పాతికేళ్లకే ‘ఎంపీ’లయ్యారు!

రాజకీయాల్లో రాణించాలంటే అనుభవం కావాలంటారు. అనుభవం కాదు.. ప్రజాభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక ఉంటే చాలంటున్నారు ఈ యువ ఎంపీలు. ఇటీవలే వెల్లడైన పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేసి విజయదుందుభి మోగించారు.

Updated : 06 Jun 2024 21:33 IST

(Photos: Instagram)

రాజకీయాల్లో రాణించాలంటే అనుభవం కావాలంటారు. అనుభవం కాదు.. ప్రజాభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక ఉంటే చాలంటున్నారు ఈ యువ ఎంపీలు. ఇటీవలే వెల్లడైన పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేసి విజయదుందుభి మోగించారు. తద్వారా అతి పిన్న వయసులోనే లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. మరి, వాళ్లెవరు? వాళ్ల రాజకీయ ప్రస్థానం.. మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం రండి..

మూడు తరాల స్ఫూర్తితో!

ఒకటి కాదు, రెండు కాదు, మూడు తరాల రాజకీయ అనుభవాన్ని పుణికి పుచ్చుకొని ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచింది బిహార్‌కు చెందిన శాంభవీ ఛౌదరి. ఆమె తండ్రి అశోక్‌ కుమార్‌ ఛౌదరి ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. తాతముత్తాతలూ రాజకీయాల్లో తలపండిన వారే! ఇలా తన తండ్రి, తాతముత్తాతల రాజకీయ నేపథ్యాన్ని చూస్తూ పెరిగిన ఆమె.. తానూ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంది. ఈ ఆలోచనతోనే ‘లోక్‌ జనశక్తి పార్టీ’లో చేరిన ఆమె.. ఈ ఎన్నికల్లో సమస్తిపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగమైన ఈ పార్టీ.. ఎన్నికల ర్యాలీల్లో చురుగ్గా పాల్గొంటూ మోదీ మన్ననలూ అందుకుందామె. తన అద్భుతమైన ప్రసంగాలతో స్థానిక ప్రజల మనసులూ గెలుచుకుంది. ఇవే ఎన్నికల ఫలితాల్లో ఆమెకు పట్టం కట్టాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సన్నీ హజారీపై 1.87 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన శాంభవి.. వయసు 25 ఏళ్లు. తద్వారా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టబోతున్న అతి పిన్న ఎంపీగా నిలిచిందామె.

దిల్లీలోని లేడీ శ్రీరాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన శాంభవి.. ‘దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌’ నుంచి సోషియాలజీలో మాస్టర్స్‌ పట్టా అందుకుంది. ప్రస్తుతం ‘జ్ఞాన్ నికేతన్‌ స్కూల్‌’కు డైరెక్టర్‌గా కొనసాగుతోన్న ఆమె.. ‘మగధ్‌ యూనివర్సిటీ’లో పీహెచ్‌డీ చేస్తోంది. మాజీ ఐపీఎస్‌ అధికారి ఆచార్య కిశోర్‌ కునాల్‌ తనయుడు సాయన్‌ కునాల్‌ను వివాహమాడిందీ యంగెస్ట్‌ ఎంపీ.


ఓడి.. గెలిచింది!

ఓటమి నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం.. మరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తాం. సంజనా జాతవ్‌ కూడా ఇదే చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అయిన ఆమె.. గతేడాది రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. కానీ ‘ఓటమే గెలుపుకి పునాది’ అనే సిద్ధాంతాన్ని నమ్మిన సంజన.. ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం పట్టు సడల్లేదు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె.. బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్‌ కోలీని సుమారు 52 వేల ఓట్ల తేడాతో ఓడించి ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టనుంది. దళిత కమ్యూనిటీకి చెందిన సంజన వయసు ప్రస్తుతం 25 ఏళ్లు. తద్వారా ఈసారి లోక్‌సభలోకి కాలుమోపనున్న అతి పిన్న ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకుందామె.

