Urmila Rosario : ప్రపంచకప్‌ ట్రోఫీతో మనమ్మాయి.. ఇంతకీ ఎవరామె?

అద్భుతమైన ఆటతీరుతో ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది ఆస్ట్రేలియా జట్టు. దీంతో కోట్లాది మంది భారతీయులకు నిరాశే మిగిలింది. అయితే ఆ జట్టు విజయంలో మన వాటా కూడా ఉందంటూ తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫొటో వైరలవుతోంది.

Published : 24 Nov 2023 13:08 IST

(Photo: Twitter)

అద్భుతమైన ఆటతీరుతో ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది ఆస్ట్రేలియా జట్టు. దీంతో కోట్లాది మంది భారతీయులకు నిరాశే మిగిలింది. అయితే ఆ జట్టు విజయంలో మన వాటా కూడా ఉందంటూ తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫొటో వైరలవుతోంది. ఆసీస్‌ క్రికెటర్‌ మిచెల్‌ స్టార్క్‌తో కలిసి ఓ మహిళ ప్రపంచకప్‌ ట్రోఫీ పట్టుకొని దిగిన ఫొటో అది. మరి, ఇంతకీ ఆమెకు, ఆ ట్రోఫీకి, అందులో మన వాటాకు ఏంటి సంబంధం? అన్న కోణంలో ఇంటర్నెట్‌లో తెగ వెతికేశారు నెటిజన్లు. అప్పుడర్థమైంది.. ఆమె ఎవరో కాదు.. ఆస్ట్రేలియా పురుషుల జట్టు మేనేజర్‌ అని! అలాగని తాను ఆస్ట్రేలియన్‌ కాదు.. పక్కా భారతీయురాలు. జట్టు మేనేజర్‌గా తెర వెనుక ఉంటూనే.. ఆసీస్‌ ప్రపంచకప్‌ నెగ్గడంలో తనదైన భూమిక పోషించిన ఊర్మిళా రొసారియో స్ఫూర్తి ప్రయాణమిది!

క్రికెట్‌ జట్టు మేనేజర్‌ అంటే.. జట్టుకు, అందులోని సభ్యులందరికీ కావాల్సిన సకల సదుపాయాలు సమకూర్చడం వాళ్ల బాధ్యత. టూర్‌ మొదలైనప్పట్నుంచి జట్టు సభ్యుల ప్రయాణం, ఆతిథ్యం.. వంటి విషయాల్ని దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే జట్టు సభ్యులందరి గురించిన సమగ్ర సమాచారం తెలుసుకోవడం, జట్టును మ్యాచ్‌లకు సిద్ధం చేయడంలో కోచ్‌కు సహాయపడడం కూడా వీరి విధి. అలా ఈసారి ప్రపంచకప్‌లో పాల్గొన్న ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించింది 34 ఏళ్ల ఊర్మిళా రొసారియో.

చెదిరిన టెన్నిస్‌ కల!

ఊర్మిళ తల్లిదండ్రులది కర్ణాటక మంగళూరులోని కిన్నిగోలి అనే ప్రాంతం. వీరిద్దరూ ఉద్యోగరీత్యా దోహాలో కొన్నాళ్ల పాటు ఉన్నారు. ఆ సమయంలోనే ఊర్మిళ పుట్టింది. ఆమెకు ముగ్గురు అన్నలు. వారంతా విదేశాల్లో స్థిరపడ్డారు. అయితే చిన్న వయసు నుంచే ఆటలపై ప్రేమ పెంచుకున్న ఊర్మిళ.. పాఠశాల దశలో దాదాపు అన్ని రకాల ఆటలాడేది. వీటన్నింటిలో తనకు బాగా నచ్చిన ఆట మాత్రం టెన్నిస్‌. ఈ క్రమంలోనే తానో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ కావాలని కలలు కందామె. అలా స్కూల్లో టెన్నిస్‌ సాధన చేస్తూనే.. కొన్నిసార్లు బాల్‌ గర్ల్‌గానూ వ్యవహరించేది ఊర్మిళ. ఇలా టెన్నిస్‌ ఆడే క్రమంలోనే పలుమార్లు గాయాల పాలైందామె. ఓసారి కుడికాలికి ఫ్రాక్చర్‌ కావడంతో కొన్నాళ్ల పాటు తన టెన్నిస్‌ కలను పక్కన పెట్టేసి చదువుపై దృష్టి సారించింది. ఆపై ప్రముఖ టెన్నిస్‌ కోచ్‌ కృష్ణ భూపతి దగ్గర శిక్షణలో చేరిన ఊర్మిళకు గాయాలు తిరగబెట్టాయి. దీంతో చేసేది లేక టెన్నిస్‌ను పక్కన పెట్టిన ఆమె.. కోచ్‌ సలహా మేరకు స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలు నిర్వర్తించాలనుకుంది.

మేనేజర్‌.. ది లేడీ బాస్‌!

ఈ ఆలోచనతోనే ఖతార్‌ వెళ్లిన ఊర్మిళ.. అక్కడి కార్నేగీ మెల్లన్‌ యూనివర్సిటీ నుంచి ‘బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌’లో డిగ్రీ పూర్తిచేసింది. ఆపై ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడింది. అక్కడే ఓ టెన్నిస్‌ అకాడమీలో మేనేజర్‌గా చేరాలనుకున్న ఆమెకు అంతలోనే ‘అడిలైడ్‌ క్రికెట్‌ జట్టు’కు మేనేజర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. అలా టెన్నిస్‌ను వదిలి క్రికెట్‌ను తన కెరీర్‌గా మలచుకున్న ఆమె ఆపై వెనక్కి తిరిగి చూడలేదు.. ఆమె నిబద్ధతతో కూడిన పనితీరుకు వరుస అవకాశాలు ఆమెకు క్యూ కడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టుకు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఆమె.. గతేడాది ఫిఫా ప్రపంచకప్‌కు ముందు నాలుగు నెలల పాటు తన విధుల నుంచి విరామం తీసుకుంది. ఈ క్రమంలోనే ఖతార్‌లోని ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్వహణ, పునరుద్ధరణ బాధ్యతలు నిర్వర్తించింది. ఇక ఈ సెప్టెంబర్‌లో తిరిగి ఆసీస్‌ చేరిన ఆమెకు.. ప్రపంచకప్‌ టూర్‌కు సిద్ధమైన ఆస్ట్రేలియా జట్టుకు మేనేజర్‌గా బాధ్యతలప్పగించింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. అలా టీమ్‌ మేనేజర్‌గా ఆసీస్‌ జట్టుకు సకల సదుపాయాలు సమకూర్చడంలో సఫలమైన ఆమె.. పరోక్షంగా ఆ జట్టు ప్రపంచకప్‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పచ్చు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌ ట్రోఫీతో, ఆ జట్టుతో ఫొటోలు దిగుతూ సందడి చేసింది ఊర్మిళ. ఇలా ఆమె దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘ఒకప్పుడు క్రికెట్‌ను ఓ ఆటలాగే చూశా.. కానీ ఇప్పుడు ఈ క్రీడతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది..’ అంటోన్న ఈ లేడీ బాస్‌.. వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టుకు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది.

అయితే ప్రపంచకప్‌ ఫైనల్లో మన జట్టు ఓడిపోయినా.. కప్పు గెలిచిన జట్టులో ఓ భారతీయురాలి పాత్ర ఉండడంతో ఇటు భారతీయ క్రికెట్‌ ప్రేమికులు, అటు ఊర్మిళ తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. పని పట్ల ఆమెకున్న నిబద్ధత, పలు భారతీయ భాషల్లో ఆమెకున్న నైపుణ్యాలే ఆసీస్‌ పురుషుల జట్టుకు మేనేజర్‌గా ఎంపిక చేయడానికి ముఖ్య కారణాలయ్యాయంటూ మురిసిపోతున్నారు ఆమె పేరెంట్స్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్