చేయలేవన్నవారితో శభాష్‌ అనిపించుకుంది

ఎవరెస్ట్‌ ఆమె కల. కానీ వరుస ప్రమాదాలు నడవడమే గొప్ప అన్న స్థితికి తీసుకొచ్చాయి. ఇంకెవరైనా అయితే ఇంతేనని సరిపెట్టుకొని ఉండేవారేమో! మితల్‌ మాత్రం తన తలరాతను తనే రాసుకోవాలనుకుంది. చేయలేవు అన్నవారి చేతే శభాష్‌ అనిపించుకుంది.

Published : 28 Dec 2022 00:58 IST

ఎవరెస్ట్‌ ఆమె కల. కానీ వరుస ప్రమాదాలు నడవడమే గొప్ప అన్న స్థితికి తీసుకొచ్చాయి. ఇంకెవరైనా అయితే ఇంతేనని సరిపెట్టుకొని ఉండేవారేమో! మితల్‌ మాత్రం తన తలరాతను తనే రాసుకోవాలనుకుంది. చేయలేవు అన్నవారి చేతే శభాష్‌ అనిపించుకుంది.

చిన్నతనం నుంచీ మితల్‌ కాస్త బొద్దుగా ఉండేది. బీఫార్మా చదివిన తను ప్రస్తుతం పరిమళ ద్రవ్యాల తయారీ సంస్థకు రెగ్యులేటరీ స్పెషలిస్ట్‌. ఈమెది ముంబయి. 2014లో ఓ ప్రమాదం జరిగింది. దానికితోడు అధిక బరువు.. వెన్నెముకలో రెండు డిస్క్‌లూ జారిపోయాయి. మూడునెలలు మంచానికే పరిమితమైంది. కోలుకుంటోంది అనుకుంటుండగా 2017లో మళ్లీ ప్రమాదం. ఈసారీ అదే సమస్య. డిస్క్‌లు జారిపోయాయి. ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడింది. కూర్చోవడం కష్టమైంది. చిన్న వస్తువులూ మోయలేకపోయేది. కనీస అవసరాలకూ ఇంట్లో వాళ్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అందరూ ‘అయ్యో పాపం’ అంటోంటే తన నిస్సహాయతను చూసి తనకే చిరాకేసేది. ఇది చాలదన్నట్టుగా బాత్రూమ్‌లో జారిపడింది. ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది.

38 ఏళ్ల మితల్‌ షాకి ఎవరెస్ట్‌ ఎక్కాలని కల. ఒక కాలు కోల్పోయినా ఎవరెస్ట్‌ ఎక్కిన అరుణిమ గురించి చదివింది. ఆమె సాధించగలిగినప్పుడు నేనెందుకు చేయలేనని వ్యాయామాలతో తన శరీరంపై పట్టు తెచ్చుకొంది. నడక సాధ్యం కాగానే పర్వతారోహణ శిక్షణ సంస్థలో చేరింది. కొద్దిరోజుల శిక్షణయ్యాక ఒంటరిగా చిన్న చిన్న పర్వతారోహణలు మొదలుపెట్టింది. ఎన్ని సమస్యలు ఎదురైనా పంటి బిగువున భరించింది. తనపై తనకు పూర్తి నమ్మకం వచ్చాక ఎవరెస్ట్‌ ఎక్కడానికి పయనమైంది. ఈసారి ఇంట్లోవాళ్లు, బంధువులు వారించారు... ప్రాణాలకే ప్రమాదమన్నా పట్టించుకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తను కోరుకున్నట్టుగానే ఎవరెస్ట్‌ మీదకు చేరి మువ్వన్నెల జెండా ఎగురవేసింది.

‘10 రోజుల కష్టం. పైకి వెళ్లే కొద్దీ వాతావరణంలో అనేక మార్పులు, హోరు వర్షం, మంచువాన.. దుస్తులన్నీ తడిచి పోయాయి. శిఖరాగ్రానికి చేరేసరికి గుండెల్లో నొప్పి, విపరీతమైన తలనొప్పి, 102 డిగ్రీల జ్వరం.. ఆక్సిజన్‌ స్థాయిలూ పడిపోయాయి. అప్పటికీ నాకేమవుతుందో అని ఆలోచించలేదు. పర్వతారోహణ పూర్తిచేయగలనా అనేదే బెంగ. శిఖరాగ్రాన్ని చేరి మన జాతీయ జెండా ఎగుర వేశాక ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. కిందకి బయల్దేరాక తీవ్ర జ్వరం, ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతోంటే హెలికాప్టర్‌ను ఆశ్రయించా. ఆరోగ్యం సహకరించి ఉంటే దిగడమూ పూర్తయ్యేది అనుకుంటోంటే.. నాన్న ‘నిన్ను చూసి గర్వపడుతున్నా’ అన్నారు. ఆ తర్వాత బంధువుల నుంచీ ప్రశంసలు. అప్పుడు బెంగ తీరి సాధించానని అనిపించింది’ అంటూ సంబరంగా చెబుతోంది. ఇంతటితో తన ప్రయాణం ఆగదట. మరిన్ని శిఖరాలను అధిరోహిస్తాననే ఆమె... తనని చూసి నిరాశలో కూరుకుపోయిన ఒక్కరిలో సానుకూలత నిండినా చాలంటోంది. తన ప్రయాణం స్ఫూర్తిదాయకమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్