Published : 10/10/2022 13:15 IST

నా భర్తకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారు..!

నాకు పెళ్లై పదేళ్లవుతోంది. పిల్లలు లేరు. అన్ని ప్రయత్నాలు చేశాం. కానీ ఫలితం లేదు. దాంతో మా అత్తమామలు నా భర్తకు రెండో పెళ్లి చేయాలని భావిస్తున్నారు. నా భర్త మనసులో ఏముందో తెలియడం లేదు. బంధువుల్లో ఎవరో ఒకరి బిడ్డను దత్తత తీసుకుందామని నేనంటున్నా.. చూద్దాంలే అంటున్నారు. కానీ, సరే అనడం లేదు. నా భర్త రెండో పెళ్లికి ఒప్పుకుంటాడేమోనని చాలా భయంగా ఉంది. అసలు ఈ విషయం గురించి ఆయనతో ఎలా మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఈ మధ్య చాలా ఆందోళనగా ఉంటోంది. సరిగా నిద్ర కూడా పట్టడం లేదు. మా చెల్లితో ఈ విషయం చెబితే ‘నువ్వు విడాకులు ఇవ్వకుండా బావ రెండో పెళ్లి చేసుకునే అవకాశం లేదు. నువ్వు భయపడకు’ అంటోంది. నా భర్తతో ఈ విషయం గురించి నేరుగా మాట్లాడాలా? లేదా మౌనంగా ఉండడం మంచిదా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. పెళ్లై పది సంవత్సరాలవుతోంది. పిల్లలు కలగడం లేదు. కాబట్టి ఏం చేద్దాం? ఎవరినైనా దత్తత తీసుకుందామా? వంటి విషయాల గురించి మీ ఇద్దరూ ఈపాటికే వివరంగా చర్చించి ఉండాల్సింది. ఇప్పటికీ ఆయన మనసులో ఏముందో తెలియదని చెబుతున్నారు. కాబట్టి, ముందుగా మీ భర్తతో ఈ విషయాల గురించి చర్చించే ప్రయత్నం చేయండి. మొదట పిల్లల గురించి ఒక అభిప్రాయానికి వస్తే ఆ తర్వాత మీ వారు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లేదా? అనే దానిపై చర్చించాలి. ఒకవేళ ఇలా చర్చించే అవకాశం ఇద్దరి మధ్య లేదని అనుకుంటే సన్నిహితంగా ఉండే వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. మీ చెల్లెలు చెప్పినట్లు- చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా మీ వారు రెండో పెళ్లి చేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయంలో ఆందోళన వద్దు.

ఇక- ఈ మధ్య చాలా ఆందోళనగా ఉంటోంది. సరిగా నిద్ర కూడా పట్టడం లేదని చెబుతున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇద్దరూ కలిసి సైక్రియాట్రిస్ట్‌ను సంప్రదించవచ్చు. అప్పుడు సైక్రియాట్రిస్ట్‌ ఇద్దరితో మాట్లాడతారు. ఒకవేళ అవసరం అనిపిస్తే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు పంపిస్తారు. అప్పుడు మీ మనసులో ఏముంది? మీ వారి మనసులో ఏముంది? ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని