నాన్న కల కోసం.. ఐటీ జాబ్ వదిలి రక్షణ రంగంలోకి..!

అంతిమ లక్ష్యం అది కానప్పుడు చేసే ఉద్యోగంపై దృష్టి పెట్టలేం. మనల్ని మనం మోసం చేసుకుంటూ ఆ ఉద్యోగంలోనూ కొనసాగలేం. అందుకే ఐటీ ఉద్యోగాన్ని వదిలి రక్షణ రంగంలోకి అడుగుపెట్టానంటోంది 29 ఏళ్ల దిశా అమృత్‌. ఒకప్పుడు నేవీలో విధులు నిర్వర్తించాలనుకున్న...

Updated : 24 Jan 2024 17:22 IST

(Photos: Twitter)

అంతిమ లక్ష్యం అది కానప్పుడు చేసే ఉద్యోగంపై దృష్టి పెట్టలేం. మనల్ని మనం మోసం చేసుకుంటూ ఆ ఉద్యోగంలోనూ కొనసాగలేం. అందుకే ఐటీ ఉద్యోగాన్ని వదిలి రక్షణ రంగంలోకి అడుగుపెట్టానంటోంది 29 ఏళ్ల దిశా అమృత్‌. ఒకప్పుడు నేవీలో విధులు నిర్వర్తించాలనుకున్న తన తండ్రి ఆశయాన్ని తను భుజాలకెత్తుకుంది దిశ. పట్టుదలతో శ్రమించి ఆయన లక్ష్యాన్ని తన ద్వారా నెరవేర్చడమే కాదు.. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది దిశ. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కర్తవ్య పథ్‌లో నిర్వహించనున్న నావికా దళ కవాతు బృందానికి నాయకత్వం వహించే అరుదైన అవకాశం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ యువ నేవీ ఆఫీసర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..

ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్తవ్య పథ్‌లో రక్షణ రంగానికి చెందిన త్రివిధ దళాల బృందాలు కవాతు చేయడం తెలిసిందే! అయితే ఆయా బృందాలకు మహిళలూ నాయకత్వం వహిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అలా ఈ ఏడాది 144 మందితో కూడిన నావికా దళాన్ని ముందుండి నడిపించనుంది మంగళూరుకు చెందిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ దిశా అమృత్‌. దిశతో పాటు సబ్‌ లెఫ్టినెంట్‌ వల్లీ మీనా, మరో మహిళా అధికారిణి కూడా ఈ బృందానికి కమాండర్లుగా వ్యవహరించనున్నారు. ఇలా ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుష అగ్నివీర్లు పరేడ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.

నాన్న ప్రోత్సాహంతో..!

మంగళూరులో పుట్టి పెరిగిన దిశ.. అక్కడి కెనరా స్కూల్లో పాఠశాల విద్యనభ్యసించింది. బెంగళూరులోని బీఎంఎస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. కొన్నేళ్ల పాటు అమెరికాకు చెందిన ఓ ఐటీ కంపెనీలో పనిచేసింది. అయితే తను మంచి ఉద్యోగంలో స్థిరపడినప్పటికీ సంతృప్తి చెందలేదు దిశ. ఎందుకంటే చిన్న వయసు నుంచే రక్షణ రంగంలోకి రావాలన్నది ఆమె ఆశయం.. తన తండ్రి కల. అందుకే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి దేశసేవ చేయడానికి సిద్ధపడ్డానంటోందీ యువ ఆఫీసర్.

‘నాన్న అమృత్‌ కుమార్‌.. కర్ణాటకలోని బాల్భవన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. అమ్మ లీల.. బ్యాంకు మేనేజర్‌గా రిటైరైంది. నేవీలో పనిచేయాలన్నది నాన్న చిన్ననాటి కల. కానీ అది నెరవేరలేదు. దాంతో నన్ను ఈ దిశగా ప్రోత్సహించారాయన. ఎంతో క్రమశిక్షణతో పెంచారు. చదువైనా, ఆటలైనా, ఇతర వ్యాపకాలైనా.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రణాళిక వేసుకొని ముందుకు సాగేలా వెన్నుతట్టారు. అలాగే చిన్న వయసు నుంచే రక్షణ రంగం, దేశ సేవ గురించి ఆయన చెప్పే మాటలు వింటూ పెరిగిన నాకూ ఈ సాహసోపేత రంగంలోకి రావాలన్న మక్కువ పెరిగింది. అందుకే ఐటీ ఉద్యోగాన్ని వదులుకున్నా. 2016లో నావికా దళానికి ఎంపికయ్యా. ఏడాది శిక్షణ అనంతరం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడే నేవల్ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది దిశ.

‘ఆఫీసర్‌’ అని పిలవండి!

రక్షణ రంగంలో సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తూ మహిళల్నీ యుద్ధ కార్యకలాపాల్లోకి తీసుకుంటోన్న ప్రస్తుత తరుణంలో.. పిలుపులో ఇంకా ఈ స్త్రీపురుష వ్యత్యాసం ఎందుకంటోంది దిశ. ‘చాలామంది నన్ను ‘ఉమన్ ఆఫీసర్’ అని సంభోదిస్తున్నారు. కానీ ఆఫీసర్‌ అని పిలిపించుకోవడమంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే నేను నా తోటి పురుష సహచరులతో సమానమని నిరూపించుకున్నాను కాబట్టే.. 144 మందితో కూడిన నేవీ బృందానికి నాయకత్వం వహించే అరుదైన అవకాశం నాకు దక్కింది. ఇందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. 2008లో ఎన్‌సీసీ బృందంలో భాగంగా తొలిసారి రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొన్నా. ఎప్పటికైనా రక్షణ దళ బృందానికి నాయకత్వం వహించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నా. ఆనాటి కల ఇప్పుడు నెరవేరింది. ఇకపైనా నా వృత్తిలో క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగుతా..’ అంటోంది దిశ.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్