Published : 22/12/2022 00:31 IST

నాలుగేళ్లు నిద్రే లేదు!

అనుభవపాఠం

అందరిలాగే నాకూ సినిమాలన్నా, తారలన్నా పిచ్చి. మా కుటుంబంలో అందరూ ఇంజినీర్లే. మా పెద్ద కాలక్షేపం.. సినిమాలు, సినిమా తారల కబుర్లే. ఇంజినీరింగ్‌ అయ్యాక ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్లా. అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా స్థిరపడ్డా. ఇప్పుడంటే సినిమా తాజా కబుర్లన్నీ గూగుల్‌లో దొరికేస్తున్నాయి. ఒకప్పుడలా కాదు. ఇతర దేశాల్లోని వారికి ఆ సమాచారం దొరకడం కష్టమే! అపుడు నేనే అందరికీ అందుబాటులో ఉండేలా ఓ వెబ్‌సైట్‌ ప్రారంభిస్తే అన్న ఆలోచన వచ్చింది. మా వాళ్లందరూ భయపడ్డారు. నిరాశ పరచలేదు కానీ.. ‘రాణిస్తావో లేదో తెలియని దానికోసం రిస్క్‌ చేస్తున్నావేమో.. ఆలోచించుకో’ అన్నారు. సొంతంగా వెబ్‌సైట్‌ డిజైన్‌ చేసి 2007లో ‘పింక్‌విల్లా’ ప్రారంభించా. దీనిలో తారల సమాచారమేదైనా ఎవరైనా పంచుకోవచ్చు. ఏడాదిలోనే రోజుకు 35 వరకూ ఆర్టికల్స్‌ వచ్చే స్థాయికి చేరాం. వీక్షణలు లక్షల్లోనే! 2009లో ఒక హీరోయిన్‌ తాజా అప్‌డేట్‌ పోస్టు చేసినప్పుడు పత్రికలే వెబ్‌సైట్‌ పేరుతో సహా ప్రచురిస్తామనడంతో అంగీకరించా. ఆ తర్వాతి నుంచి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక్కడి వరకూ చేరుకోవడానికి నిద్రలేని రాత్రులెన్ని గడిపానో! పగలు ఉద్యోగం, రాత్రి వెబ్‌సైట్‌ పనులు చూసుకుంటూ నాలుగేళ్లు సరిగా నిద్రే పోలేదు. రోజుకు మిలియన్లలో వీక్షణలు వస్తోంటే.. ఇచ్చే సమాచారంపై దృష్టి పెట్టాలనిపించి, ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నా. తారలనే నేరుగా ఇంటర్వ్యూలూ చేశా. ఉద్యోగమూ మానేశా.. ఈసారి ఎవరూ కాదనలేదు. వాళ్లకా భరోసా కల్పించడమే కారణం. ఏదైనా ప్రయత్నించే ముందు రిస్క్‌ సహజం. దాన్ని దాటేవరకూ ఓపిక పడితే చాలు.. మీ వెన్నంటే నిలిచే వారెందరో.

- నందినీ షెనాయ్‌, సీఈఓ, పింక్‌విల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి