Published : 02/12/2022 14:19 IST

Manjima Mohan: ఆ విషయంలో నాకు లేని బాధ మీకెందుకు?!

(Photo: Instagram)

చాలావరకు మన వ్యక్తిగత విషయాలు మనల్ని అంతలా బాధపెట్టవు.. కానీ వీటిపై ఇతరులు చేసే కామెంట్లే మనల్ని తీవ్ర మానసిక ఒత్తిడిలోకి నెట్టేస్తుంటాయి. ఇలాంటి మానసిక సంఘర్షణను తానూ ఎదుర్కొన్నానంటోంది కోలీవుడ్‌ నటి మంజిమా మోహన్‌. అధిక బరువు, శరీరాకృతి విషయాల్లో పలుమార్లు విమర్శల్ని ఎదుర్కొన్న ఆమె.. చివరికి తన పెళ్లిలోనూ కొంతమంది నుంచి బాడీ షేమింగ్‌ కామెంట్లను ఎదుర్కొన్నానంటోంది.  ఇటీవలే తన ప్రియుడు, నటుడు గౌతమ్‌ కార్తీక్‌ను వివాహమాడిన మంజిమ.. ఈ సమయంలో తనకెదురైన బాడీ షేమింగ్‌ అనుభవాల్ని ఓ వేదికగా గుదిగుచ్చింది.

అప్పుడు చాలా బాధపడ్డా!

నిజానికి బరువు పెరగడం, తగ్గడం మన చేతుల్లో లేదు.. ఈ విషయం తెలుసుకోకుండా కొంతమంది తమ సూటిపోటి మాటలతో ఎదుటివారిని బాధపెడుతుంటారు. అయితే కనీసం పెళ్లని కూడా చూడకుండా తన అధిక బరువు గురించి కొందరు కామెంట్లు చేశారంటోంది మంజిమ.

‘గతంలోనూ నా అధిక బరువు గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకునేవారు. అంతెందుకు.. పెళ్లిలోనూ కొంతమంది ఈ విషయంలో నెగెటివ్‌గా కామెంట్లు పెట్టారు. అయితే మొదట్లో ఇలాంటి వాటికి బాధపడ్డా.. తర్వాత్తర్వాత వాళ్ల మాటల్ని తేలిగ్గా తీసుకోవడం మొదలుపెట్టా. ప్రస్తుతం నా శరీరాకృతి విషయంలో నేను సంతోషంగా, సౌకర్యవంతంగా ఉన్నా. నాకు బరువు తగ్గాలనిపించినప్పుడు తగ్గుతా. వృత్తిపరంగా పాత్ర డిమాండ్‌ చేస్తే దీనిపై మరింత దృష్టి సారిస్తా. అయితే ఎదుటివారి బరువులో హెచ్చుతగ్గులు ఇతరుల్ని ఎలా ప్రభావితం చేస్తాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు..’ అంది మంజిమ. అయితే తాను బరువు పెరగడానికి పీసీఓఎస్‌ ఓ కారణమంటోందామె.

అలా అయితేనే అవకాశాలొస్తాయన్నారు!

హీరోయిన్‌గా ఎదగాలంటే సన్నగా, నాజూగ్గా ఉండాలంటారు. ఇలాంటప్పుడే సినిమాల్లో అవకాశాలొస్తాయంటారు. చాలామంది ఎన్నోసార్లు తనకూ ఇదే విషయం చెప్పారంటోంది మంజిమ.

‘ఓ నటిగా బరువు పెరగడం, తగ్గడం అనేది ఆయా సినిమాల్లో పాత్రను బట్టి ఉంటుంది. కొంతమంది దర్శకులు తమ హీరోయిన్‌ ఫిట్‌గానే ఉండాలనుకుంటారు.. కానీ నేను పనిచేసిన దర్శకులతో నాకెప్పుడూ ఇలాంటి సమస్య రాకపోవడం నా అదృష్టం. బరువు తగ్గితేనే కెరీర్‌లో మంచి అవకాశాలొస్తాయని నాతో చెప్పిన వారూ లేకపోలేదు. పాత్ర డిమాండ్‌ చేస్తే బరువు తగ్గడానికి నేను రడీ.. అంతేకానీ ‘ఇంత నాజూగ్గానే కనిపించాలి’ అని నేనెప్పుడూ నా శరీరానికి ఆంక్షలు పెట్టను. ప్రస్తుతం నా శరీరాకృతి, బరువు విషయంలో నేను సౌకర్యంగానే ఉన్నా. కాబట్టి దీని గురించి ఇతరులు చేసే కామెంట్లు, అనే మాటలు నేను పట్టించుకోను..’ అంటూ తనలోని బాడీ పాజిటివిటీని, స్వీయ ప్రేమను చాటుకుందీ కోలీవుడ్‌ బ్యూటీ.

మూడేళ్ల ప్రేమకు మూడుముళ్లు..!

బాలనటిగా వెండితెరకు పరిచయమైన మంజిమ.. పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించిన ఆమె.. 2019లో తెరకెక్కిన ‘దేవరాట్టం’ చిత్ర షూటింగ్‌ సమయంలో సహనటుడు గౌతమ్‌ కార్తీక్‌తో ప్రేమలో పడింది. సుమారు మూడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలో ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగిన వీరి వివాహ వేడుకలో ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రస్తుతం వీరు తమ పెళ్లి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకోగా.. అవి వైరలవుతున్నాయి.

కార్తీకే అప్పుడు అండగా నిలిచాడు!

సుఖంలోనే కాదు.. కష్టాల్లోనూ అండగా నిలిచేవాడే నిజమైన జీవిత భాగస్వామి అంటారు. ఈ విషయంలో తన భర్త కార్తీక్‌కు నూటికి నూరు మార్కులు వేయాలంటోందీ కొత్త పెళ్లి కూతురు. గతంలో ఓ కష్ట సమయంలో తాను అండగా నిలిచిన తీరును ఓ సందర్భంలో గుర్తు చేసుకుంది మంజిమ.

‘ఓసారి మా ఇంటి గేటు వద్ద ప్రమాదవశాత్తూ నా కాలికి బలమైన గాయమైంది. ముందు ఇది చిన్న దెబ్బే కదా అని దగ్గర్లోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా. కానీ దీని ప్రభావంతో ఆలస్యం చేస్తే ఏకంగా కాలే తీసేయాల్సిన దుస్థితి వస్తుందని తెలుసుకున్న నేను.. ఆపై ఆపరేషన్‌ చేయించుకొని కొన్ని నెలల పాటు మంచానికే పరిమితమయ్యా. నిజానికి నా జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యంత గడ్డు స్థితి ఇది. ఈ కష్ట కాలంలో కార్తీక్‌ నాకు పూర్తి అండగా నిలిచారు. నాకు, నా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు. తన మంచి మనసుతో అమ్మానాన్నల్ని ఆకట్టుకున్నాడు. ఇలాంటి పలు సంఘటనలు మా మధ్య అనుబంధాన్ని మరింతగా పెంచాయి..’ అంటూ తన ఇష్టసఖుడి గురించి చెబుతూ మురిసిపోయిందీ తమిళందం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి