Updated : 23/12/2022 00:51 IST

మంచి అమ్మని కాదన్నారు!

అనుభవపాఠం

నాన్న నేవీ అధికారి. ఆయన ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగా. అందుకే పెద్దగా స్నేహితులు ఉండేవారు కాదు. అలాగని ఎప్పుడూ బాధ పడలేదు. నచ్చిందా ఎంత కష్టమైనా చేస్తా. సవాళ్లెదురైనా దూసుకెళ్లే మనస్తత్వం నాది. ఆర్థిక రంగంలో స్థిరపడదామనుకున్న నేను అనుకోకుండా రేడియో పరిశ్రమలోకి వచ్చా. అదేమో బాగా నచ్చింది. కెరియర్‌ ఉన్నపళంగా మార్చుకోవడం సులువు కాదన్నారంతా. నా మీద నాకు నమ్మకం ఉంది.. కొనసాగించా. ఆర్‌జేగా మొదలై సీఓఓ స్థాయికి చేరుకున్నా. ఎఫ్‌ఎం అంటే బాలీవుడ్‌ పాటలకే ప్రాధాన్యముండే చోట దక్షిణాది పాటలనూ తీసుకొచ్చా. ప్రైవేటు రేడియో స్టేషన్‌ దేశమంతా విస్తరించేలా చేశా. ఇదంతా సులువేమీ కాలేదు. నచ్చిన పని కదా ఉత్సాహంగా దాటుకుంటూ వచ్చా. రెడ్‌ ఎఫ్‌ఎం స్టేషన్లు ప్రముఖ నగరాలన్నింటిలో ఏర్పాటు చేస్తున్నప్పుడు బాబు పుట్టాడు. నాకేమో విపరీతమైన ప్రయాణాలు.. అది చూసి ‘నువ్వు మంచి అమ్మవి కాదు’ అన్నారు చాలామంది. అది విని నాకూ తెలియని అపరాధ భావన. పరిష్కారమేంటంటే ఉద్యోగం వదిలేయడమే అన్నారు. పిల్లలు పెద్దయ్యాక స్కూలు, ఆటలంటూ వాళ్ల జీవితంతో వాళ్లు బిజీ అయిపోతారు. అప్పుడు ‘ఖాళీతనం’ ఇబ్బంది పెడుతుంది కదా! నా జీవితం అలా ముగియకూడదనుకున్నా. నా కలలు, బాబు సంరక్షణ రెంటికీ ఇబ్బంది కలగని మార్గాలను అన్వేషించా. ఇప్పటికీ ఎక్కువరోజులు ప్రయాణాల్లోనే ఉంటా. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం పూర్తి ధ్యాస కుటుంబానికే! అలా నా లోటు భర్తీ చేస్తున్నా. పిల్లలు మన ప్రేమకు ప్రతిరూపంలా తోచాలి.. కెరియర్‌కి అడ్డులా కాదు. ఎవరి కోసమో కలల్ని పక్కన పెట్టకండి. కాస్త ఆలోచిస్తే చాలు.. మార్గం దొరుకుతుంది. దాని కోసం ప్రయత్నించండి.

- నిషా నారాయణన్‌, సీఓఓ, రెడ్‌ ఎఫ్‌ఎం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి