Published : 23/03/2023 00:11 IST

మేకప్‌తో మాయ చేస్తోంది!

కంగనా రనౌత్‌ నుంచి కాజోల్‌ వరకు, నయనతార నుంచి మనీ హీస్ట్‌ ఫేమ్‌ అల్వారో మోర్టే వరకు... తలచుకుంటే ఆమె ఎవరిలా అయినా మారిపోగలదు. అలాగని తనకి మాయలో, మంత్రాలో వచ్చనుకుంటున్నారేమో? అదేం కాదు. ప్రోస్థటిక్‌ మేకప్‌ టెక్నిక్‌లతో అచ్చంగా వారిలానే తన రూపుని మార్చేసుకుంటోంది. ఈ ప్రయోగాలే మేకప్‌ ఆర్టిస్ట్‌ దీక్షితా జిందాల్‌ని సోషల్‌ మీడియాలో సెలబ్రిటీని చేశాయి. మిలియన్ల ఫాలోయర్లను తెచ్చిపెట్టాయి.

మేకప్‌ ఆర్టిస్‌ దీక్షితా జిందాల్‌ది దిల్లీ. ఇప్పుడు కెనడాలో అధునాతన ప్రోస్థటిక్‌ మేకప్‌ ఎఫెక్ట్స్‌ని నేర్చుకుంటోంది. నేర్చుకున్న కళకు తన అభిరుచిని జోడించి అద్భుత రూపాలుగా మార్చాలనుకుంది. అలా ఇప్పటివరకూ సుమారు 100 మంది భారతీయ ప్రముఖుల ముఖాలను మేకప్‌తో పునః సృష్టించింది. అదే ఆమెకు సామాజిక మాధ్యమాల్లో కోట్ల మంది ఫాలోయర్లను అందించింది. ‘నాకు అలంకరణ అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడే హెయిర్‌స్టైల్‌, మేకప్‌ వీడియోలు చూసేదాన్ని. వాటిని అనుసరించి కొన్ని ప్రయోగాలూ చేసేదాన్ని. అప్పట్లో ఫేమస్‌ అయిన టిక్‌టాక్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేసేదాన్ని. వాటికి అభినందనలతో పాటూ ఫాలోయర్ల సంఖ్యా పెరిగింది. దాంతో ఇన్‌స్ట్రాగామ్‌లోనూ ఖాతా తెరిచా. అది మొదలు అలంకరణతో మరిన్ని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టా. ఇక్కడా ఆదరణ లభించడంతో బ్రాండ్ల నుంచి ప్రమోషన్ల ఆఫర్లు వరుసకట్టాయి. ఆ డబ్బులతోనే మొదటిసారి ఓ మంచి మేకప్‌ కిట్‌ కొనుక్కున్నా’ అంటోంది దీక్షిత.  

ఆ మేకప్‌ చూసి...

అదే సమయంలో ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆర్టిస్ట్‌ ‘అలెక్సిస్‌ స్టోన్‌’ చేసిన కిమ్‌ కర్దాషియాన్‌ మేకప్‌ చూసి తనకీ ఇలా ప్రయత్నించాలి అనిపించింది. ‘మొదట ఆ మేకప్‌ చూసి ఆశ్చర్యపోయా. తర్వాత ఎలా చేయొచ్చో తెలుసుకోవడం మొదలుపెట్టా. ఏదైనా ప్రయత్నిస్తేనే కదా.. సాధ్యమో కాదో తెలిసేది. ఫేస్‌ పెయింటింగ్‌, ఇల్యూజన్‌ మేకప్‌ల సాయంతో ‘సాత్‌ నిభానా సాథియా’లోని కోకిలా బెన్‌ పాత్రలా మారిపోయా. ఆ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. దాంతో నాలో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఫాలోయర్లూ పెరిగారు. తాజాగా షారూఖ్‌ పఠాన్‌ లుక్‌తో చేసిన రీల్‌ వైరల్‌ అవుతోంది. కేవలం 20 రోజుల్లో 13.4 మిలియన్ల వీక్షణల్ని దాటేసింది.

మొదట కష్టమన్నారు...

‘ట్రాన్స్‌ఫర్మేషన్‌ మేకప్‌ చేయడం అంటే పెళ్లిళ్లలో వధువు ముఖానికి పూతలేయడమంత సులువేం కాదు అని ఎత్తిపొడిచారు కొందరు. రియలిస్టిక్‌ లుక్‌ తేవాలంటే...బోలెడు కష్టపడాలి నీ వల్ల అవుతుందా అని సందేహపడ్డారు ఇంకొందరు. ఎవరెన్ని అన్నా...ఏం చెప్పినా సరే, నా మనసు చెప్పిన దారిలోనే నడవాలని నిర్ణయించుకున్నా. నిజానికి ఒక్కొక్కరి ముఖాకృతి ఒక్కో విధంగా ఉంటుంది. అచ్చంగా ఆ వ్యక్తిలాగే కనిపించాలంటే ముందు వారి ముఖ కవళికలూ, ఆకృతి వంటివి అర్థం చేసుకోవాలి. తర్వాతే మేకప్‌. దీన్ని పూర్తి చేయాలంటే.... కనీసం ఐదు నుంచి పదిహేను గంటల సమయం పట్టొచ్చు. ఇందుకు చాలా ఓపిక అవసరం. అయితే, ఇవన్నీ ఇష్టంగా చేస్తాను కాబట్టి నాకు పెద్ద కష్టంగా అనిపించలేద’నే దీక్షితకి అలెక్సిస్‌ స్టోన్‌, లెటిసియా గోమ్స్‌ వంటి అంతర్జాతీయ మేకప్‌ ఆర్టిస్టులే స్ఫూర్తట. విరాట్‌ కోహ్లీ, కపిల్‌ దేవ్‌, రేఖ అనుపమ్‌ ఖేర్‌, మైఖేల్‌ జాక్సన్‌ వరకూ ఎంతో మంది ప్రముఖుల రూపాలను దీక్షిత పునః సృష్టించింది. ‘మొదట అందరూ... నేనేదో సాఫ్ట్‌వేర్‌నో, ఫిల్టర్‌నో వాడుతున్నా అనుకునేవారు. తర్వాత విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. నా ప్రతిభకు గుర్తింపు దక్కడం సంతోషంగా ఉంది. నిజానికి ప్రోస్థటిక్స్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, మేకప్‌లకు భారత్‌లో మంచి భవిష్యత్తు ఉంది. ముఖ్యంగా సినిమా సీన్‌లకోసం గాయాలు, కట్‌లు, దుమ్ముతో కూడిన మేకప్‌ చేయడం వంటివన్నీ ఈ నైపుణ్యాలతోనే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అవకాశాల్ని అందుకోవడం తోపాటూ షారూఖ్‌తో కలసి నటించాలన్నది నా కోరిక’ అని చెబుతోంది దీక్షిత.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి