ఆడపిల్లేగా.. పోయినా పర్లేదన్నారు!

ఓ సాధారణ పేదింటి అమ్మాయి తను. చేతులూ లేవు. అయితేనేం నేనెవరికీ తీసిపోననే తత్వమామెది. తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల. ఆ క్రమంలో ప్రముఖుల ప్రశంసలూ అందుకొంది. తాజాగా తన పోరాట పటిమకు అంతర్జాతీయ గుర్తింపూ దక్కింది. కొవ్వాడ స్వప్నిక.. వసుంధర పలకరించగా తన కథ పంచుకుందిలా..

Updated : 23 Mar 2023 07:32 IST

ఓ సాధారణ పేదింటి అమ్మాయి తను. చేతులూ లేవు. అయితేనేం నేనెవరికీ తీసిపోననే తత్వమామెది. తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల. ఆ క్రమంలో ప్రముఖుల ప్రశంసలూ అందుకొంది. తాజాగా తన పోరాట పటిమకు అంతర్జాతీయ గుర్తింపూ దక్కింది. కొవ్వాడ స్వప్నిక.. వసుంధర పలకరించగా తన కథ పంచుకుందిలా..

మాది శ్రీకాకుళంలోని నాయిరాల వలస. అమ్మ సరస్వతి, నాన్న అప్పారావు దినసరి కూలీలు. ముగ్గురమ్మాయిలం. చిన్నప్పుడే నాన్న చనిపోతే కూలిచేసి అమ్మే మమ్మల్ని పెంచింది. రోజుకి ఒక పూట భోజనంతో సరిపెట్టుకున్న రోజులెన్నో! అప్పుడు నేను అయిదో తరగతి. అమ్మ హైదరాబాద్‌లో భవన కూలిగా చేరింది. నేనూ అమ్మతోపాటే వెళ్లా. ఆడుకుంటూ కరెంట్‌ తీగకి తగిలితే షాక్‌ కొట్టింది. దూరంగా స్పృహ తప్పి పడిపోయా. గమనించే సరికే ఆలస్యమైంది. దుస్తులే కాదు నా రెండు చేతులూ కాలి నల్లగా మారాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళితే ఒక రోజంతా పట్టించుకోలేదు. ప్రైవేటు ఆసుపత్రికి మారిస్తే ‘రెండు చేతులూ తీసేయాలి. లేదంటే ప్రాణానికే ప్రమాద’మన్నారు. ‘ఆడపిల్లేగా.. పోయినా ఫర్లేదు వదిలేయ’మన్నారు బంధువులు. అమ్మ మాత్రం పట్టుబట్టి బతికించుకుంది. అయితే ఒక చేతిని భుజం నుంచీ, రెండోదాన్ని మోచేతి నుంచీ తొలగించారు.

ఊరికి తిరిగొచ్చేశాం. కోలుకున్నాక చదువుకుందామంటే ‘చేతుల్లేవు.. ఎలా రాస్తా’వని ఎవరూ చేర్చుకోలేదు. పట్టుబట్టి కాళ్లతో ప్రయత్నించా.. కుదర్లేదు. ఈసారి నోట్లో పెన్‌ పెట్టుకొని సాధన చేసి విజయం సాధించా. ఇంకేం.. స్కూల్లో చేర్చుకున్నారు. నా ఆనందం మాటల్లో చెప్పలేను. కానీ అమ్మ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఏడు తర్వాత చదువు మానేయమంది. చెల్లి కూడా అమ్మతో కూలికెళ్లడం మొదలుపెట్టింది. నా పరిస్థితి తెలిసి ఓ సామాజిక కార్యకర్త సాయం చేశారు. అలా ఇంటర్‌. ఆపై కళాశాల ప్రిన్సిపల్‌ చేయూతతో డిగ్రీ పూర్తిచేశా. దీనికోసం రోజూ 4 కిలోమీటర్లు నడిచేదాన్ని.

దత్తత తీసుకున్నా!

నా పనులన్నీ నేనే చేసుకొనేలా అమ్మ నేర్పింది. ఎవరిపైనా ఆధారపడకూడదు అనేది. కాలేజీలో ఎవరైనా జాలిగా చూసినా, సానుభూతి చూపినా నచ్చేది కాదు. అదే ఏదైనా సాధించాలన్న కోరిక కలిగించింది. నోటితో చిత్రాలు వేయడం మొదలుపెట్టా. వాటిని నా సోషల్‌ మీడియా ఖాతాల్లో ఉంచేదాన్ని. మెచ్చి చాలామంది డబ్బులిచ్చి వేయించుకునేవారు. కొందరు నటీనటులవి వేసి స్వయంగా వారికందించా. డ్యాన్స్‌ నేర్చుకొని కొన్ని టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నా. ఓ గాజుల దుకాణాన్ని నిర్వహిస్తున్నా. అమ్మానాన్న లేని ఒకమ్మాయిని దత్తత తీసుకొని చదివిస్తున్నా.

ఆయన ట్వీట్‌తో..

2020లో పవన్‌ కల్యాణ్‌ గారు నా గురించి ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. అప్పుడే పాత్రికేయులు సుశీల్‌రావు పరిచయమయ్యారు. నా డ్యాన్స్‌, అమ్మతో అనుబంధం, ఆవులతో గడపడం వంటివన్నీ సోషల్‌మీడియాలో పంచుకుంటుంటా. యూట్యూబ్‌లో లక్షన్నర, ఇన్‌స్టాలో 1.13 లక్షలు, మోజ్‌లో 5.5 లక్షల ఫాలోయర్లున్నారు. వాటిని ఆయన చూసి ప్రోత్సహించేవారు. నెలక్రితం వాటన్నింటితో డాక్యుమెంటరీ తీస్తున్నానని ఆయనంటే సరేనన్నా. ‘స్వప్నిక’ పేరుతో తీసి ఇండియన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి పంపారు. వివిధ దేశాలు పాల్గొన్న దానిలో ‘స్వప్నిక’కు సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌- స్పెషల్‌ ఫెస్టివల్‌ మెన్షన్‌ అవార్డు లభించింది. నా కథ కొందరికైనా స్ఫూర్తిగా నిలుస్తుందనుకున్నా.. అవార్డు గెలుచుకోవడం సంతోషంగా ఉంది. నన్ను నేనెప్పుడూ తక్కువగా ఊహించుకోను. ఎవరైనా చూసినా పట్టించుకోను. చేతుల్లేకపోతేనేం.. నేనెవరికీ తీసిపోననుకుంటా. ఎదగాలి, మంచి స్థానానికి చేరుకోవాలనే ప్రయత్నిస్తుంటా. ఈ అవార్డు నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. తోబుట్టువులిద్దరికీ పెళ్లైంది. ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని కోరిక. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి, ఉన్నత చదువులు చదవాలన్నది నా కల.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911 కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్