విరుష్క పుత్రోత్సాహం.. మనం ఇవి తెలుసుకోవాల్సిందే!

సెలబ్రిటీలే అయినా కొందరు తమ వ్యక్తిగత జీవితాన్ని కెమెరా కంటికి దూరంగా ఉంచుతుంటారు. చాలా విషయాల్లో వ్యక్తిగత గోప్యత పాటిస్తుంటారు. అలాంటి వారిలో స్టార్‌ కపుల్‌ విరాట్‌ కోహ్లీ-అనుష్కా శర్మ జంట ఒకటి.

Updated : 22 Feb 2024 21:44 IST

(Photos: Instagram)

సెలబ్రిటీలే అయినా కొందరు తమ వ్యక్తిగత జీవితాన్ని కెమెరా కంటికి దూరంగా ఉంచుతుంటారు. చాలా విషయాల్లో వ్యక్తిగత గోప్యత పాటిస్తుంటారు. అలాంటి వారిలో స్టార్‌ కపుల్‌ విరాట్‌ కోహ్లీ-అనుష్కా శర్మ జంట ఒకటి. ఇటీవలే రెండోసారి తల్లిదండ్రులైన వీరు.. బిడ్డ పుట్టేంత వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. అనుష్క రెండో ప్రెగ్నెన్సీ గురించి ఎన్ని రూమర్లొచ్చినా వీళ్లు మాత్రం స్పందించలేదు. ఇక ఆఖరికి తమకు కొడుకు పుట్టాడన్న విషయం సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరిందీ జంట. నిజానికి ఇలా ప్రెగ్నెన్సీ, డెలివరీ.. వంటి విషయాల్లో ఆర్భాటం చేయకుండా, వ్యక్తిగత విషయాల్లో ప్రైవసీ పాటిస్తూ మరోసారి అందరి మనసులు దోచుకున్నారీ లవ్లీ కపుల్‌. ఇప్పుడే కాదు.. తమ కూతురు వామిక విషయంలోనూ ప్రైవసీ పాటిస్తూ ఈతరం తల్లిదండ్రులకు బోలెడన్ని పేరెంటింగ్‌ పాఠాలు నేర్పిందీ అందాల జంట. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

వామిక.. అక్కైంది!

సెలబ్రిటీ జంటల్లో విరాట్‌ కోహ్లీ-అనుష్కా శర్మ జంట ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ క్యూట్‌ కపుల్‌.. ప్రతి విషయంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ నేటి జంటలకు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతుంటారు. 2021లో వామిక అనే కూతురుకు జన్మనిచ్చిన ఈ స్టార్‌ కపుల్‌ ఇటీవలే రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ‘ఫిబ్రవరి 15న మాకు కొడుకు పుట్టాడు.. వామిక అక్కైంది. మా చిన్నారికి అకాయ్‌ అని పేరు పెట్టుకున్నాం’ అంటూ తాజాగా ఈ జంట సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. తమ వైవాహిక బంధం, వ్యక్తిగత విషయాలు, తమ కూతురికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రైవసీ పాటిస్తూ వచ్చిన ఈ జంట.. తమ రెండో ప్రెగ్నెన్సీ విషయాన్నీ బయటపెట్టలేదు. బిడ్డ పుట్టాకే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది. అయితే ఇలా తమ పిల్లల విషయంలో ప్రైవసీ పాటిస్తూ ఈతరం తల్లిదండ్రులకు పలు పేరెంటింగ్‌ పాఠాలూ నేర్పుతోందీ అందాల జంట. ఇంతకీ అవేంటంటే..!


కెమెరాకు దూరంగా.. పిల్లలకు దగ్గరగా!

కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకోవాలని ఆరాటపడుతుంటారు. కానీ విరుష్క జంట ఇందుకు పూర్తి భిన్నం. తమ కూతురు వామిక పుట్టి మూడేళ్లు కావస్తోన్నా ఇప్పటికీ ఆ చిన్నారి అధికారిక ఫొటో ఒక్కటి కూడా బయటపెట్టలేదీ జంట. ఇలా తమ పిల్లల్ని కెమెరా కంటికి, స్టార్‌ కిడ్‌ కల్చర్‌కి దూరంగా ఉంచి పెంచడానికే ఇష్టపడుతున్నట్లు చెప్పకనే చెబుతోందీ జంట. నిజానికి పిల్లల విషయంలో ఇలాంటి ప్రైవసీ వాళ్లు సురక్షితంగా ఎదిగేందుకు దోహదం పడుతుందని చెప్పచ్చు.

