Published : 16/03/2023 21:02 IST

ఆయిలీ స్కిన్‌పై అపోహలు మానండి..!

ఆయిలీ స్కిన్ ఎప్పుడూ జిడ్డు కారుతూ ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు.. కానీ ఈ రకమైన చర్మతత్వం ఆరోగ్యకరమైనది అని నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ తరహా చర్మతత్వం ఉన్నవారు ఎప్పుడూ తమ చర్మాన్ని పొడిబారేలా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. జిడ్డును తగ్గించే క్రీములు వాడడం, పౌడర్ సాయంతో చర్మం పొడిగా కనిపించేలా చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల తమ సమస్యను వారు మరింత పెంచుకుంటున్నట్లే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో జిడ్డు చర్మతత్వం కలిగిన వారికి ఉండే కొన్ని అపోహలు, వాస్తవాలు.. తెలుసుకుందాం రండి..

సన్‌స్క్రీన్ అవసరమే...

సూర్యకాంతి మన చర్మంలో సహజమైన నూనెల ఉత్పత్తిని కొంతవరకు తగ్గించినా.. ఇది చర్మంపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. 'అసలే చర్మం జిడ్డుగా ఉంది... దీనికి తోడు సన్‌స్క్రీన్ రాసుకుంటే ఇంకా జిడ్డుగా తయారవుతుందని' కొంతమంది సన్‌స్క్రీన్ రాసుకోవడం మానేస్తారు. కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు. మన శరీరానికి విటమిన్ 'డి' అందడం కోసం కొంత సూర్యకాంతి తగలడం అవసరమే.. కానీ పూర్తిగా సన్‌స్క్రీన్‌కు దూరంగా ఉంటే చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చర్మం నల్లబడడం, ముడతలు పడడం వంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే సన్‌స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి.

మాయిశ్చరైజర్ తప్పనిసరి..

జిడ్డు చర్మం ఉన్నవారిలో చాలామంది తమ చర్మం సహజమైన నూనెలతో నిండి ఉంది కాబట్టి దానికి తిరిగి మళ్లీ ప్రత్యేకంగా మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు. కానీ ఇది చాలా తప్పు. ఎలాంటి చర్మానికైనా మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి. అయితే ఆయిలీ స్కిన్ ఉన్నవారు మాత్రం ఆయిల్ బేస్డ్ కాకుండా వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇది అప్త్లె చేయడానికి ముందుగా టోనర్‌తో చర్మాన్ని శుభ్రపర్చుకొని ఆ తర్వాత వాటర్ బేస్‌డ్ మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి. దీనివల్ల చర్మానికి తగిన పోషణ అందడమే కాదు.. జిడ్డుగా కూడా కనిపించకుండా ఉంటుంది.

పౌడర్ సమస్యను తగ్గించదు..

జిడ్డు చర్మతత్వంతో బాధపడుతున్న వారిలో చాలామంది చర్మం జిడ్డు కారుతోందని పౌడర్‌తో దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల సమస్య తాతాల్కికంగా తగ్గుతుంది. చర్మం కాస్త జిడ్డుగా కనిపించకుండా జాగ్రత్తపడచ్చు. కానీ తర్వాత దాని ప్రభావం వల్ల చర్మం పాడవుతుంది. ఈ పౌడర్ చర్మ రంధ్రాలను మూసేయడం వల్ల చర్మం దురద పెట్టినట్లుగా అనిపించడం, మొటిమలు ఎక్కువగా రావడం వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల సమస్య తగ్గడం పక్కన పెట్టి మరింత ఎక్కువవుతుంది. చర్మ గ్రంథులు మూసుకుపోవడం వల్ల చర్మానికి తగినంత పోషణ అందట్లేదని సెబేషియస్ గ్రంథులు మరింత ఎక్కువ నూనెలను విడుదల చేస్తాయి. అందుకే పౌడర్‌ని ఉపయోగించడం కంటే సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి జిడ్డుదనాన్ని తగ్గించుకోవడం మంచిది.

కారణాలెన్నో...

చర్మ సమస్యలు మొదలు కాగానే చాలామంది అది తమ లైఫ్‌స్త్టెల్ వల్లే వస్తుంది అనుకొని దాన్ని మార్చుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకవేళ మీరు అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లను వదిలేస్తే మంచిదే.. కానీ జిడ్డు చర్మం వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలని పూర్తిగా జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోవడం సరికాదు.. ఎందుకంటే కొన్నిసార్లు మనమేమీ చేయకపోయినా జన్యుపరంగా కూడా ఇలాంటివి వస్తుంటాయి. జిడ్డు చర్మం కూడా అందులో ఒకటి. యవ్వన దశకు రాగానే ప్రారంభమయ్యే ఈ సమస్య మన ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. కానీ దీనికి కుంగిపోకుండా మనం ఎలా ఉన్నామో.. అలాగే మనల్ని మనం ప్రేమించుకోవడం ప్రారంభించాలి. అంతేకాదు.. ఆరోగ్యకరమైన స్కిన్‌కేర్ రొటీన్ పాటిస్తూ, పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్యను కొద్దిగా తగ్గించుకునే వీలుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని