ముగ్గు నేర్పే పాఠం!

సాధారణంగా పండగొచ్చిందంటే ఆ ఆనందాలు నట్టింట వెల్లివిరుస్తాయి. మరి, ఆ వచ్చింది.. పెద్ద పండగ సంక్రాంతి అయితే ఆ సరదాలు రెట్టింపవుతాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే సంబరాల సంగతి కాసేపు పక్కన పెడితే సంక్రాంతి నేర్పే....

Published : 15 Jan 2023 13:26 IST

సాధారణంగా పండగొచ్చిందంటే ఆ ఆనందాలు నట్టింట వెల్లివిరుస్తాయి. మరి, ఆ వచ్చింది.. పెద్ద పండగ సంక్రాంతి అయితే ఆ సరదాలు రెట్టింపవుతాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే సంబరాల సంగతి కాసేపు పక్కన పెడితే సంక్రాంతి నేర్పే పాఠాలెన్నో ఉన్నాయి!

ముగ్గు నేర్పే పాఠం!

జీవితం చాలా చిన్నది.. ఈ లోకంలోకి వచ్చిన ఎవరికీ తమ జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ కొంతమంది ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కూడా 'నాకు ఎన్ని కష్టాలున్నాయో..' అనుకుంటూనే ముందుకు సాగుతారు. ఇది సరైన పద్ధతి కాదని సంక్రాంతి పండగ రోజు వేసే ముగ్గు మనకు నేర్పిస్తుంది. ఉదయాన్నే లేచి వాకిలి వూడ్చి, కల్లాపి చల్లి, ముగ్గు పెట్టడం మనందరికీ తెలిసిందే. సాధారణంగా రోజూ ఇంటిముందు ముగ్గు పెట్టడానికి పెద్దగా ఆసక్తి కనబర్చనివారు కూడా సంక్రాంతి వచ్చిందంటే చాలు.. రంగురంగుల ముగ్గులు వేయడానికి ఇష్టపడుతుంటారు. దీన్ని ఎంతో ఓపికతో శ్రమకోర్చి మరీ వేస్తారు. ఆ ముగ్గు ఒక రోజుకే పరిమితం అని అందరికీ తెలుసు. అయినప్పటికీ నా ముగ్గే అందంగా ఉండాలి అనుకుంటూ వేస్తాం.. ఒకరోజు ఉండిపోయే ముగ్గు గురించే అంత జాగ్రత్త తీసుకునేవాళ్లం.. మన జీవితం గురించి, ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త వహించాలి..? అని ఆలోచించేలా చేస్తుందది..

అంతేకాదు.. ఉండేది ఒకరోజే అయినా అందంగా మెరుస్తూ కనిపిస్తూ, మనల్ని మరింత సంతోషంలో ముంచెత్తుతుంది. మధ్యలో వచ్చే గాలి, అటూఇటూ వెళ్తూ తొక్కే మనుషులు.. వీటన్నింటినీ తట్టుకుంటూ రోజంతా నిలుస్తుంది. మనమూ దాన్ని ఆదర్శంగా తీసుకుని మన జీవితంలోనూ ఎన్ని కష్టాల సుడిగాలులెదురైనా.. వాటన్నింటినీ తట్టుకుంటూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలి.. అన్నదే ముగ్గు చెప్పే పాఠం!

ఎల్లుబెల్ల తిండు..

మన దగ్గర కాస్త తక్కువే అయినా.. మన చుట్టు పక్కన ఉన్న రాష్ట్రాల్లో సంక్రాంతికి తప్పనిసరిగా నువ్వుల లడ్డూలను తీసుకుంటారు. అయితే కేవలం నువ్వుల ఉండలు తినడమే కాదు.. దాన్ని పక్కవాళ్లకు పంచుకోవడం కూడా మనం గమనిస్తుంటాం.. మన పక్కనే ఉన్న కర్ణాటకలో నువ్వుల ఉండలను పంచుకుంటూ 'ఎల్లుబెల్ల తిండు ఒల్లె మాతడి' అని, మహారాష్ట్రలో 'తిల్‌గుడ్ గ్యా అనె గొడ్‌గొడ్ బోల్' అని చెప్పుకుంటూ వీటిని పంచుకుంటారు. అంటే ఈ తీపి పదార్థం తిని ఇకపై మంచిగా మాట్లాడు అని అర్థం. ఎలాంటి విభేదాలున్నా.. అవతలి వారికి తీపిని అందించి.. గొడవలకు అంతం పలకాలని చెప్పడమే దీనిలోని పరమార్థం. అంతేకాదు.. ఈ పండగ సమయంలోనైనా మన మనసులను ఒక్కసారి పరిశీలించుకొని తిల్‌గుల్ (నువ్వుల లడ్డు)లా తియ్యని మాటలు మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చెడు మాటలను, చెడు ప్రవృత్తిని వదిలేద్దాం అని చెబుతుందీ సంప్రదాయం.

సాయం మరవద్దు..

రైతులు ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తారు. దీనికి వారు పడే కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే వారి కష్టంలో తోడ్పాటునిస్తూ.. తమ సాయాన్నందించేవి పశువులు. అందుకే సంక్రాంతి పూట వాటిని పూజించడం ఆనవాయితీ. కష్టంలో ఉన్నప్పుడు సహాయపడిన వారిని ఆనందంలో ఉన్నప్పుడు తలచుకోవడం అనేది ఈ పద్ధతి నుంచి తెలుసుకోవచ్చు. మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని నమ్మి సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. జీవితంలో ఆపై కష్టాలొచ్చినా.. సుఖాలొచ్చినా.. వారి సాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అన్నది దీనిద్వారా మనకు అవగతమవుతుంది. ఇదే పద్ధతిని జీవితంలోనూ పాటిస్తే.. అందరితో కలిసి ఆనందంగా గడిపే అవకాశం దొరుకుతుంది. ఏమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్