ఆ నిర్లక్ష్యం.. వ్యాపారవేత్తను చేసింది!

మన దేశం ప్రాచీన కాలం నాటి ఆరోగ్య, సౌందర్య ప్రమాణాలకు పుట్టినిల్లు. అయితే కొత్త పోకడల వల్ల అవి క్రమంగా కనుమరుగైపోతున్నాయి. కానీ కొందరు వాటిని తిరిగి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. వాటినే తమ వ్యాపార సూత్రాలుగా మలచుకుంటున్నారు. రితిక జయస్వాల్‌ ఇదే చేసింది.

Published : 08 Apr 2024 19:12 IST

(Photos: Instagram)

మన దేశం ప్రాచీన కాలం నాటి ఆరోగ్య, సౌందర్య ప్రమాణాలకు పుట్టినిల్లు. అయితే కొత్త పోకడల వల్ల అవి క్రమంగా కనుమరుగైపోతున్నాయి. కానీ కొందరు వాటిని తిరిగి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. వాటినే తమ వ్యాపార సూత్రాలుగా మలచుకుంటున్నారు. రితిక జయస్వాల్‌ ఇదే చేసింది. ఒకానొక సమయంలో కెరీర్‌ హడావిడిలో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఆమె.. దాని ప్రభావం అందం పైనా పడడం గుర్తించింది. ఆపై రియలైజై తన తాతగారి ప్రోత్సాహంతో సహజసిద్ధమైన వీగన్‌ సౌందర్యోత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రాచీన సౌందర్య పద్ధతులకు, ఆధునిక ప్రమాణాల్ని జతచేస్తూ తాను తయారుచేస్తోన్న ఈ న్యాచురల్‌ బ్యూటీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. ‘అందమంటే బయటికి కనిపించేది కాదు.. లోలోపలి నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అసలైన సౌందర్యం ఇనుమడిస్తుంది..’ అంటోన్న రితిక బిజినెస్‌ జర్నీ ఇది.

భారత్‌లో పుట్టి పెరిగిన రితిక ప్రస్తుతం న్యూయార్క్‌లో స్థిరపడింది. ఆమెది వ్యాపారవేత్తల కుటుంబం. చిన్న వయసు నుంచే ఈ వాతావరణంలో పెరిగిన తాను కూడా భవిష్యత్తులో వ్యాపారవేత్తగా స్థిరపడాలనుకుంది. ఈ ఆలోచనతోనే ఎంబీఏ పూర్తి కాగానే తన కుటుంబ వ్యాపారంలో ఐదేళ్ల పాటు పనిచేసింది. నిజానికి ఆమెకు ఫ్యాషన్‌ రంగమంటే మక్కువ. ఈ క్రమంలోనే న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక ‘పార్సన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌’లో ఫ్యాషన్‌ కోర్సు పూర్తి చేశాక స్థానికంగానే పలు ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్లతో కలిసి పనిచేసింది రితిక.

విపాసన కోర్సు.. వర్కవుట్‌ అయింది!

‘నచ్చిన రంగం కదా.. మొదట్లో ఎంతో ఉత్సాహంగా పనిచేసేదాన్ని. కానీ క్రమంగా ఆ ఉత్సాహం కనుమరుగైంది.. పనిలో ఆసక్తి తగ్గిపోవడం, ఒంట్లో నీరసం ఆవహించేవి. ఇందుకు కారణం.. కెరీర్‌ ధ్యాసలో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమేనని ఆ తర్వాత తెలుసుకున్నా. దీనికి తోడు ఒత్తిడి, యాంగ్జైటీలతోనూ సతమతమయ్యా. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు పలు మెడిటేషన్‌ పద్ధతులు పాటించా. కానీ పెద్దగా ఫలితం కనిపించలేదు. ఆ సమయంలో ఫ్రెండ్‌ సలహా మేరకు విపాసన మెడిటేషన్‌ కోర్సులో చేరాను. పది రోజులు రోజుకు 10 గంటల పాటు రెండో వ్యక్తితో సంబంధం లేకుండా ఈ పద్ధతిని సాధన చేయాల్సి ఉంటుంది. నాతో చేరిన చాలామంది ఈ కోర్సును మధ్యలోనే వదిలేసినా.. నేను మాత్రం చివరిదాకా కొనసాగించా. దీనివల్ల నా మానసిక ఆరోగ్యం మెరుగుపడింది. శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి పోషకాహారంపై దృష్టి పెట్టా. ఇలా నేను పాటించిన ఈ చిట్కాలన్నీ అటు ఆరోగ్యాన్ని, ఇటు అందాన్నీ ద్విగుణీకృతం చేయడం గమనించా. అప్పుడే అనిపించింది.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సౌందర్యోత్పత్తులు లోలోపలి నుంచి అందాన్ని పెంపొందించేందుకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? అని! దీని గురించి ఓ చిన్న పాటి పరిశోధన చేయగా.. చాలావరకు రసాయనాలతో కూడిన సౌందర్యోత్పత్తులే ఉన్నట్లు, వాటినే ఎక్కువమంది వాడుతున్నట్లు అర్థమైంది. వీటికి బదులుగా సహజసిద్ధమైన బ్యూటీ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకురాగలిగితే.. లోలోపలి నుంచి సహజ సౌందర్యాన్ని అందరికీ చేరువ చేయచ్చనిపించింది..’ అంటోంది రితిక.

