Updated : 27/03/2023 07:34 IST

Maitry Shah: ఆర్థిక పాఠాలతో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ

ఆమె తన ప్రయాణంలో.. ఆర్థిక విషయాలను జడ పదార్థంలా చూసే మహిళలెందరినో చూశారు. ఆడవాళ్ల డబ్బు నిర్వహణతో పురుషాధిపత్యానికి తెరపడుతుందని భయపడే మగవాళ్లూ కనిపించారు... ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పుడే సాధికారత సాధ్యమనే ఆవిడ... తండ్రి స్థాపించిన కంపెనీ ‘ప్రుడెంట్‌’ కార్పొరేట్‌ సోషల్‌ సర్వీస్‌(సీఆర్‌ఎస్‌)లో భాగంగా 2020లో ‘లక్ష్ మి’ సంస్థను ఏర్పాటుచేసి ఆడవాళ్లకు ఆర్థిక పాఠాలు భోదిస్తున్నారు. మైత్రి షా స్ఫూర్తిదాయక ప్రయాణమిది..

ఆడవాళ్లకు ఆర్థిక స్వేచ్ఛ ఎంతో ముఖ్యమని భావించే కుటుంబంలో పుట్టి పెరిగింది అహ్మదాబాద్‌కి చెందిన మైత్రి. ఆమె తండ్రి సంజయ్‌ షా చార్టర్డ్‌ అకౌంటెంట్‌. ప్రుడెంట్‌ సంస్థ ఎండీ. జీతం, ఇతర ఆర్థిక విషయాలను నిత్యం ఇంట్లో చర్చిస్తాడు. ఆమె తల్లి కూడా ఆర్థిక నిర్ణయాలన్నింటిలో పాలుపంచుకుంటుంది. ఇలాంటి వాతావరణంలో పెరగటంతో మైత్రికి కూడా సహజంగానే ఈ రంగంపై ఆసక్తి పెరిగింది. బీబీఏ(ఫైనాన్స్‌) పూర్తి చేశాక... మాస్టర్స్‌ కోసం న్యూయార్క్‌ వెళ్లింది. తిరిగి వచ్చాక తండ్రి సంస్థలోనే వెల్త్‌ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టింది. ‘వృత్తిలో భాగంగా తరచూ క్లయింట్లతో మాట్లాడాల్సి వచ్చేది. అప్పుడు ఆ ఇళ్లలోని ఆడవాళ్లు ఆ చర్చల్లో పాల్గొనకపోవడం గమనించా. కొన్నిసార్లు నేనే వారిని ఒప్పించి ఆ చర్చలో కూర్చోబెట్టినా ఏ మాత్రం శ్రద్ధ పెట్టేవారు కాదు. ఇవన్నీ నన్ను ఆలోచింపజేశాయి. అవే నన్ను ‘లక్ష్ మి’ సంస్థ ఏర్పాటుకి ప్రేరేపించాయి’ అంటారామె.

ఇదో అవకాశం...

మహిళలకు సేవ చేయడానికి ఇదో మంచి అవకాశంలా భావించిన మైత్రి ఏడాదిపాటు క్షేత్రస్థాయిలో పనిచేశాక... 2021 మార్చిలో పట్టణ మహిళల కోసం ‘బడీ ఫర్‌ ఫైనాన్స్‌ ప్రోగ్రామ్‌’  (బీఎఫ్‌ఎఫ్‌) మొదలుపెట్టారు. దీని ద్వారా మహిళలకు పొదుపు, మదుపు వంటివే కాదు... రోజువారీ ఖర్చులు, పన్ను విధానం, ఆర్థిక ప్రణాళిక, బీమా వంటి విషయాల్లో అవగాహన కల్పించడం ప్రారంభించారు. ఆలోచన బావున్నా.. ఆచరణకు ఎంతో కష్టపడింది మైత్రి షా. ఆడవాళ్లకు ఆర్థిక స్వేచ్ఛ ఉండటం అంటే ఇంట్లోని మగవాళ్లను అవమానించడమనుకునే భావజాలం ఇప్పటికీ కొంత మందిలో ఉండటం వల్ల ఆటంకాలెన్నో ఎదురయ్యాయి. అయినా సరే, ఓపికగా మాట్లాడి వివరించేది. క్రమంగా మార్పు మొదలైంది. ఇక్కడ శిక్షణ పొందిన 2000 మంది మహిళల్లో 60శాతానికి పైగా సొంత వ్యాపారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా పనిచేసే కొన్ని ఎన్జీవోలతో కలసి అడుగులు వేస్తున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలోని ఉద్యోగినులకూ తరగతులు నిర్వహించారు. ప్రస్తుతం మైత్రి బృందంలో మొత్తం ఐదుగురు పనిచేస్తున్నారు. ‘సంపాదించే మహిళలు... డబ్బుని మాత్రం ఎందుకు సమర్థంగా నిర్వహించలేరు. కచ్చితంగా చేయగలరు... అలాచేయాలనుకునే వారికి ‘లక్ష్ మి’ ఎప్పుడూ తోడుంటుంది అంటోంది మైత్రీషా. రాబోయే ఐదేళ్లలో 20లక్షల మంది మహిళలకు ఆర్థిక అక్షరాస్యత కల్పించి, అందులో కనీసం 20వేల మందిని అయినా పెట్టుబడులు పెట్టే దిశగా నడిపించాలన్నదే తన లక్ష్యం’ అంటారామె.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి