Jayashree : 70 గంటలు విమానం నడిపి..!

మనసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మరో కెరీర్‌పై దృష్టి పెట్టలేం. అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని మరీ తన చిన్ననాటి కల నెరవేర్చుకుంది తమిళనాడులోని బడగా తెగకు చెందిన జయశ్రీ. పైలట్‌ కావాలనేది ఆమె జీవిత లక్ష్యం.

Published : 20 Sep 2023 12:26 IST

(Photos: Instagram)

మనసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మరో కెరీర్‌పై దృష్టి పెట్టలేం. అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని మరీ తన చిన్ననాటి కల నెరవేర్చుకుంది తమిళనాడులోని బడగా తెగకు చెందిన జయశ్రీ. పైలట్‌ కావాలనేది ఆమె జీవిత లక్ష్యం. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రైవేట్‌ పైలట్‌ లైసెన్స్‌ అందుకున్న ఆమె.. ఈ ఘనత సాధించిన తొలి బడగా మహిళగా గుర్తింపు సంపాదించుకుంది. ‘ఆడపిల్ల చదువు కోసం ఇంత ఖర్చు పెట్టడం అవసరమా?’ అన్న వాళ్ల నోటితోనే శెభాష్ అనిపించుకుంటోన్న జయశ్రీ కథేంటో తెలుసుకుందాం రండి..

తమిళనాడు నీలగిరీస్‌ జిల్లాలో విస్తరించి ఉన్న బడగా అనే గిరిజన తెగలో పుట్టి పెరిగింది జయశ్రీ. ఆమె తండ్రి గ్రామ పరిపాలన అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. స్థానికంగానే స్కూలింగ్‌ పూర్తిచేసిన ఆమె.. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదివింది. చిన్న వయసు నుంచే చదువులో మేటిగా రాణించిన ఆమె క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లోనే ఐటీ ఉద్యోగం సంపాదించుకుంది.

‘అనవసర ఖర్చు’ అన్నారు!

ప్రముఖ సంస్థలో ఉద్యోగం.. మంచి జీతం.. అయినా ఏదో అసంతృప్తిగా ఫీలయ్యేది జయశ్రీ. అయితే 2020లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికి చేరుకున్న ఆమె.. కొన్ని నెలల పాటు ఇంటి నుంచే పనిచేసింది. అప్పుడే తన చిన్ననాటి కలపై దృష్టి పెట్టాలనుకున్నట్లు చెబుతోందామె.

‘ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నా.. మనసులో ఏదో వెలితిగా అనిపించేది. నా లక్ష్యం ఇది కాదేమోనన్న భావన కలిగేది. అప్పుడే నా చిన్ననాటి కల నెరవేర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది. చిన్నతనంలో విమానాలంటే ఇష్టపడేదాన్ని. ఈ మక్కువతోనే ఎప్పటికైనా పైలట్‌ కావాలన్న కోరిక పెరుగుతూ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా వేస్తూ వచ్చాను. ఇక లాక్‌డౌన్‌ సమయంలో దీనిపై దృష్టి పెట్టే అవకాశం దొరికింది. నా ఆలోచనను నాన్న కూడా ప్రోత్సహించారు.. కానీ పైలట్‌ ట్రైనింగ్‌ కోసం విదేశాలకు వెళ్తానంటే అమ్మే కాస్త భయపడింది. అయినా అడుగు ముందుకు వేశాను. దక్షిణాఫ్రికాలోని ఓ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ స్కూల్లో శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నా. నిజానికి ఆ సమయంలో మా ఇరుగుపొరుగు వారు, బంధువుల్లో చాలామంది నన్ను నిరుత్సాహ పరచాలని చూశారు. ఆడపిల్ల చదువుకు ఇంత ఖర్చు అవసరమా? అన్న వారూ లేకపోలేదు. కానీ ‘నీకు నచ్చిందే చేయమం’టూ నాన్న నన్ను ప్రోత్సహించారు..’ అంటోన్న జయశ్రీ.. ఆరు నెలల పైలట్ ట్రైనింగ్‌ పూర్తిచేసుకొని ఇటీవలే స్వదేశానికి చేరుకుంది. ఈ శిక్షణలో భాగంగా ప్రైవేట్‌ పైలట్‌ లైసెన్స్‌ అందుకున్న ఆమె.. ఈ ఘనత సాధించిన తొలి బడగా మహిళగా గుర్తింపు తెచ్చుకుంది.

అదే నా లక్ష్యం!

సమాజంలో మార్పు రావాలంటే.. ఆ మార్పు ఎవరో ఒకరితో ప్రారంభమవ్వాలి.. బడగా కమ్యూనిటీలో అలాంటి మార్పే తీసుకొచ్చింది జయశ్రీ. ఈ తెగలోని ఆడపిల్లలకు చదువు, ఉద్యోగాల విషయంలో పలు ఆంక్షలుండేవి.. తనను చూశాక.. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత చదువుల కోసం ఊరు దాటి పంపేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందంటోందామె.

‘నేను పైలట్‌ శిక్షణకు వెళ్తానంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు.. కానీ వాళ్లే ఇప్పుడు నన్ను స్ఫూర్తిగా తీసుకోమని వారి పిల్లలకు చెబుతుంటే గర్వంగా అనిపిస్తోంది. చెప్పడమే కాదు.. వాళ్ల పిల్లల్నీ పైచదువుల కోసం వేరే రాష్ట్రాలకూ పంపుతున్నారు. ఇక ఆరు నెలల శిక్షణలో భాగంగా.. 70 గంటల పాటు విమానం నడిపా.. పలు రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు పూర్తిచేశా. నా తదుపరి లక్ష్యం కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ పొందడం. ఇందుకోసం 250 గంటలు విమానం నడపాల్సి ఉంటుంది.. అలాగే కొన్ని పరీక్షలూ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎప్పటికైనా పైలట్‌గా దేశానికి సేవలందించాలని ఉవ్విళ్లూరుతున్నా..’ అంటోన్న జయశ్రీకి శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉంది. ఈ క్రమంలోనే పలు వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చిందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్