‘సహజ’ మంత్రా!

ఇలా తన మనసులోని ఆలోచనను తన తాతగారి ముందుంచిన రితికకు ఆయన నుంచి అన్ని విధాలుగా మద్దతు లభించింది. ఈ ప్రోత్సాహంతోనే 2019లో ‘నరిష్‌ మంత్రా’ పేరుతో ఓ బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించింది రితిక.

‘నరిష్‌ మంత్రా బ్రాండ్‌ ప్రారంభించడానికి ముందు.. మన దేశ ప్రాచీన సౌందర్య పద్ధతులు, ఆయా పదార్థాలతో తయారుచేసిన న్యాచురల్‌ బ్యూటీ రెసిపీస్‌ గురించి మరింత లోతుగా తెలుసుకున్నా. వాటి స్ఫూర్తితోనే వంద శాతం వీగన్‌ ఆధారిత, సహజసిద్ధమైన బ్యూటీ ఉత్పత్తుల్ని తయారుచేయడం ప్రారంభించా. ప్రాచీన పద్ధతులకు ఆధునిక ప్రమాణాల్ని జోడిస్తూ తయారుచేస్తోన్న మా ఉత్పత్తుల్లో మునగ ఆకులు, హెంప్‌ మొక్క ఆకులు, అశ్వగంధ, సరస్వతీ ఆకులు, గ్రేప్‌ సీడ్‌ ఆయిల్‌.. వంటివి ఉపయోగిస్తున్నాం. ఈ క్రమంలోనే ముఖానికి, జుట్టుకు ఉపయోగించే ఆయా సౌందర్యోత్పత్తులతో పాటు బాత్‌ కేర్‌, లిప్‌ కేర్‌, మేకప్‌.. తదితర న్యాచురల్‌ బ్యూటీ ఉత్పత్తుల్నీ మార్కెట్లో అందుబాటులో ఉంచాం. ప్రారంభం నుంచే మా ఉత్పత్తులకు ఆదరణ రావడం మొదలైంది. ప్రస్తుతం వెబ్‌సైట్‌తో పాటు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికగా మా ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది..’ అంటోన్న రితిక.. మన ఆయుర్వేద పద్ధతులపై విదేశాల్లో అవగాహన పెంచడమే తన ముందున్న లక్ష్యమంటోంది.


ఫిల్మ్‌ మేకర్‌.. పెట్‌ లవర్!

⚛ ఇలా తన సంస్థ వేదికగా తయారుచేస్తోన్న సహజసిద్ధమైన, వీగన్‌ బ్యూటీ ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా పాపులరైన రితిక.. సమాజ సేవలోనూ ముందే ఉంటుంది. ఈ క్రమంలోనే కొవిడ్‌ సమయంలో నెలల పాటు ఉచితంగా ఆహార పంపిణీ చేసి తన మంచి మనసును చాటుకుంది.

⚛ రితిక ఫిల్మ్‌మేకర్‌ కూడా! ‘సేవింగ్‌ చింటూ’ పేరుతో ఆమె రూపొందించిన లఘుచిత్రం 2021లో ఆస్కార్‌ రేసులో నిలవడం విశేషం.

⚛ ప్రముఖ హాస్య నటి లిల్లీ సింగ్‌ తన స్ఫూర్తి అంటోన్న రితిక ‘సవాళ్లను సానుకూలంగా స్వీకరించినప్పుడే ఎంచుకున్న రంగంలో విజయం సాధించగలం. అలాగే ఇతరుల నుంచి సలహాలు తీసుకోవడాన్నీ నామోషీగా ఫీలవ్వద్దు..’ అని చెబుతోంది.

⚛ ఈ బిజినెస్‌ లేడీ పెట్‌ లవర్‌ కూడా! విస్కీ అనే ఓ బుజ్జి కుక్క పిల్లను పెంచుకుంటోన్న రితిక.. ఎక్కడికెళ్లినా తనను వెంట పెట్టుకొని వెళ్తుంటుంది. దాంతో దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్