‘పడిన కష్టానికి కచ్చితంగా ప్రతిఫలం దక్కుతుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఇది మరోసారి రుజువైంది. ఎంపీగా నియోజకవర్గ ప్రజల సంక్షేమమే నా ధ్యేయం! ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగానే.. అభివృద్ధి చెందని ప్రాంతాలు, ఆరోగ్యం, ఉద్యోగం-ఉపాధి అవకాశాలు, నీటి కొరత.. వంటి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తా..’ అంటోంది సంజన.‘మహారాజా సురజ్‌మల్‌ బ్రిజ్ యూనివర్సిటీ’ నుంచి 2019లో డిగ్రీ పూర్తిచేసిన సంజన.. రాజస్థాన్‌ పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోన్న వ్యక్తిని వివాహమాడింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు.


న్యాయవాదిగా.. ఎంపీగా!

తన తండ్రి స్ఫూర్తితో రాజకీయ రంగ ప్రవేశం చేసింది పాతికేళ్ల ప్రియా సరోజ్‌. మూడుసార్లు ఉత్తరప్రదేశ్‌ ఎంపీగా పనిచేసి, ప్రస్తుతం ఆ రాష్ట్ర ఎమ్మెల్యేగా కొనసాగుతోన్న తూఫానీ సరోజ్‌ కూతురు ఆమె. రాజకీయాలపై మక్కువతో కొంత కాలం క్రితమే సమాజ్‌వాద్‌ పార్టీలో చేరిన ఆమె.. ఈ ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ‘మచ్లీషహర్‌’ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసింది. ఇదే నియోజకవర్గం నుంచి భాజపా తరఫున బరిలోకి దిగిన బి.పి. సరోజ్‌ను సుమారు 36 వేల ఓట్ల తేడాతో ఓడించిన ప్రియ.. ఈ ఏడాది లోక్‌సభలో అడుగుపెట్టనున్న అతి పిన్న ఎంపీల్లో ఒకరిగా ప్రత్యేకతను సొంతం చేసుకుంది.

దిల్లీలోని ఎయిర్‌ఫోర్స్‌ గోల్డెన్‌ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసిన ప్రియ.. దిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ చదివింది. నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన ఆమె.. ప్రస్తుతం సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తోంది.


గిరిజన ఆణిముత్యం!

రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరిగినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమంటోంది 27 ఏళ్ల ప్రియాంక జర్కిహోలి. కర్ణాటక చిక్కోడికి చెందిన గిరిజన మహిళ అయిన ఆమె.. ఇటీవలే జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి గెలుపొందింది. భాజపా మాజీ ఎంపీ అన్నాసాహెబ్‌ జోలేపై 90 వేల ఓట్ల మెజార్టీ సాధించిన ఆమెకు 7.13 లక్షల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టబోతున్న అతి పిన్న గిరిజన మహిళా ఎంపీగా సరికొత్త చరిత్రను లిఖించింది ప్రియాంక. అంతేకాదు.. కర్ణాటకలో అన్‌రిజర్వ్‌డ్‌ సీటును గెలుచుకున్న తొలి గిరిజన మహిళగానూ ఆమె రికార్డు నమోదుచేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్న సతీష్ జర్కిహోలి కూతురైన ఆమె.. రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలని కోరుకుంటోంది.

‘ప్రజలకిచ్చిన వాగ్దానాల్ని నెరవేరుస్తూనే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా. ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలు, పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలి. అప్పుడే మన పనితనమేంటో క్షేత్రస్థాయిలో నిరూపించుకోగలుగుతాం. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు.. ఆ ఫ్యామిలీలోని పురుషుల మాట వింటారని, తమ సొంత నిర్ణయాలు తీసుకోలేరని చాలామంది అనుకుంటారు. కానీ ఆ మాటలు అవాస్తవమని నిరూపించడానికి ఇలాంటి విజయాలే తార్కాణం! ప్రజా సేవ చేయడానికి ఇదో గొప్ప వేదిక’ అంటోంది ప్రియాంక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్