Published : 21/01/2023 00:02 IST

యువరాణినేం కాదు!

‘నైకా’ విజయంతో నాది యువరాణి హోదా అనుకుంటారు చాలామంది. కానీ.. అమ్మ వ్యాపారం చేయాలన్న ఆలోచన చెప్పినప్పటి నుంచి ఏ రంగమైతే బాగుంటుంది, మార్కెటింగ్‌, పెట్టుబడి వంటి అన్ని అంశాల్లో నా పాత్రా, కష్టం ఉంది. తిరస్కరణలూ బోలెడు. అవన్నీ కొలిక్కి వచ్చాకే చదువు పూర్తిచేయడానికి వెళ్లా. నా శక్తిసామర్థ్యాలు తెలుసుకోవాలని ఏడాది ఉద్యోగమూ చేశా. కానీ అది నాకంత ఛాలెంజింగ్‌గా అనిపించక తిరిగి అమ్మతో పనిచేయడం మొదలుపెట్టా. ఉదయాన్నే లేచాక చేయబోయే పని ఉత్సాహాన్నివ్వాలి. నా సామర్థ్యానికి పదును పెట్టేలా ఉండాలి. ‘పనీ’ జీవితంలో భాగంగా ఉండాలి. అదే నేను కోరుకున్నది. నైకా నాకవన్నీ ఇచ్చింది. అందుకే ఉత్సాహంగా చేస్తున్నా. మీకూ అలాంటి పని వాతావరణం కావాలా? అయితే..

కష్టపడే తత్వం, సాధించాలన్న తపన అలవాటు చేసుకోండి. విజయ రహస్యమిదే. ఇవి ఎంత కష్టమైన ప్రాజెక్టులనైనా ధైర్యంగా తీసుకునేలా చేస్తుంది. పూర్తిచేయాలన్న కసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

శారీరకంగా, మానసికంగా దృఢంగా అవ్వండి. ఆరోగ్యంపై దృష్టిపెడుతూనే ఎలాంటి స్థితిలోనైనా కుంగిపోకుండా ఉండాలి. నాయకురాలే బెదిరితే ఆమెను అనుసరించే వారు నిలబడలేరు. మనసు సున్నితంగా ఉండొచ్చు. ఆలోచనలు, నిర్ణయాల విషయంలో మాత్రం కఠినంగా ఉండాలి. వందల సంస్థలను పరిశీలించి నేను నేర్చుకుని, అనుసరిస్తున్న సూత్రమిది.

చివరగా.. మన అమ్మాయిలం ఎక్కువగా ఎదుటివాళ్లని ‘మెప్పించడం’పైనే శక్తిని ధారపోస్తుంటాం. వాళ్లు కోరుకున్న విధంగా మనల్ని మనం మలచుకునే ప్రయత్నంలో అలసిపోతుంటాం. అలా వద్దు. మీలా మీరుండండి. విమర్శలొచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటారు.

- అద్వైత నాయర్‌, సీఈఓ, నైకా ఫ్యాషన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి