పాతికేళ్ల జడ్జి!

ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ, వాటిని సాకారం చేసుకోవడంలో కొంతమంది మాత్రమే సఫలమవుతుంటారు. కర్ణాటకకు చెందిన గాయత్రి ఈ జాబితాలో ముందువరుసలో ఉంటుంది. నిరుపేద కుటుంబంలో జన్మించినా కష్టపడి న్యాయవిద్యను పూర్తిచేసిందామె. ప్రాక్టీస్‌లో భాగంగా ఇతర న్యాయమూర్తులను చూసి తను కూడా జడ్జి....

Updated : 23 Jan 2023 14:22 IST

(Photo: Twitter)

ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ, వాటిని సాకారం చేసుకోవడంలో కొంతమంది మాత్రమే సఫలమవుతుంటారు. కర్ణాటకకు చెందిన గాయత్రి ఈ జాబితాలో ముందువరుసలో ఉంటుంది. నిరుపేద కుటుంబంలో జన్మించినా కష్టపడి న్యాయవిద్యను పూర్తిచేసిందామె. ప్రాక్టీస్‌లో భాగంగా ఇతర న్యాయమూర్తులను చూసి తను కూడా జడ్జి కావాలని కలలు కంది. అందుకోసం అహర్నిశలూ కష్టపడి చదివింది. తొలి ప్రయత్నంలో విఫలమైనా.. రెండోసారి తను అనుకున్న కలను సాకారం చేసుకుంది. ఈ క్రమంలో 25 ఏళ్లకే న్యాయమూర్తిగా నియమితురాలై.. అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన గాయత్రి కథ నేటి యువతరానికి స్ఫూర్తి!

నిరుపేద కుటుంబం...

గాయత్రి కోలారు జిల్లాలోని కారహళ్లి అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు నారాయణస్వామి, వెంకట రత్నమ్మ. వారికి గాయత్రి ఏకైక సంతానం. ఆమె తల్లిదండ్రులిద్దరూ రోజు కూలీ చేస్తే కానీ కుటుంబం గడవని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కలల కందామె. అందుకు తగ్గట్టే ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లో చేరినా కష్టపడి చదువుకుంది. కోలారు మహిళా కళాశాలలో బీకాం పూర్తిచేసిన ఆమె.. ఆ తర్వాత ‘కెంగల్‌ హనుమంతయ్య లా కళాశాల’లో డిగ్రీ పట్టా అందుకుంది. ఈ క్రమంలో యూనివర్సిటీలోనే 4వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటుకుందీ చదువుల తల్లి.

వారిని చూసి...

లా పూర్తి చేసిన తర్వాత గాయత్రి సీనియర్‌ లాయర్‌ శివరామ్‌ సుబ్రహ్మణ్యం దగ్గర అసిస్టెంట్‌ లాయర్‌గా చేరింది. ఆ సమయంలో పలువురు న్యాయమూర్తులను గమనించేది. దాంతో తను కూడా వారిలా జడ్జి కావాలని సంకల్పించుకుంది. ఇదే ఆమె గురువు శివరామ్‌తో చెప్పడంతో.. ఆయన ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. సివిల్‌ న్యాయమూర్తి పరీక్షల కోసం అహర్నిశలూ కష్టపడి చదివింది. 2021లోనే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూను దాటలేకపోయింది. దాంతో అలుపెరుగని విక్రమార్కునిలా మళ్లీ ప్రయత్నించి.. తాజాగా తన కలను సాకారం చేసుకుంది గాయత్రి. ఇలా పాతికేళ్లకే సివిల్‌ కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలై.. తద్వారా పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన మహిళగా పేరు తెచ్చుకుంది. ఉన్నత లక్ష్యాల్ని అందుకోవడానికి పేదరికం అడ్డు కాదని ఇలా తన విజయంతోనే నిరూపించిందీ యంగ్‌ జడ్జి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్