‘విదేశీయులు నాసాలో పనిచేయడం అసాధ్య’మన్నారు!

పెద్ద పెద్ద లక్ష్యాల్ని చేరుకోవడం అసాధ్యమనుకుంటారు కొందరు.. ఇతరుల నిరుత్సాహపూరిత మాటలకు వెనక్కి తగ్గుతుంటారు మరికొందరు.. కానీ స్వీయ నమ్మకంతో, పట్టుదలతో ముందుకు సాగితే అసాధ్యమనేదే ఉండదని అనుభవ పూర్వకంగా చెబుతోంది యువ సైంటిస్ట్‌ డాక్టర్‌ అక్షతా కృష్ణమూర్తి.

Published : 05 Dec 2023 20:51 IST

(Photos: Instagram)

పెద్ద పెద్ద లక్ష్యాల్ని చేరుకోవడం అసాధ్యమనుకుంటారు కొందరు.. ఇతరుల నిరుత్సాహపూరిత మాటలకు వెనక్కి తగ్గుతుంటారు మరికొందరు.. కానీ స్వీయ నమ్మకంతో, పట్టుదలతో ముందుకు సాగితే అసాధ్యమనేదే ఉండదని అనుభవ పూర్వకంగా చెబుతోంది యువ సైంటిస్ట్‌ డాక్టర్‌ అక్షతా కృష్ణమూర్తి. నాసాలో చేరాలన్న లక్ష్యంతో 13 ఏళ్ల క్రితం అమెరికా చేరిన ఆమెను చుట్టూ ఉన్న వాళ్లు తమ మాటలతో నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు.. ఒక విదేశీయురాలికి ఇంత పెద్ద పెద్ద కలలు తగవన్నారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగిన అక్షత అనుకున్నది సాధించింది.. నాసాలో తన కలల ఉద్యోగం సంపాదించడమే కాదు.. ఈ సంస్థ ప్రయోగించిన పలు అంతరిక్ష ప్రయోగాల్లోనూ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం మార్స్‌పై ఉన్న రోవర్‌ను ఆపరేట్‌ చేసే స్థాయికి ఎదిగిన అక్షత.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే తాజాగా తన సక్సెస్‌ స్టోరీని సోషల్‌ మీడియాలో పంచుకోగా అది కాస్తా వైరల్‌గా మారింది.

నాసాలో చేరాలని..!

నాసాలో ఉద్యోగం సంపాదించాలని చాలామంది కలలు కంటారు. కానీ ఈ అరుదైన అవకాశం అతికొద్ది మందినే వరిస్తుంది. వారిలో భారతీయురాలైన డాక్టర్‌ అక్షత కూడా ఒకరు. అయితే ఇది అనుకున్నంత సులభంగా ఏమీ జరగలేదు. ఈ ఆలోచనతోనే 13 ఏళ్ల క్రితం అమెరికా చేరిన ఆమె.. ‘మసాచ్యుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ నుంచి ‘ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌’లో పీహెచ్‌డీ పట్టా అందుకుంది. ‘నా థీసిస్‌లో భాగంగా నాసా రూపొందించిన రెండు అంతరిక్ష ప్రయోగాల్లో పాలు పంచుకున్నా. ఆ రెండూ నేపు పీహెచ్‌డీలో ఉన్నప్పుడే ప్రయోగించగా.. అవి విజయవంతమయ్యాయి. ఈ అనుభవం నా కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడింది.. ఇక పీహెచ్‌డీ పూర్తయ్యాక రీసెర్చ్‌ అసోసియేట్‌గా, పలు స్టార్టప్స్‌కి మెంటార్‌గానూ వ్యవహరించా..’ అంటోంది అక్షత.

అది నా వల్ల కాదన్నారు!

పైచదువులు, నాసాలో ఉద్యోగంలో చేరాలన్న లక్ష్యంతో 13 ఏళ్ల క్రితం వీసాపై అమెరికా చేరిన అక్షతకు తన స్నేహితుల్లో కొంతమంది నుంచి విముఖత ఎదురైందని చెబుతోందామె. ఈ క్రమంలోనే తాను ఎదుర్కొన్న పలు సవాళ్ల గురించి తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది అక్షత.

‘నాసాలో చేరాలని 13 ఏళ్ల క్రితం వీసాపై అమెరికా వచ్చాను. ఈ సంస్థలో చేరి భూమి, అంగారక గ్రహాలపై శాస్త్ర సాంకేతిక, రోబోటిక్‌ ఆపరేషన్స్‌కు నాయకత్వం వహించాలని ఉవ్విళ్లూరా. కానీ నన్ను కలిసిన వారు, నా స్నేహితుల్లో కొందరు.. వీసాపై వచ్చిన విదేశీయులకు ఇది అసాధ్యమన్నారు. మరో కెరీర్‌ చూసుకోమని ఉచిత సలహాలిచ్చారు. అయినా వాళ్ల మాటలు పట్టించుకోకుండా నా శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలపైనే పూర్తి దృష్టి పెట్టా. ఈ పట్టుదల, ఆత్మవిశ్వాసమే నా కలల ఉద్యోగంలో చేరేలా చేశాయి..’ అంటోన్న అక్షత.. ప్రస్తుతం నాసాలో ‘ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌’గా, ‘మిషన్‌ సైన్స్‌ ఫేజ్‌ లీడ్‌’గా పలు బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

నాసాలో.. నాయకురాలిగా!

గత ఆరేళ్లుగా నాసాతో కలిసి పనిచేస్తోన్న ఈ యంగ్‌ సైంటిస్ట్‌.. ఈ క్రమంలో నాసా ప్రయోగించిన ‘Transiting Exoplanet Survey Satellite (TESS)’, ‘Arcsecond Space Telescope Enabling Research in Astrophysics (ASTERIA)’, ‘NASA-ISRO Synthetic Aperture Radar (NISAR)’.. వంటి పలు మిషన్లకు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించింది. ప్రస్తుతం 2020లో అంగారక గ్రహంపైకి ప్రయోగించిన ‘మార్స్‌ పర్సెవెరన్స్‌ రోవర్‌’ ఆపరేటింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తోందామె. ఇలా ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగానూ చరిత్రకెక్కింది అక్షత.

‘పెద్ద కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి.. అన్న అబ్దుల్‌ కలాం మాటల్నే చిన్నప్పట్నుంచి స్ఫూర్తిగా తీసుకున్నా. శాస్త్ర సాంకేతిక రంగాలైనా, సమాజాభివృద్ధి అయినా.. ఇలా మనం ఎంచుకున్న రంగమేదైనా సరే.. పెద్ద లక్ష్యాల్ని ఏర్పరచుకోవడం తప్పుకాదు.. ఈ క్రమంలో ఇతరుల మాటలు పట్టించుకోకుండా మన మనసు మాట వింటే.. మన శక్తి సామర్థ్యాలపై నమ్మకముంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎంత పెద్ద లక్ష్యమైనా చేరుకోగలుగుతాం.. భావి తరాలకు స్ఫూర్తిగా నిలవగలుగుతాం..’ అంటూ తన స్ఫూర్తిదాయక మాటలతోనూ నేటి యువతలో ప్రేరణ కలిగిస్తోంది అక్షత. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తన నైపుణ్యాలకు గుర్తింపుగా పలు అవార్డులు-రివార్డులు అందుకున్న ఈ రాకెట్‌ సైంటిస్ట్‌.. అంతరిక్ష రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికుల కోసం పలు కెరీర్‌ చిట్కాల్నీ సోషల్‌ మీడియా వేదికగా అందిస్తోంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్