా ఉండేలా జ్యూట్‌ బ్యాగుల్లో పెట్టి మరీ ఇచ్చారు.

అంతేనా.. పెళ్లి తంతు ముగిశాక ఆయా అలంకరణ వస్తువుల్నీ వృథా కాకుండా జాగ్రత్తపడింది పూర్వీ. ఈ క్రమంలో పెళ్లి మండపం అలంకరణకు ఉపయోగించిన చెరకు గడల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆవులకు, గేదెలకు మేతగా వేశారు. పూలదండలు, ఆకులు, ఇతర చెత్తంతా.. వారి తోటలో కంపోస్ట్‌ చేయించిందామె. ఇలా సింపుల్‌ అండ్‌ స్వీట్‌గా జరిగిన తమ వివాహంలో అడుగడుగునా ఎకో-ఫ్రెండ్లీ మంత్రాన్ని జపించిందీ డాక్టరమ్మ.

క్రెడిటంతా అమ్మదే!

తాను కోరుకున్నట్లుగానే తన పెళ్లి ఆద్యంతం పర్యావరణహితంగా జరగడంతో పూర్వీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పెళ్లిలోనూ చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయిన ఆమె.. తన పెళ్లి తన ఇష్టప్రకారమే సక్సెస్‌ఫుల్‌గా జరగడానికి తన తల్లే ప్రధాన కారణం అంటోంది.

‘ప్రతి అమ్మాయీ తన వివాహం తన ఇష్ట ప్రకారమే జరగాలని కోరుకుంటుంది. అలాగే నేనూ పర్యావరణానికి నష్టం కలిగించకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నా. అణువంత ప్లాస్టిక్‌ వస్తువును కూడా ఉపయోగించకూడదని నియమం పెట్టుకున్నా. ఇలా నా ఆలోచనను మా కుటుంబంతో, కాబోయే అత్తింటివారితో పంచుకున్నా. వాళ్లూ నా అభిప్రాయాన్ని గౌరవించారు. వేడుక విజయవంతం కావడంలో తమ వంతుగా సహకరించారు. ఇక మా అమ్మకు ప్రత్యేకంగా థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. ఎందుకంటే పెళ్లి అలంకరణ దగ్గర్నుంచి రిటర్న్‌ గిఫ్టింగ్‌ దాకా.. అడుగడుగునా పర్యావరణహితంగా ఉండేందుకు చాలా విషయాల్లో తను సునిశితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంది. నా కోరిక మేరకే వేడుక సంపూర్ణమవడంలో అమ్మ కీలక పాత్ర పోషించింది. అందుకే ఈ క్రెడిటంతా అమ్మదే! మొత్తానికి నాకు నచ్చిన వ్యక్తిని, నచ్చిన వెడ్డింగ్‌ థీమ్తో వివాహమాడడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా డ్రీమ్‌ వెడ్డింగ్‌!’ అంటోన్న పూర్వీ.. తన పెళ్లి అలంకరణ, వివాహంలోని ప్రధాన ఘట్టాల్ని ఓ వీడియోగా రూపొందించి.. తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. ‘మీ ఆలోచన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.. ఎంతోమందిలో పాజిటివిటీని నింపుతుంది..’ అంటూ పోస్టులు పెడుతున్నారు.


జీవనశైలి మారుస్తూ..!

ప్రకృతి, పచ్చదనం అంటే ప్రాణంగా భావించే పూర్వీ.. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతుల్ని అనుసరిస్తుంటుంది. ‘మనసు పెట్టి తిన్నప్పుడే.. జీవితాంతం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం’ అనే సూత్రాన్ని నమ్మే ఆమె.. పోషకాహారం, ప్రకృతి వైద్యంపై అందరిలో అవగాహన పెంచాలనుకుంది. ఈ ఆలోచనతోనే కర్ణాటకలోని ‘రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌’లో ‘న్యాచురోపతీ-యోగా’లో డిగ్రీ పూర్తి చేసింది. నాలుగేళ్ల ఈ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమె.. బంగారు పతకాన్ని కూడా అందుకుంది. ఆపై లండన్‌లోని ‘కింగ్స్‌ కాలేజీ’లో పోషకాహారంలో మాస్టర్స్‌ పూర్తి చేశాక ఇండియాకు తిరిగొచ్చింది. ఆ తర్వాతే ‘Herbeshwari’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన పూర్వీ.. ఈ వేదికగా ప్రకృతి వైద్యం, పోషకాహారంపై అందరిలో అవగాహన పెంచుతోంది.

‘ఆయుర్వేద మందులు తయారుచేసే కుటుంబంలో పుట్టి పెరిగాను. ఈ వాతావరణంలో మెదిలిన నాకూ పర్యావరణ పరిరక్షణ, మూలికా వైద్యంపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే వందలాది ఔషధ మొక్కల్ని సేకరించా. ఇదే అంశాన్ని నా కెరీర్‌గానూ ఎంచుకున్నా. ప్రస్తుతం ప్రకృతి మనకు సహజసిద్ధంగా అందించే పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నా. సంపూర్ణ ఆరోగ్యానికి సహకరించే ఆహార పద్ధతుల్ని అందరికీ పరిచయం చేస్తున్నా..’ అంటోన్న పూర్వీ.. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికగా సెషన్స్‌ నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులు, పోషకాహారాన్ని అలవాటు చేసి.. ఎంతోమంది జీవనశైలిలో విశేష మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తోంది. అంతేకాదు.. సోషల్‌ మీడియా వేదికగా ఆరోగ్య, సౌందర్య చిట్కాల్ని కూడా అందిస్తోంది.  అన్నట్లు.. ఈ డాక్టరమ్మ పెట్‌ లవర్‌ కూడా!


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్