Miss London: మేకప్ లేకుండానే ‘అందాల’ పోటీ గెలిచేసింది!

అందాల పోటీలంటే లేయర్ల కొద్దీ మేకప్‌ వేసుకొని ర్యాంప్‌పై హొయలుపోయే ముద్దుగుమ్మలే మన కళ్ల ముందు మెదులుతారు. అయితే ఇలా కృత్రిమ అందం కంటే సహజ సౌందర్యానికే ప్రాధాన్యమివ్వాలనుకున్నారు ‘మిస్‌ లండన్‌’ నిర్వాహకులు.

Published : 07 Oct 2023 17:17 IST

(Photos: Instagram)

అందాల పోటీలంటే లేయర్ల కొద్దీ మేకప్‌ వేసుకొని ర్యాంప్‌పై హొయలుపోయే ముద్దుగుమ్మలే మన కళ్ల ముందు మెదులుతారు. అయితే ఇలా కృత్రిమ అందం కంటే సహజ సౌందర్యానికే ప్రాధాన్యమివ్వాలనుకున్నారు ‘మిస్‌ లండన్‌’ నిర్వాహకులు. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలి ‘మేకప్‌ రహిత అందాల పోటీ’ని నిర్వహించిందీ సంస్థ. తాజాగా ఈ పోటీలో గెలిచి.. మేకప్‌ వేసుకోకుండానే అందాల పోటీ నెగ్గిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది ఆ దేశానికి చెందిన నటాషా బెరెస్‌ఫోర్డ్‌. ‘సహజసిద్ధమైన అందంతోనే మనలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందం’టోన్న ఈ పాతికేళ్ల బ్యూటీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

నో మేకప్‌.. స్ట్రిక్ట్‌ రూల్!

మహిళల బాహ్య, అంతఃసౌందర్యాల్ని ప్రతిబింబిస్తాయి అందాల పోటీలు. అయితే ఇందులో పాల్గొనే పోటీదారులంతా ప్రతి రౌండ్లోనూ చక్కటి కాస్ట్యూమ్స్‌, వాటికి తగ్గట్లుగా మేకప్‌ వేసుకొని మెరిసిపోతుంటారు. అయితే మిస్‌ లండన్‌ నిర్వాహకులు ఈసారి పోటీల్లో పలు మార్పులు చేయాలనుకున్నారు. మేకప్‌ రహితంగా, పూర్తి సహజసిద్ధమైన లుక్‌కే ప్రాధాన్యమివ్వాలనుకున్నారు. ఇందులో భాగంగానే.. కంటెస్టెంట్లను ఎలాంటి ఫిల్టర్స్‌ ఉపయోగించకుండా, కాస్మెటిక్స్‌ వేసుకోకుండా, ఎడిట్‌ చేయకుండా.. సహజమైన లుక్‌లో దిగిన ఫొటోల్నే పంపించమని కోరారు. కనీసం లిప్‌గ్లాస్‌ ఉన్న ఫొటోల్ని కూడా వారు ఈసారి పోటీల కోసం అనుమతించలేదు.

‘భారీగా మేకప్‌ వేసుకున్న కృత్రిమ అందం కంటే.. పోటీదారుల సహజ సౌందర్యం, నైతిక విలువలు, చదువు, వృత్తిఉద్యోగాలకే ఈసారి పూర్తి ప్రాధాన్యమిచ్చాం. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, స్వీయ ప్రేమను పెంపొందించడమే దీని ముఖ్యోద్దేశం..’ అంటూ ఈ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇలా మేకప్‌ రహితంగా తొలిసారి నిర్వహించిన ఈ అందాల పోటీల్లో విజేతగా నిలిచి.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది లండన్‌కు చెందిన నటాషా బెరెస్‌ఫోర్డ్.

లేస్‌ గౌన్‌లో దేవకన్యలా!

‘మిస్‌ లండన్‌’ పోటీల తుది రౌండ్లో తెలుపు రంగు లేస్‌ గౌన్‌లో దేవకన్యలా మెరిసిపోయింది నటాషా. సహజంగానే ఫెయిర్‌గా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. ఈ బొహొ అటైర్‌లో, అదీ మేకప్‌ లేకుండానే తన అందం, ఆత్మవిశ్వాసంతో జడ్జిలను కట్టిపడేసింది. 18 మంది పోటీదారుల్ని వెనక్కి నెట్టి.. కిరీటాన్ని తలపై అలంకరించుకుందీ చిన్నది. వృత్తిరీత్యా డెంటల్‌ నర్స్‌ అయిన నటాషా.. 2021లో ‘రాయల్‌ లండన్‌ డెంటల్‌ హాస్పిటల్‌’లో కెరీర్‌ ప్రారంభించింది. అక్కడ ఎంతోమంది చిన్నారులకు దంత సంబంధిత చికిత్సలు అందించింది. ప్రస్తుతం లండన్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోన్న ఈ బ్యూటీ.. ‘తొలి మేకప్‌ రహిత అందాల కిరీటాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. అందం విషయంలో కచ్చితమైన కొలతలు, ప్రమాణాలంటూ ఏవీ ఉండవని నా నమ్మకం. ఈ విషయం నిరూపించడానికే అందాల పోటీలో మేకప్‌ లేకుండా పాల్గొన్నా.. ఎలా ఉన్నా మనల్ని మనం స్వీకరించగలగడం, ఆత్మ సౌందర్యాన్ని ప్రతిబింబించడమే అసలైన సౌందర్యం..’ అంటోన్న నటాషా ఈ ఏడాది చివర్లో జరగబోయే ‘మిస్ ఇంగ్లండ్‌’ పోటీల కోసం సిద్ధమవుతోంది.

మనసున్న నటాషా!

మేకప్ లేకుండా ఉన్నప్పుడే అమ్మాయిల్లో అందం, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతాయంటోన్న నటాషా.. తన గెలుపుతో మరింతమంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపాలనుకుంటున్నట్లు చెబుతోంది.

‘ప్రైవేట్‌, అత్యవసర వైద్య సేవల్లో భాగంగా గత కొన్నేళ్లుగా ఎన్‌హెచ్‌ఎస్‌తో కలిసి పనిచేస్తున్నా. నా వృత్తే నాకు దక్కిన గొప్ప బహుమానం. భవిష్యత్తులో డెంటల్‌ రేడియోగ్రఫీ, ఓరల్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నా. అలాగే నిరాశ్రయులకు, పేదలకు, శరణార్థులకు, క్యాన్సర్‌ పేషెంట్స్‌కు, వివిధ రకాల వేధింపుల నుంచి బయటపడిన వారికి.. ఉచితంగా దంత వైద్య సేవలందిస్తోన్న ‘Dentaid’ అనే సంస్థలో వలంటీర్‌గా చేరాలన్న ఆలోచన కూడా ఉంది. ఇక ఓ అందాల పోటీ విజేతగా.. సహజ సౌందర్యంపై తోటి అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి రగిలించాలనుకుంటున్నా..’ అంటోంది నటాషా.


ఇక.. వయసుతో పనిలేదు!

మొన్నటిదాకా అందం, చర్మఛాయ, శరీరాకృతి, బరువు, ఎత్తు.. తదితర విషయాల్లో సమాజం నిర్దేశించిన ప్రమాణాల్నే అనుసరించిన అందాల పోటీల్లో.. గత కొద్ది రోజులుగా పలు మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మేకప్‌ లేకుండా ‘మిస్‌ లండన్‌’ పోటీలు జరగ్గా.. ఇటీవలే ‘మిస్‌ యూనివర్స్‌’ సంస్థ అందాల పోటీల్లో పాల్గొనడానికి ఇప్పటివరకు ఉన్న వయోపరిమితిని పూర్తిగా ఎత్తేయడం అందాల పోటీల చరిత్రలోనే ఓ గొప్ప మార్పని చెప్పచ్చు. సాధారణంగా ఇప్పటివరకు ఈ పోటీల్లో 18-28 ఏళ్ల లోపు వారే పాల్గొనాలన్న నియమం ఉండేది. కానీ తాజా మార్పుతో ‘18 ఏళ్లు పైబడిన ఏ వయసు అమ్మాయైనా, మహిళైనా ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హురాలే!’ అని ఈ సంస్థ సూచించింది. దీనిపై చాలామంది మహిళలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ గొప్ప మార్పుతో వచ్చే నెలలో జరగబోయే ‘విశ్వ సుందరి’ పోటీలపై అందరిలో మరింత ఆసక్తి నెలకొంది. ఏదేమైనా అందాల పోటీల విషయంలో వస్తోన్న ఈ ఒక్కో మార్పూ.. మహిళా సాధికారతకు నిదర్శనమని చెప్పడంలో సందేహం లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్