మెన్‌స్ట్రూపీడియా ఇదో నెలసరి వేదిక!

‘ష్‌... మెల్లగా మాట్లాడు’, ‘అవన్నీ ముట్టుకోకూడదు’... ‘నెలసరి’ అనగానే వినిపించే మాటలే ఇవి. ఇక శానిటరీ న్యాప్కిన్లు కొనేప్పుడు చుట్టూ ఎవరైనా ఉన్నారా అని గమనించుకోవడం, వాటిని చాటుమాటుగా కొని తెచ్చుకోవడం ఇప్పటికీ కనిపించే దృశ్యాలే! అమ్మాయిలు ఎన్ని రంగాల్లో దూసుకెళుతోన్నా నెలసరి విషయంలో తడబడుతూనే ఉంటారు.

Updated : 28 May 2024 07:40 IST

నేడు రుతు పరిశుభ్రత దినోత్సవం

‘ష్‌... మెల్లగా మాట్లాడు’, ‘అవన్నీ ముట్టుకోకూడదు’... ‘నెలసరి’ అనగానే వినిపించే మాటలే ఇవి. ఇక శానిటరీ న్యాప్కిన్లు కొనేప్పుడు చుట్టూ ఎవరైనా ఉన్నారా అని గమనించుకోవడం, వాటిని చాటుమాటుగా కొని తెచ్చుకోవడం ఇప్పటికీ కనిపించే దృశ్యాలే! అమ్మాయిలు ఎన్ని రంగాల్లో దూసుకెళుతోన్నా నెలసరి విషయంలో తడబడుతూనే ఉంటారు. ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. దానికి కారణమయ్యారు అదితీ గుప్తా. తన సంస్థ ‘మెన్‌స్ట్రూపీడియా’ ద్వారా మహిళల ఆరోగ్యం కోసం కృషిచేస్తున్నారామె!

జార్ఖండ్‌లోని గఢ్‌వా అదితీది. చిన్నఊరు... నదికి పక్కనే ఇల్లు. సోదరుడితో పోటాపోటీగా ఆడేది, చేపలు పట్టేది. తల్లిదండ్రులిద్దరూ చదువుకున్నవారే కావడంతో అన్నింటా సమానంగా ప్రోత్సహించేవారు. కానీ అదంతా మారే రోజు రానేవచ్చింది. అప్పుడు అదితికి 12ఏళ్లు. నెలసరి మొదలైంది. అది చూడగానే చిన్నారి అదితికి భయమేసింది. పరుగెత్తుకుంటూ వెళ్లి అమ్మతో చెబితే ధైర్యంతో కూడిన మాటలు రాలేదు. ‘ఈ విషయం ఎవరితోనూ చెప్పకు’ అన్న సమాధానం వచ్చింది. ఇకప్పటి నుంచీ ‘మంచంపై కూర్చోకు, వంటగదిలోకి రావొద్దు, పచ్చళ్లు పట్టుకోవద్దు, నెలసరి పూర్తవగానే నీ దుప్పటి ఉతికేసుకో, దేవుడి గది దగ్గరికెళ్లొద్దు’... ఇలా అనేక సూచనలు. అంతేకాదు శానిటరీ న్యాప్కిన్లను అందరిముందూ కొని, తెచ్చుకుంటే పరువు పోతుంది అనేవారట. అందుకని వస్త్రాలు వాడితే వాటినేమో ఎండలో ఆరనిచ్చేవారు కాదు. వాటివల్ల ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయనో... నొప్పి భరించలేకపోతున్నాననో అంటే- ‘అలాంటివి మాట్లాడకూడదు’ అనేవారట. దీంతో తనేదో తప్పు చేస్తున్నా అనుకునేది అదితి. ఆత్మన్యూనతకూ గురయ్యేది. తొమ్మిదో తరగతిలోకి అడుగుపెట్టాక కానీ తన తప్పేమీ లేదన్న విషయం అర్థం కాలేదా చిన్నారికి.

అవగాహనకి... స్కాలర్‌షిప్‌

తొమ్మిదో తరగతిలో ‘నెలసరి’ గురించిన ప్రాథమిక సమాచారంపై పాఠముంది. అప్పట్నుంచీ అదేంటి? ఎందుకొస్తుంది? ఆ సమయంలో వచ్చే నొప్పి, అలర్జీలకు కారణాలు, తగ్గించుకోవడానికి ఏం చేయాలి... వంటి వాటి సమాచారమంతా సేకరించుకుంటూ వెళ్లారు అదితి. ఈ ప్రక్రియంతా కొన్నేళ్లపాటు సాగింది. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక అదితి ఎన్‌ఐడీ, అహ్మదాబాద్‌లో పీజీ చేశారు. తను పెరిగింది చిన్న ఊరు. కానీ పట్టణాల్లో మోడరన్‌గా కనిపించే అమ్మాయిలూ నెలసరి విషయంలో తడబడటం గమనించారు. దీన్నిలా రహస్యంగా భావించడం వల్ల ఎంతోమంది అనారోగ్యాలపాలు అవుతున్నారనీ గ్రహించారు. దీంతో తను సేకరించిన సమాచారంతో ప్రాజెక్టు చేశారు. అది అందరి మెప్పుతోపాటు ఓ విదేశీ విద్యాలయం నుంచి ఫెలోషిప్‌నీ తెచ్చిపెట్టింది. అప్పుడే ఈ సమాచారం అందరికీ అందాలనుకున్నారామె. అందుకే 2013లో ‘మెన్‌స్ట్రూపీడియా’ ప్రారంభించారు అదితి. దీనిద్వారా నెలసరి, ఆ సమయంలో పాటించాల్సిన శుభ్రత, అపోహలు వంటివాటి గురించి చెబుతూ ఒక కామిక్‌ పుస్తకాన్ని తీసుకొచ్చారు. దీనికోసం వైద్యులు, తల్లులు, టీచర్లతో కలిసి పనిచేశారు. సంస్కృతీ సంప్రదాయలను దెబ్బతీయకుండా పిల్లలకు అర్థమయ్యే భాషలో తీసుకొచ్చారు.

విదేశాలూ సంప్రదించాయి

తొలిరోజుల్లో పాఠశాలలకు వెళ్లి, వివరించడమే కాదు... పుస్తకాలనూ అందించారు. మొదట్లో కొందరు సందేహించినా పుస్తకాలను చూశాక స్వయంగా ప్రశంసించారు. ‘సైన్స్‌ పరిభాషలోనే చెప్పాలనుకోవడానికీ కారణం ఉంది. అసలు ఏం జరుగుతోందో తెలిస్తేనే అపోహలకు తావుండదు. అలాంటప్పుడు సంప్రదాయాలను వేలెత్తి చూపాల్సిన పనేముంది’ అంటారామె. దేశవ్యాప్తంగా వారి పుస్తకాలకు ఆదరణ పెరిగింది. పాతికవేల స్కూళ్లు తమ విద్యార్థులకు వీటిని అందించాయి. అలా దాదాపు కోటిన్నర మంది విద్యార్థులకు చేరువయ్యారు. 25 దేశాలకూ ఎగుమతి అయ్యాయి. దేశవిదేశాల్లో వర్క్‌షాప్‌లూ నిర్వహిస్తున్నారు అదితి. యవ్వనంలో అబ్బాయిలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన అదితి వారికోసం ‘గులు’ పేరుతోనూ, చిన్నారులకు లైంగిక వేధింపులపై అవగాహన కలిగిస్తూ ‘ఆది అండ్‌ అంకూ’, ‘ట్రూబడ్డీ’ పేర్లతోనూ సెల్ఫ్‌డెవలప్‌మెంట్‌ కామిక్‌లు తీసుకొచ్చారు. ఆసక్తి ఉన్నవారిని ఎడ్యుకేటర్స్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈమె ప్రయత్నాన్ని ప్రధాని మోదీ సైతం మెచ్చుకున్నారు. ఫోర్బ్స్, బీబీసీ, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం... ‘ఇన్‌ఫ్లుయెన్షియల్‌ ఉమన్, గోల్డ్‌షేపర్‌’గా సత్కరించాయి. ‘పీరియడ్‌ మాట్లాడకూడని అంశం కాకూడదు. ఏ అమ్మాయీ దాని కారణంగా ఇబ్బందులు పడొద్దు. ఆరోగ్యకరమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన భవిష్యత్తు వారికి అందాలి. అందుకోసమే నా ప్రయత్న’మంటోన్న అదితి ప్రయాణం స్ఫూర్తిదాయకమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్