స్కూల్లో చదువుకోలేదు.. అయినా ఈ స్వరూప ట్యాలెంట్ల పుట్ట..!

మనం చాలా పనులను కుడి చేత్తో చేస్తుంటాం. కొంతమంది వాటిని ఎడమ చేత్తో చేస్తుంటారు. కానీ అవే పనులను రెండు చేతులతో చేసేవారు మాత్రం అరుదుగా ఉంటారు. వీరిని సవ్యసాచిగా పిలుస్తుంటారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది మంగళూరుకు చెందిన 17 ఏళ్ల ఆది స్వరూప. ఈ అమ్మాయి రెండు చేతులతో ఏక కాలంలో పదాలను రాస్తూ ఆశ్చర్యపరుస్తోంది. వీటికి తోడు మిమిక్రీ, పెయింటింగ్‌, బీట్‌ బాక్సింగ్‌, యక్షగానం, భరతనాట్యం వంటి కళల్లో....

Published : 10 Feb 2023 20:45 IST

(Photos: Instagram)

మనం చాలా పనులను కుడి చేత్తో చేస్తుంటాం. కొంతమంది వాటిని ఎడమ చేత్తో చేస్తుంటారు. కానీ అవే పనులను రెండు చేతులతో చేసేవారు మాత్రం అరుదుగా ఉంటారు. వీరిని సవ్యసాచిగా పిలుస్తుంటారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది మంగళూరుకు చెందిన 17 ఏళ్ల ఆది స్వరూప. ఈ అమ్మాయి రెండు చేతులతో ఏక కాలంలో పదాలను రాస్తూ ఆశ్చర్యపరుస్తోంది. వీటికి తోడు మిమిక్రీ, పెయింటింగ్‌, బీట్‌ బాక్సింగ్‌, యక్షగానం, భరతనాట్యం వంటి కళల్లో రాణిస్తూ తను కేవలం సవ్యసాచి మాత్రమే కాదు.. అంతకు మించి అనేలా తనను తాను నిరూపించుకుంటోంది. ఈ క్రమంలో ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించడమే కాకుండా ఇతరత్రా పలు రికార్డులనూ సొంతం చేసుకుంది. చదువంటే కేవలం పాఠశాలలో బోధించే విద్య మాత్రమే కాదనే తన తల్లిదండ్రుల విశ్వాసానికి అనుగుణంగా సంప్రదాయ విద్యను అభ్యసించకపోయినా, వివిధ కళల్లో తనదైన నైపుణ్యంతో రాణిస్తున్న స్వరూప విజయ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం!

సంప్రదాయ విద్యకు ప్రత్యామ్నాయంగా..

ఆది స్వరూప తల్లిదండ్రులు గోపద్కర్, సుమద్కర్. స్వరూప చిన్నప్పటి నుంచే ప్రతిభావంతురాలు. తను ఏడాదిన్నరేళ్ల వయసులోనే చదవడం, రెండున్నరేళ్ల వయసులోనే రాయడం నేర్చుకుంది. 17 ఏళ్ల స్వరూప ఇంతవరకు సంప్రదాయ విద్యను అభ్యసించలేదు. చదువంటే కేవలం పాఠశాలలో బోధించే విద్య కాదనేది ఆమె తల్లిదండ్రుల అభిప్రాయం. దాంతో వారు 1993లోనే ‘స్వరూప అధ్యయన కేంద్రం’ అనే పేరుతో ఓ సంస్థను స్థాపించారు. దీని ద్వారా సంప్రదాయ విద్యకు భిన్నంగా విద్యార్థుల్లో ఉన్న పెయింటింగ్, మిమిక్రీ, డ్యాన్స్‌.. వంటి నైపుణ్యాలను వెలికి తీస్తూ వారికి ఆసక్తి ఉన్న అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. స్వరూపకు కూడా తాము నమ్మిన సిద్ధాంతంలోనే విద్యను అందించారు.

వీడియో వైరల్‌ కావడంతో...

తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయని స్వరూప తనలోని నైపుణ్యాలను వెలికితీయడం ప్రారంభించింది. అలా రెండు చేతులతో ఒకే సమయంలో పదాలను రాయడంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆ తర్వాత ఒకే సమయంలో కన్నడ, ఇంగ్లీష్‌ పదాలను రాయడం.. తర్వాత 11 రకాలుగా పదాలను రాయడంలో నైపుణ్యం సంపాదించింది. ఇందులో యూని డైరెక్షన్‌, లెఫ్ట్‌ హ్యాండ్‌ స్పీడ్‌, రైట్‌ హ్యాండ్‌ స్పీడ్‌, రివర్స్‌ రన్నింగ్‌, మిర్రర్‌ ఇమేజ్, హెటరో టాపిక్, హెటరో లింగ్విస్టిక్‌, ఎక్స్‌ఛేంజ్‌, డ్యాన్సింగ్‌, బ్లైండ్‌ ఫోల్డింగ్‌ వంటి శైలులు ఉన్నాయి.

రెండు చేతులతో రాయగల నైపుణ్యంతో స్వరూప ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. రెండు చేతులతో ఒక్క నిమిషంలో 45 పదాలు రాసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ‘లతా ఫౌండేషన్‌ ఆర్గనైజేషన్‌’ దీనిని ప్రపంచ రికార్డుగా గుర్తిస్తూ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఈ రికార్డు 2020లోనే సాధించినప్పటికీ ఆమె నైపుణ్యం ఓ వీడియో ద్వారా ప్రపంచానికి ఇటీవలే మరోసారి తెలిసింది. స్వరూప రెండు చేతులతో బోర్డుపై రాస్తున్న ఓ వీడియోని ఓ వ్యక్తి ఇటీవలే ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా.. అందుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. నాలుగు రోజుల్లోనే ఈ వీడియోని 32 లక్షల మంది వీక్షించారు.

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో..

స్వరూప విజువల్ ఆర్ట్స్ లోనూ సిద్ధహస్తురాలు. ఈ క్రమంలో గత సంవత్సరం ‘ట్రాప్‌డ్‌ ఎడ్యుకేషన్‌’ అనే థీమ్‌తో 8 చిత్రాలను గీసింది. వీటిలో మరో 93 వేల మినియేచర్‌ చిత్రాలను గీసింది. ఇందులో 10వ తరగతికి చెందిన ఆరు సబ్జెక్టుల్లోని పూర్తి సిలబస్‌తో పాటు ప్రస్తుత విద్యావ్యవస్థలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చిత్రాలుగా పొందుపరిచింది. ఇందుకు గాను ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించుకుంది.

వివిధ కళల్లో రాణిస్తూ..

స్వరూప ట్యాలెంట్ల పుట్ట అనడంలో ఎలాంటి సందేహం లేదు. వివిధ కళల్లో నైపుణ్యం ఈ అమ్మాయి సొంతం.

స్వరూపకు మిమిక్రీ, బీట్‌ బాక్సింగ్‌లో కూడా నైపుణ్యం ఉంది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు చేపట్టిన ‘ఎడ్యుకేషన్‌ అవేర్‌నెస్‌ జాత’ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక మొత్తం పర్యటించి, 1600కు పైగా ట్యాలెంట్‌ షోలు చేసింది.

స్వరూపకు యక్షగానం లోనూ ప్రవేశం ఉంది. ఆమె గత ఏడు సంవత్సరాలుగా యక్షగానం నేర్చుకోవడంతో పాటు 50కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది.

స్వరూపకు మ్యూజిక్‌ అంటే కూడా ఇష్టం. ఆమె పండిట్ రవి కిరణ్‌ మణిపాల్‌ దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటోంది. అలాగే గిటార్‌, కీబోర్డ్‌ వంటివి ఉపయోగించడమూ నేర్చుకుంటోంది.

స్వరూప రచయిత్రి కూడా. ఆమె కొన్ని కథలు, నవలలు కూడా రాసింది. తను వేసిన పలు పెయింటింగ్స్‌ మంగళూరులోని ప్రసాద్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఉన్నాయి.

సంప్రదాయ విద్యలో ప్రవేశం లేని స్వరూప ఎనిమిదేళ్ల వయసులోనే ప్రైవేటుగా 10వ తరగతి పరీక్షలు రాయడానికి ప్రయత్నించింది. అయితే అందుకు వయసు సరిపోకపోవడంతో ఇటీవలే మరోసారి ప్రయత్నించింది. ఇన్ని కళల్లో నైపుణ్యం ఉన్న స్వరూపను నీ భవిష్యత్తు లక్ష్యం ఏంటని అడిగితే ‘ఐఏఎస్‌ కావడం.. గిన్నిస్‌ రికార్డ్స్‌ సాధించడం’ అని ఠక్కున చెప్పేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్