Oprah Winfrey: అధిక బరువుతో పాతికేళ్లు ఇబ్బంది పడ్డా!

స్థూలకాయం.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ సమస్య వల్ల ఎంతోమంది విమర్శల్నీ ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 వందల కోట్ల మంది మధ్య వయస్కులు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం తానూ ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు అమెరికాకు చెందిన సుప్రసిద్ధ టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే....

Updated : 04 Oct 2023 16:50 IST

(Photos : Screengrab)

స్థూలకాయం.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ సమస్య వల్ల ఎంతోమంది విమర్శల్నీ ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 వందల కోట్ల మంది మధ్య వయస్కులు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం తానూ ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు అమెరికాకు చెందిన సుప్రసిద్ధ టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే. ఇటీవలే తన వెబ్‌సైట్‌ ఓప్రా డెయిలీ వేదికగా నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆమె.. ఆరోగ్యం, అధిక బరువు-దీనివల్ల మానసిక ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలు.. తదితర అంశాలపై నిపుణులతో చర్చించారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు తన అధిక బరువు, దీని మూలంగా తానెదుర్కొన్న విమర్శలు.. వంటివన్నీ గుర్తు చేసుకున్నారామె. ఈ నేపథ్యంలో ఓప్రా వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

వినోద, మీడియా రంగాల్లో ఓప్రా విన్‌ఫ్రే పేరు తెలియని వారుండరు. అమెరికన్‌ టాక్‌ షో వ్యాఖ్యాతగా, టీవీ నిర్మాతగా, నటిగా, రచయిత్రిగా, మీడియా పర్సనాలిటీగా.. బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తోన్న ఆమె.. ‘ది ఓప్రా విన్‌ఫ్రే షో’తో ప్రపంచవ్యాప్తంగా పాపులరయ్యారు. పలు సామాజిక సమస్యలు, మహిళలకు సంబంధించిన అంశాల పైనా స్పందిస్తుంటారామె. ఈ క్రమంలోనే పలు టాక్‌ షోలూ నిర్వహిస్తూ/వాటికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. ఆయా విషయాలపై అందరిలో స్ఫూర్తి నింపుతుంటారు ఓప్రా.

షాపింగ్‌లో చేదు అనుభవం!
ఇటీవల అలాంటి ఓ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఓప్రా. తన వెబ్‌సైట్‌ వేదికగా నిర్వహించిన ‘The Life You Want Class: The State Of Weight’ అనే చర్చా కార్యక్రమానికి హోస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె.. ఇందులో పాల్గొన్న వైద్య నిపుణులతో అధిక బరువు గురించి చర్చించారు. నిజానికి మొన్నటివరకు ఎంతో బొద్దుగా కనిపించిన ఓప్రా.. కాస్త సన్నబడి ఇటీవలే మీడియా కంటికి చిక్కడంతో ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నాజూగ్గా మారిన ఆమె ఫొటోలు చూసిన ఫ్యాన్స్‌ ఒక్కసారిగా షాకయ్యారు. తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఈ చర్చా కార్యక్రమంలో.. తన అధిక బరువు కారణంగా తానెదుర్కొన్న విమర్శలు, ఇబ్బందుల గురించి ప్రస్తావించారామె.
‘నా జీవితంలో ఎక్కువ సమయం కెమెరా ముందే గడిచిపోయింది. దీంతో ఇప్పటిదాకా మీరంతా నన్ను బొద్దుగానే చూశారు. గత కొన్నేళ్లలో నా బరువు గరిష్టంగా 107 కిలోలకు పెరిగింది. అధిక బరువు విషయంలో నాకంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్న సెలబ్రిటీలు మరొకరు ఉన్నారో, లేరో నాకు తెలియదు. అయితే నా అధిక బరువు కారణంగా నన్ను ఒక్కొక్కరూ ఒక్కోలా ట్రీట్‌ చేసేవాళ్లు. ముఖ్యంగా షాపింగ్‌కి వెళ్లినప్పుడు.. ‘ఇక్కడ మీ శరీరాకృతికి సరిపోయే దుస్తులు, ఫ్యాషన్‌ యాక్సెసరీస్‌ ఏవీ లేవు’ అని నిర్మొహమాటంగా చెప్పేవారు. ఇలాంటి విమర్శలు, అధిక బరువు విషయంలో ఈ సమాజంలో ఉన్న వివక్ష పాతికేళ్ల పాటు నన్ను ఇబ్బంది పెట్టాయి. ఈ క్రమంలో నా ఆలోచనల్ని అదుపు చేసుకోలేక కెమెరా ముందుకొచ్చినప్పుడల్లా ఆత్మన్యూనతకు గురయ్యేదాన్ని..’ అంటూ చెప్పుకొచ్చారు ఓప్రా.