విరాట్‌, అనుష్కలు తమ కెరీర్‌ల్లో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితానికీ తగిన సమయం కేటాయిస్తుంటారు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. ఇప్పుడు కూడా అనుష్క డెలివరీ కోసం విరాట్‌ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరమై కుటుంబానికి ప్రాధాన్యమిచ్చాడు. ఇలా జీవితంలో కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికీ సమప్రాధాన్యమివ్వాలని పరోక్షంగా చాటిచెప్పింది విరుష్క జంట. అంతేకాదు.. పిల్లలకు ఇలా తగిన సమయం కేటాయించడం వల్ల వారికి తల్లిదండ్రుల ప్రేమ సమానంగా అందుతుందని, అది అన్ని విధాలుగా వారి ఎదుగుదలకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కెరీర్‌ రీత్యా ప్రస్తుతం చాలా జంటలు తమ సొంతూరిని వదిలి ఇతర ప్రాంతాల్లో ఉండాల్సి వస్తోంది. దీనివల్ల చిన్నారులు తమ గ్రాండ్‌ పేరెంట్స్‌ ప్రేమకు దూరమవుతున్నారు. కానీ తమ పిల్లలకు ఈ ప్రేమను అందేలా చేస్తున్నామంటూ గతంలో అనుష్క ఓ సందర్భంలో పంచుకుంది. దీనివల్ల వారు జీవితానికి సంబంధించిన ఎన్నో విలువలు నేర్చుకోగలుగుతారంటూ చెప్పుకొచ్చిందామె.

వృత్తి, ఉద్యోగాల్లో కొనసాగే దంపతులు తమ పిల్లలకు కెరీర్‌ విషయంలో ప్రత్యక్ష మార్గదర్శకులవుతారు. విరుష్క జంట కూడా తమ తమ వృత్తుల్లో నిబద్ధతతో కొనసాగుతూ వస్తున్నారు. ఇది భవిష్యత్తులో వారి పిల్లలపై సానుకూల ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘నానీ కల్చర్‌’ కొనసాగుతోంది. ఈ క్రమంలో చాలామంది సెలబ్రిటీలే కాదు.. కొంతమంది సామాన్యులూ తమ పిల్లల బాగోగులు చూసుకోవడానికి ప్రత్యేకంగా ఓ మహిళ (బేబీసిట్టర్‌)ను నియమించుకుంటున్నారు. బయటికి వెళ్లినా వారిని వెంట తీసుకెళ్తూ.. పిల్లల్ని వారికే అప్పగిస్తుంటారు. నిజానికి ఇది సరికాదంటున్నారు నిపుణులు. మనం గమనిస్తే విరుష్క జంట ఎప్పుడూ ఇలా చేయలేదు. జంటగా తామెప్పుడు బయటికి వెళ్లినా.. తమ కూతురిని తమ వద్దే ఉంచుకుంటూ కెమెరా కంటికి చిక్కేది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఇలా పిల్లల సంరక్షణ బాధ్యతల్ని తల్లిదండ్రులే పూర్తిగా నిర్వర్తిస్తే.. పేరెంట్స్‌కి పిల్లలకు మధ్య అనుబంధం దృఢమవుతుంది.. అలాగే వారిని ఓ కంట కనిపెడుతూ వారి అవసరాలూ తెలుసుకొని తీర్చే అవకాశమూ దొరుకుతుంది.. పిల్లలూ సురక్షితంగా ఎదుగుతారు.

విరాట్‌, అనుష్కలకు దైవభక్తి ఎక్కువ. విదేశీ పర్యటలనకు వెళ్లినప్పుడల్లా తమ కూతురిని వెంటేసుకొని అక్కడి దేవాలయాల్ని సందర్శించడం మనం చూశాం. అంతెందుకు.. తమ పిల్లలిద్దరి పేర్లు కూడా ఆధ్యాత్మిక భావమొచ్చేలాగే పెట్టుకుందీ జంట. ఇలా చిన్నతనం నుంచే తమ పిల్లలకు ఆధ్యాత్మికతను అలవర్చే ప్రయత్నం చేస్తున్నారీ క్యూట్‌ కపుల్‌. ఇది వారిని మానసికంగా, ఎమోషనల్‌గా దృఢంగా మార్చుతుంది.

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిద్దరిదీ సమాన పాత్ర. విరుష్క జంట ఈ బాధ్యతల్ని సమానంగానే నిర్వర్తిస్తూ వస్తున్నారు. తమ కూతురి పెంపకం, ఇతర విషయాల్లోనూ ఇద్దరూ కలిసే నిర్ణయాలు తీసుకుంటామని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారీ లవ్లీ పేరెంట్స్‌.

అంతేకాదు.. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ విషయంలోనూ తమ పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారీ దంపతులు. ఈ క్రమంలో అటు వృత్తిని ప్రేమిస్తూనే.. ఇటు ఇల్లు-పిల్లల బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఈతరం జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ బ్యాలన్సింగ్‌ పాఠాలు భవిష్యత్తులో తమ పిల్లలిద్దరికీ స్ఫూర్తినిస్తాయని నిపుణులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్