Bangkok Pilla: టుక్‌ టుక్‌ వీడియోలే పేరు తెచ్చాయి!

‘బ్యాంకాక్‌ పిల్ల’ (Bangkok Pilla) పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నారు శ్రావణి సామంతపూడి (Sravani Samanthapudi). విజయనగరం నుంచి ఆమె బ్యాంక్‌ ఎందుకు వెళ్లారు, ఎలా వెళ్లారు. ఛానల్‌ సంగతులు తదితర విషయాలు ఆమె మాటల్లోనే...

Updated : 05 Feb 2023 19:14 IST

‘అల్ల.. అక్కడ కనిపించేది మా ఇల్లు’ అంటూ అద్భుతమైన బ్యాంకాక్‌ విశేషాలని విజయనగరం యాసలో ఆకట్టుకొనేలా చెప్పే ఈ తెలుగమ్మాయంటే అందరికీ అభిమానమే. రెండు జళ్లతో, అడుగడుగునా చక్కని మాట విరుపులతో మాయచేసే ‘బ్యాంకాక్‌ పిల్ల’ (Bangkok Pilla) శ్రావణి సామంతపూడి (Sravani Samanthapudi) చెప్పే విశేషాలేంటో తెలుసుకుందాం..

ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలన్నది నా తత్వం. అదే నాకు గుర్తింపుని తెచ్చిపెట్టింది. ‘బ్యాంకాక్‌ పిల్ల’ ఛానెల్‌ ప్రారంభించి ఏడాది తిరగకుండానే... లక్షల మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. అయితే, ఈ విజయం ఒక్కరోజుది కాదు...ఎన్నో ఏళ్ల కష్టముంది. పుట్టి పెరిగిందంతా విజయనగరంలో. నాన్న శ్రీనివాసరాజు, అమ్మ పార్వతి. నాకు బీటెక్‌ చివరి సంవత్సరంలో పెళ్లయ్యింది. మావారు నాగేంద్రవర్మ. ఇన్ఫోసిస్‌లో చేసేవారు. చదువయ్యాక హైదరాబాద్‌లో ఉన్న ఆయన దగ్గరికే నేనూ వెళ్లిపోయా. అప్పటివరకూ ఆడుతూ, పాడుతూ గడిపేసిన నాకు...ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లయ్యింది. బోర్‌కొడుతుంటే ఈటీవీ ‘స్టార్‌ మహిళ’ ఆడిషన్స్‌కి వెళ్లి విన్నర్‌నయ్యా. చాలా థ్రిల్‌ అయ్యా. ఆ తర్వాత మా పాప ఇషిత ఆరాధ్య  పుట్టిన కొన్నిరోజులకే మావారికి థాయ్‌లాండ్‌లో పనిచేసే అవకాశం రావడంతో అక్కడికెళ్లాం.

సరదాగా మొదలుపెట్టి...

థాయ్‌లాండ్‌కి డిపెండెంట్‌ వీసా మీద రావడం వల్ల నాకు ఇక్కడ ఉద్యోగం చేసే అవకాశం లేదు. దాంతో, టైంపాస్‌ అవ్వడానికి పిల్లలతో గడిపే ప్రతి సందర్భాన్నీ వీడియోలు తీసేదాన్ని. పైగా, వాటిని ఎడిటింగ్‌ చేయడమంటే నాకు మహా ఇష్టం. ఆ ఆసక్తే యూట్యూబ్‌ ఛానెల్‌ వైపు మళ్లించింది. మొదట పాప వీడియోలూ, తర్వాత ఫ్యామిలీ వ్లాగ్స్‌...అంటూ వరుసగా నాలుగు ఛానెళ్లను పెట్టేశా. అయితే, ఇవన్నీ ఏదో సంపాదిద్దామని కాదు...నేనేం చేయగలనో చూద్దామని మాత్రమే. కానీ సబ్‌స్క్రైబర్లూ, వ్యూస్‌ పెరగలేదు. నా కష్టం చూసిన స్నేహితులు...బ్యాంకాక్‌లో ఉంటున్నావు. కొత్తగా ప్రయత్నించు అనడం నన్ను ఆలోచనలో పడేసింది. ఈలోగా బాబు ఇషాన్‌ పుట్టాడు. 

ఆ పేరెందుకంటే...

నా అనుభవాలూ, ఈ దేశంలో నా కళ్లకు కనిపించిన చిత్ర విచిత్ర అనుభూతులూ, విదేశంలో భారతీయుల జీవనశైలి... అన్నింటినీ వీడియోల్లో చూపించాలనుకున్నా. అందుకోసం 2022 ఆగస్టులో ‘బ్యాంకాక్‌ పిల్ల’ పేరుతో ఛానెల్‌ని ప్రారంభించా.  మేం ఉంటున్న ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలుగమ్మాయినని అర్థమవ్వాలి అనే రెండు అంశాలు ఆలోచించి ఈ పేరు నిర్ణయించాం. వీడియోల నాణ్యతకోసం మావారితో చాలా పరికరాలనే కొనిపించా. ప్రస్తుతం ఐఫోన్‌తోనే ఈ వీడియోలన్నీ తీస్తున్నా. ఎడిటింగ్‌ దగ్గర్నుంచీ అన్నీ నేనే చేసుకుంటా. టుక్‌ టుక్‌ (ఆటో)ల గురించి చేసిన షార్ట్‌వీడియో వన్‌ మిలియన్‌కి చేరుకోవడంతో ప్రచారం లభించింది. అప్పటివరకూ పదివేలమంది మాత్రమే ఉన్న సబ్‌ స్క్రైబర్ల సంఖ్య, ముప్పై, ఆపై లక్షకు చేరుకుంది. అలా పెరుగుతూ ఏడాది తిరగకుండానే ఎనిమిది లక్షలయ్యింది.


ఇబ్బందులెన్నో...

సామాజిక మాధ్యమాల్లోకి అడుగుపెట్టామంటేనే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాలి. ముందే అవన్నీ ఆలోచించుకున్నా కాబట్టే... నెగెటివ్‌ కామెంట్లను మనసుకి తీసుకోను. మా ఇంట్లో అమ్మాయిలా ఉన్నావని పొగిడేవాళ్లెంత మంది ఉంటారో వంకలు పెట్టేవాళ్లూ అంతేమంది.  ఎక్కువమంది నా యాస, భాషని బాగుందని చెబుతుంటే తెలుగమ్మాయిగా ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఇందులో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా... ఇబ్బందుల్లో పడక తప్పదు. ఆ మధ్య నా వీడియోలతోనే ఫేక్‌ ఛానెల్‌ పెట్టారు. మరొకరు నా పేరుతో ఖాతా తెరిచి డబ్బులు అడగడం వంటివి బాధనిపించాయి. కానీ, ఏ పని చేసినా మనమీద మనం నమ్మకంతో ముందడుగేస్తే.. కాస్త ఆలస్యమయినా అనుకున్నది సాధించొచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్