అలా 18 కిలోలు తగ్గా!
అధిక బరువు వల్ల ఎదురయ్యే విమర్శలతో ఒకప్పుడు ఇబ్బంది పడిన ఓప్రా.. ఆపై బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానని, ఈ క్రమంలోనే డైటింగ్‌ మొదలుపెట్టానని చెబుతున్నారు.
‘నిజానికి బరువు తగ్గడానికి కూడా మాత్రలు, ఔషధాలు ఉంటాయని నాకు తెలియదు. తీరా దీని గురించి తెలిసే సమయానికి నా మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. అందుకే మందుల వాడకం లేకుండానే ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, జీవనశైలితోనే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే రోజువారీ ఆహారంలో 20 శాతం ప్రొటీన్లు, 30 శాతం ఆరోగ్యకరమైన కొవ్వులు, 50 శాతం కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకున్నా. మొత్తంగా రోజూ 1700 క్యాలరీలున్న ఆహార పదార్థాలు తీసుకున్నా. 1100 మిల్లీగ్రాముల క్యాల్షియం శరీరానికి అందేలా జాగ్రత్తపడ్డా. ఇక రోజూ 34 గ్రాముల పీచును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగింది.
*ఈ పోషకాలన్నీ శరీరానికి అందేలా.. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా పండ్లు, కమలాఫలం రసం, గుప్పెడు బాదంపప్పులు, ఓట్‌మీల్‌, వాల్‌నట్స్‌, చాక్లెట్‌-స్ట్రాబెర్రీ స్మూతీ, బ్రెడ్‌ టోస్ట్‌-పీనట్‌ బటర్‌.. వంటివి రోజుకొకటి చొప్పున తీసుకున్నా.
*ఇక మధ్యాహ్న భోజనంలోకి.. కాయగూరలు-పండ్ల ముక్కలు కలిపి తయారుచేసిన సలాడ్‌, శాండ్‌విచ్‌, టొమాటో-పుట్టగొడుగులతో తయారుచేసిన వెజిటబుల్‌ కబాబ్‌, గోధుమ బ్రెడ్‌పై కాల్చిన చికెన్‌, గ్రిల్‌ చేసిన ఉల్లిపాయలు, అవకాడో-టొమాటో ముక్కలు, ఆకుకూరల తురుము.. వంటివి లేయర్లుగా పరచుకొని ఆలివ్‌ ఆయిల్‌తో గార్నిష్‌ చేసుకొని తీసుకునేదాన్ని.
*రాత్రి భోజనంలో తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యమిచ్చేదాన్ని. ఈ క్రమంలో తక్కువ ఆలివ్‌ నూనెలో వేయించిన కాయగూర ముక్కలు, చికెన్‌ బ్రెస్ట్‌ కట్‌లెట్స్‌, పండ్ల ముక్కలతో తయారుచేసిన సలాడ్‌, గ్రిల్‌ చేసిన కాయగూర ముక్కలు.. వంటివి తీసుకునేదాన్ని.
*లంచ్‌, డిన్నర్‌కి మధ్య ఆకలి వేయకుండా.. పండ్లు, ఉడికించిన కోడిగుడ్లు, ఆలివ్‌ నూనెతో గ్రిల్‌ చేసిన కాయగూర ముక్కలు, డార్క్‌ చాక్లెట్‌.. ఇలా రోజుకొక రుచిని ఆస్వాదించేదాన్ని.
ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటిస్తూ కొన్ని నెలల్లోనే సుమారు 18 కిలోలు తగ్గాను..’ అంటూ తాను పాటించిన డైట్‌ సీక్రెట్స్‌ గురించి పంచుకున్నారామె.

ఆ హక్కు ఎవరికీ లేదు!
కేవలం బరువు విషయంలోనే కాదు.. అందం, ఆరోగ్యం, ఫ్యాషన్‌.. తదితర అంశాల్లోనూ సమాజం నుంచి ఎంతోమంది విమర్శలు ఎదుర్కొంటున్నారని గుర్తించిన ఓప్రా.. వీటన్నింటినీ ఎదుర్కొని ప్రతి ఒక్కరూ అత్యుత్తమ జీవితం గడిపేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే తన వెబ్‌సైట్‌ ‘ఓప్రా డెయిలీ’ వేదికగా అందం, ఆరోగ్యం, జీవనశైలి, మహిళా సమస్యలపై నిపుణుల సలహాలు, సూచనలు అందిస్తున్నారామె.
‘అది అధిక బరువైనా, ఆరోగ్య సమస్యైనా.. ప్రతి ఒక్కరూ తమ అనుభవాల్ని బహిరంగంగా పంచుకోవాలి. ఎందుకంటే మనందరం విభిన్న వ్యక్తులం. నా విషయంలో ఏది వర్కవుట్‌ అవుతుందో.. అది మరొకరి విషయంలో కాకపోవచ్చు. అలాగే ఏ విషయంలోనైనా ఇతరుల్ని జడ్జ్‌ చేసే హక్కు నాకు లేదు.. నన్ను జడ్జ్‌ చేసే హక్కు, అధికారం ఇతరులకు లేదు. కాబట్టి ఎదుటివారి విషయంలో ఇలాంటి తీర్పులు, విమర్శల్ని పక్కన పెట్టి.. ఎలా ఉన్నా తమ శరీరాన్ని తాము స్వీకరించే, ప్రేమించే అవకాశాన్ని వారికి అందించాలి. ఈ స్వీయ ప్రేమే మనల్ని వ్యక్తిగతంగా, కెరీర్‌లో పాజిటివ్‌గా ముందుకెళ్లే శక్తినిస్తుంది..’ అంటూ స్ఫూర్తి నింపారీ మీడియా మొఘల్‌.

ప్రస్తుతం 69 ఏళ్ల వయసున్న ఓప్రా దాదాపు ఐదు దశాబ్దాలుగా మీడియా, వినోద రంగాల్లో దూసుకుపోతున్నారు. ‘హార్పో ప్రొడక్షన్స్‌’ అనే మల్టీ మీడియా ప్రొడక్షన్‌, ‘ఓప్రా విన్‌ఫ్రే కేబుల్‌ నెట్‌వర్క్‌’ సంస్థల్ని స్థాపించిన ఆమె.. సమాజ సేవలోనూ ముందుంటారు. ఎక్కువగా విద్యాపరమైన సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకునే ఓప్రా.. తన సుదీర్ఘ కెరీర్‌, సేవలకు గుర్తింపుగా అమెరికాలోనే అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’తో పాటు పలు అవార్డులు-రివార్డులు సొంతం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్